McDonough Asteroid: భూమికి చేరిన 4.56 బిలియన్ ఏళ్ల నాటి ఉల్క శకలం
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:59 PM
పుడమి కంటే పురాతనమైన ఓ ఉల్క శకలం ఇటీవలే అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో గల ఓ ఇంటిపై పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భూమి ఆవిర్భావానికి సంబంధించిన అనేక విషయాలు మిస్టరీగానే ఉన్నాయి. వీటిని ఛేదించడంలో శాస్త్రవేత్తలకు ఉల్కలు ఉపయోగపడతాయి. తాజాగా అమెరికాలో పడ్డ ఓ ఉల్క శకలం స్థానికంగా ఆసక్తి రేపుతోంది. ఇది భూమి పుట్టక మునుపే పుట్టింది. భూమి వైపు దూసుకొచ్చి ఇటీవలే జార్జియా రాష్ట్రంలోని ఓ ఇంటిపై పడింది. ఈ శకలం చిన్న టమాటా అంతటి సైజులో ఉండటంతో పెద్ద ప్రమాదమేమీ జరగకపోయినా పుడమి పుట్టుక రహస్యాలు ఛేదించడంలో ఇది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పట్టపగలు ఈ ఉల్క శకలం పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శాస్త్రవేత్తలు దీన్ని మెక్‌డాన అని పిలుస్తున్నారు. సూపర్ సోనిక్ వేగంతో కాంతిపుంజంలా దూసుకొచ్చి ఓ ఇంటిపై పడింది. ఇది పడిన చోట దాదాపు 1.5 సెంటీమీటర్ల మేర చిన్న గొయ్యి ఏర్పడింది. వేగంగా ఢీకొనడంతో అది చిన్నాభిన్నమైందని ఉల్క శకలాన్ని పరీక్షించిన శాస్త్రవేత్త హారిస్ తెలిపారు.
23 గ్రాముల బరువున్న శకలాన్ని సేకరించామని హారిస్ తెలిపారు. 4.56 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ ఉల్క ఏర్పడిందని, భూమి కంటే 20 మిలియన్ సంవత్సరాల ముందే పుట్టిందని తెలిపారు. సౌరమండలంలో ప్రస్తుతం మనం చూస్తున్న రాకీ ప్లానెట్స్ (గ్రహాలు) ఇలాంటి శకలాల నుంచే పుట్టాయని వివరించారు. వీటి అధ్యయనంతో భూమి పుట్టుకకు సంబంధించిన రహస్యాలు తెలుసుకోవచ్చని అన్నారు. కుజ, గురు గ్రహాల మధ్య ఉన్న ఉల్క మండలం నుంచి ఇది భూమి వైపు దూసుకొచ్చిందని అన్నారు. దీన్ని ప్రస్తుతం ప్రజల సందర్శనార్థం టెలస్ మ్యూజియంలో పెట్టారు.
ఉల్క తన ఇంటిపై పడగానే పెద్ద తుపాకీ పేలిన శబ్దం వచ్చిందని ఇంటి యజమాని తెలిపారు. అయితే, ఇలాంటి ఉల్క శకలాలతో ప్రమాదమేమీ ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటి అధ్యయనం ద్వారా భారీ శకలాల నుంచి వచ్చే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని వివరించారు.
భూమి వైపు దూసుకువచ్చే గ్రహశకలాలను దారి మళ్లించేందుకు నానా డార్ట్ మిషన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు వ్యోమనౌక సాయంతో ఓ ఆస్టరాయిడ్‌ను దారి మళ్లించగలిగారు. ఇక జార్జియాలో శాస్త్రవేత్తలు సేకరించిన 27వ ఉల్క శకలం ఇది కావడం గమనార్హం. ఇటీవల కాలంలో ప్రజల్లో అవగాహన పెరుగుతుండటంతో అనేక ఉల్కాపాతాల గురించి శాస్త్రవేత్తలకు తెలుస్తోందని నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి:
నాలుగు దశాబ్దాలుగా రోజూ 10 గంటల పాటు భిక్షాటన.. ఇతడి ఆస్తి ఎంతో తెలిస్తే..
వామ్మో జపాన్.. రైలు 35 సెకెన్లు ఆలస్యం అయినందుకు టిక్కెట్ డబ్బులు వాపస్