Share News

Australia Woman - VAD: 25 ఏళ్ల వయసులోనే కారుణ్య మరణాన్ని ఎంచుకున్న యువతి.. హృదయం ద్రవించే ఘటన

ABN , Publish Date - Nov 21 , 2025 | 08:59 AM

చికిత్సే లేని మెదడు వ్యాధితో బాధపడుతున్న ఓ ఆస్ట్రేలియా యువతి 25 ఏళ్ల వయసులోనే కారుణ్య మరణాన్ని ఎంచుకుంది. ఏళ్ల తరబడి నరకం అనుభవించిన తాను మనశ్శాంతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

Australia Woman - VAD: 25 ఏళ్ల వయసులోనే కారుణ్య మరణాన్ని ఎంచుకున్న యువతి.. హృదయం ద్రవించే ఘటన
Annalise Holland

ఇంటర్నెట్ డెస్క్: చికిత్సే లేని న్యూరోలాజికల్ వ్యాధితో సతమతమవుతున్న ఓ ఆస్ట్రేలియా యువతి 25 ఏళ్ల వయసులోనే కారుణ్య మరణాన్ని ఎంచుకుంది. వ్యాధి కారణంగా చిన్నతనం నుంచి రకరకాల సమస్యలతో నరకం అనుభవించిన ఆమె చివరకు జీవితాన్ని చాలించేందుకు నిర్ణయించింది (Australia- Voluntary Assisted Dying).

అడిలెయిడ్‌కు చెందిన అనాలిసే హోలాండ్‌ బాల్యమంతా ఆసుపత్రుల్లోనే గడిచిపోయింది. వివిధ అనారోగ్యాలు వేధించడంతో తరచూ హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చేది. చాలా కాలం పాటు ఆమె రోగానికి కారణమేంటో కూడా వైద్యులు గుర్తించలేకపోయారు. 18 ఏళ్ల వయసున్నప్పుడు యువతికి ఆటోఇమ్యూన్ గాంగ్లియోపతీ (Auto Immune Gangliopathy) అనే వ్యాధి ఉన్నట్టు తొలిసారిగా తెలిసింది. ఈ వ్యాధి ఉన్న వారిలో రోగనిరోధక శక్తి నాడీ కణాలపై దాడి చేస్తుంది. ఫలితంగా జీవక్రియలపై కూడా నియంత్రణ తప్పుతుంది. వయసు పెరిగే కొద్దీ ఆమె ఆరోగ్యం క్షీణించింది. చివరకు ఆహారం తినలేకపోవడంతో పోషకాలను నేరుగా ఐవీ లైన్‌తో రక్తంలోకి ఎక్కించాల్సి వచ్చింది. బీపీ, గుండె చలనం రేటు, జీర్ణవ్యవస్థ వంటివన్నీ అదుపు తప్పిపోయాయి.


‘మలవిసర్జన కూడా ఆగిపోయింది. పేగుల్లోపల ఎలాంటి అడ్డంకులు లేకపోయినా మలవిసర్జన జరిగేది కాదు. ఫలితంగా లోపల వ్యర్థాలు పేరుకుపోయేవి. అవన్నీ వాంతుల రూపంలో బయటకు వచ్చేవి. ఇది చాలా జుగుప్సాకరమైన స్థితి. చివరకు డాక్టర్లు నాకు ప్రత్యేక ఆహారాన్ని ట్యూబుల ద్వారా నేరుగా రక్తంలోకి ఎక్కించడం ప్రారంభించారు. ఇలాంటప్పుడు రక్తంలోకి ఇన్ఫెక్షన్ ఏదైనా చేరితే మరింత ప్రమాదకరంగా మారుతుంది’ అని ఆమె చెప్పుకొచ్చింది.

రానురాను పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఆమె అవయవాలు దెబ్బతినడం ప్రారంభించాయి. వెన్నెముక విరిగింది. నిరంతరం నొప్పి, ఆందోళనతో సతమతమైంది. పలుమార్లు రక్తం‌లో ఇన్ఫెక్షన్ ప్రవేశించడంతో మరణం అంచుల వరకూ వెళ్లింది. రోగానికి చికిత్స కూడా లేకపోవడంతో యువతి తన జీవితాన్ని ముగించేందుకు నిర్ణయించింది. వాలంటరీ అసిస్టెడ్ డైయింగ్ ప్రక్రియతో తనువు చాలించాలని నిర్ణయించింది.


‘నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. పిల్లలు ఉన్నారు. నా జీవితం ముందుకెళ్లదు. ఇది జీవితం కాదు. ప్రతి రోజూ పోరాటం’ అని చెప్పింది.

వాలంటరీ అసిస్టెడ్ డయ్యింగ్ (వీఏడీ- కారుణ్య మరణం) కోసం ఆమె చేసుకున్న దరఖాస్తుకు అక్కడి ప్రభుత్వ ఆమోదం తెలిపింది. ఎట్టకేలకు తనకు మనశ్శాంతి లభించబోతున్నందుకు ఆమె హర్షం వ్యక్తం చేసింది. మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో యువతి తల్లిదండ్రులు కూడా ఆమె నిర్ణయానికి ఆమోదం తెలిపారు.


ఇవీ చదవండి:

క్యాండిల్స్ వినియోగంలో అజాగ్రత్త.. దేవాలయంలో భారీ అగ్నిప్రమాదం

వామ్మో మహిళా మేనేజర్.. ఉద్యోగిని తన కేబిన్‌కు రమ్మని..

Read Latest and Viral News

Updated Date - Nov 21 , 2025 | 09:11 AM