Corsica ATC Crew Sleep: ఏటీసీ సిబ్బంది కునుకు.. ల్యాండింగ్ కుదరక 18 నిమిషాల పాటు గాల్లో విమానం చక్కర్లు
ABN , Publish Date - Sep 18 , 2025 | 02:08 PM
ఏటీసీ సిబ్బంది ఒకరు కునుకు తీయడంతో ల్యాండింగ్‌కు అనుమతి రాక ఓ విమానం దాదాపు 18 నిమిషాల పాటు గాల్లో చెక్కర్లు కొట్టిన ఘటన ఫ్రాన్స్‌లో చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది ఒకరు రాత్రివేళ కునుకులోకి జారుకోవడంతో ఓ విమానం ల్యాండింగ్ ఆలస్యమైంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో పైలట్ విమానాన్ని 18 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టించారు. ఫ్రాన్స్‌లోని కోర్సికా ద్వీపంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది (Air Corsica ATC asleep).
మీడియా కథనాల ప్రకారం ఎయిర్ కోర్సికాకు చెందిన ఏ320 విమానం అర్ధరాత్రి వేళ కోర్సికా ద్వీప రాజధాని అజాసియోలో గల ఎయిర్‌పోర్టులో దిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించారు. కానీ ఏటీసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ సమయంలో ఏటీసీ సెంటర్‌లో ఉన్న ఒకే ఒక వ్యక్తి కునుకులోకి జారుకున్నాడు. దీంతో, విమానం పైలట్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. ఇతర ఎయిర్‌పోర్టుల్లో దిగేందుకు మిగతా ఏటీసీలను సంప్రదించడం ప్రారంభించారు (Ajaccio airport incident).
విషయాన్ని కోర్సికా ఎయిర్‌పోర్టు సిబ్బందికి కూడా సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టు సిబ్బంది ఏటీసీ కార్యాలయానికి వెళ్లగా అక్కడ ఎవ్వరూ సమాధానం ఇవ్వలేదు. గది తలుపు తెరుచుకోలేదు. దీంతో, వారు పోలీసుల సాయంతో లోపలకు వెళ్లి చూడగా అక్కడున్న ఒకే ఒక ఉద్యోగి కునుకులో జోగుతూ కనిపించాడు. వాళ్లను చూసి లేచి కూర్చుని వెంటనే విమానం ల్యాండింగ్‌ను అనుకూలంగా చర్యలు తీసుకున్నాడు. రన్‌వేపై లైట్స్ ఆన్ చేయడంతో విమానం సేఫ్‌గా ల్యాండయ్యింది (flight circles due to ATC).
ఈ ఘటన జరిగిన విషయం వాస్తవమేనని ఫ్రెంచ్ పౌర విమానయాన శాఖ అంగీకరించింది. ఘటనపై విచారణ జరుపుతున్నట్టు తెలిపింది. ఏటీసీ సిబ్బందికి జరిపిన పరీక్షల్లో అతడు మద్యం, డ్రగ్స్ తీసుకోలేదన్న రిపోర్టు వచ్చిందని పేర్కొంది. అయితే, ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. ఫ్రాన్స్‌లో ఏటీసీ సిబ్బంది కొరత నానాటికీ తీవ్రమవుతోంది. సిబ్బంది కొరత కారణంగా మిగిలిన వారిపై భారం పెరుగుతోందని సిబ్బంది అనేక సందర్భాల్లో తమ నిరసనలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి:
హెచ్-1బీ వీసా పొరపాటు.. ఇలా చేస్తే జీవితం తలకిందులే
ఆ పుట్టుమచ్చ గురించి ఎలా తెలిసింది.. నానో బనానా ఫొటోతో మహిళకు షాక్