Assam: అస్సాంలో మళ్ళీ హింస..ఇద్దరు మృతి.. ఇంటర్నెట్ సేవలు బంద్
ABN , Publish Date - Dec 24 , 2025 | 08:06 AM
గత కొంత కాలంగా అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా తరుచూ జరుగుతున్న అల్లర్లను కంట్రోల్ చేయలేకపోతుంది. ఇక్కడ మరోసారి చెలరేగిన అల్లర్లకు ఇద్దరు బలయ్యారు.
అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో మళ్లీ హింస కొనసాగుతోంది. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నివసిస్తున్న వారిని ఖాళీ చేయాలని కొన్ని అల్లరి మూకలు గువాహాటికి సమీపంలో ఉన్న ఖైరోనీ (Kheroni)లో దుకాణాలు, వాహనాలను దగ్ధం చేశారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. పరిస్థితి అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించారు. దీంతో రెచ్చిపోయిన అల్లరి మూక పోలీసులపై రాళ్లు, బాంబులు, బాణాలతో ఎటాక్ చేశారు.
ఈ ఘటనలో దివ్యాంగుడైన సురేశ్ దేయ్(25), అతిక్ తిముంగ్‌లు మృతి చెందగా, 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 38 మంది పోలీసులు ఉన్నారు. వీరిలో ఒక ఐపీఎస్ అధికారి ఉన్నాడు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అల్లర్లు మరింత ప్రబలిపోకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యగా కర్బీ అంగ్లాగ్, పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు అధికారులు.
ఈ ఘటనపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందిస్తూ.. ‘పశ్చిక కర్బీ అంగ్లాంగ్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. శాంతిని కాపాడటానికి ఖేరానికి మరింత భద్రతా దళాలను పంపిస్తున్నాం. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి అన్ని పార్టీలతో సంప్రదిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. అన్నిరకాల సహాయాన్ని అందిస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు
For More National And Telugu News