Australian Vlogger Questions: మీరెందుకు ఎప్పుడూ స్లమ్ ఏరియాలకే వెళతారు.. ఆస్ట్రేలియన్ సూటి ప్రశ్న
ABN , Publish Date - Dec 01 , 2025 | 03:53 PM
భారత్‌లో పర్యటించే విదేశీయులు నిత్యం స్లమ్ ఏరియాలు మాత్రమే చూడాలని ఎందుకు అనుకుంటారంటూ ఓ ఆస్ట్రేలియా వ్లాగర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ అంశాన్ని హైలైట్ చేసేందుకు ప్రయత్నించిన అతడిపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: అనేక రంగాల్లో భారత్ దూసుకుపోతోంది. కానీ చాలా మంది విదేశీయులకు మన దేశం పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది స్లమ్ ఏరియాలు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు ఇందుకు ప్రధాన కారణం. అయితే, ఇలాంటి భావనలుండే ఫారినర్లకు ఓ విదేశీయుడు సూటి ప్రశ్న వేశారు. అది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది (Australian Vlogger).
మణిపూర్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా ట్రావెల్ వ్లాగర్ డంకన్ తాజాగా అక్కడి ప్రకృతి అందాలను వీడియోలో రికార్డు చేసి నెట్టింట పంచుకున్నారు. దీంతో పాటు, భారత్‌లోని పేదరికాన్ని హైలేట్ చేయాలనుకునే విదేశీయులపై సూటి ప్రశ్నలు సంధించారు.
‘మీరు (ఫారినర్లు) ఇండియాకు వస్తారు. ఆ తరువాత నేరుగా ఢిల్లీలోని స్లమ్ ఏరియాలను చూసేందుకు వెళతారు. ఎందుకిలా? మీరు లోక్‌టక్ సరస్సు లాంటి ప్రాంతాలను చూసేందుకు ఎందుకు వెళ్లరు? ఇక్కడి సాయంకాలం ప్రకృతి అందాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. స్థానికులతో సరదాగా గేమ్స్ కూడా ఆడొచ్చు. ఇలాంటి అందాలకు నెలవైన ప్రాంతాలు ఎక్కడున్నాయో తెలుసుకోండి. ఇందుకోసం కాస్త సమయం వెచ్చించండి. భారత్‌లో ఒకే కోణాన్ని విదేశీయులు చూస్తుండటం చాలా విచారకరం’ అని అన్నాడు. భారత్‌లో స్థానికులను, లేదా స్నేహితులను అడిగితే వారు చూడచక్కనైన ప్రదేశాలు ఎక్కడ ఉంటాయో చెబుతారని సూచించారు.
ఇక ఈ వీడియోకు సహజంగానే పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. భారత్‌లోని సానుకూల అంశాలను హైలైట్ చేసేందుకు అతడు చేసిన ప్రయత్నంపై జనాలు ప్రశంసలు కురిపించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకృతి అందాలు అద్భుతమని అనేక మంది కామెంట్ చేశారు. అవి స్వర్గంతో సమానమని అన్నారు.
డంకన్ గతంలో కూడా ఇలాంటి అనేక వీడియోలు చేశారు. భారత్‌పై పాశ్చాత్య దేశాల్లో అనేక తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయని అన్నాడు. వీటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ‘భారత్‌పై నిత్యం ఓ పక్షపాత ధోరణి కనిపిస్తుంటుంది. అసాధారణ విషయాలను హైలైట్ చేసేందుకే ప్రయత్నాలు జరుగుతుంటాయి. వాస్తవానికి ఇది అనేక సంస్కృతులతో విలసిల్లే అందమైన దేశం. ఇక్కడి జనాలు కూడా అద్భుతం’ అని ఒక వీడియోలో కామెంట్ చేశాడు.
ఇవీ చదవండి:
నెదర్‌ల్యాండ్స్‌లో పరిస్థితిపై భారతీయుడి వీడియో.. నెట్టింట భారీ చర్చ
వామ్మో.. ఇంజనీరింగ్ జాబ్ మానేసిన మహిళ.. త్వరలో డాక్టర్‌గా కొత్త జర్నీ