Share News

Bullet Train Delay: వామ్మో జపాన్.. రైలు 35 సెకెన్లు ఆలస్యం అయినందుకు టిక్కెట్‌ డబ్బులు వాపస్

ABN , Publish Date - Aug 09 , 2025 | 08:57 PM

జపాన్‌లో ఓ బుల్లెట్ రైలు 35 సెకెన్లు ఆలస్యం అయినందుకు ట్రెయిన్ కండక్టర్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పడమే కాకుండా వారి టిక్కెట్ డబ్బులను కూడా వాపస్ ఇచ్చారు. ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్‌ను కూడా ఈ ఉదంతం ఆకట్టుకుంది.

Bullet Train Delay: వామ్మో జపాన్.. రైలు 35 సెకెన్లు ఆలస్యం అయినందుకు టిక్కెట్‌ డబ్బులు వాపస్
Japan Bullet Train 35 Second Delay

ఇంటర్నెట్ డెస్క్: జపాన్ సంస్కృతి అంటేనే క్రమశిక్షణ, ఆత్మగౌరవం, నిబద్ధతకు ప్రతీక. ఈ అంశాన్ని మరోసారి రుజువు చేసే ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. క్రమశిక్షణకు జపాన్ జనాలు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో చాటి చెప్పే ఈ ఘటన ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్‌ను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ వార్తను నెట్టింట పంచుకున్న ఆయన జపాన్ సంస్కృతి గొప్పదనాన్ని ప్రశంసించారు.

షింకాసెన్ బుల్లెట్ రైళ్లకు జపాన్ ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. అత్యంత వేగంతో ప్రయాణించే ఈ రైళ్లు సమయ పాలన విషయంలో కూడా అంతే పాప్యులర్ అయ్యాయి. ఈ సేవల్లో ఆలస్యాన్ని ఆపరేటర్లు అస్సలు సహించరు. షెడ్యూల్‌లో గరిష్ఠంగా 24 సెకెన్ల తేడాను మాత్రమే అనుమతిస్తారు. అంతకుమించి ముందు లేదా వెనక రైలు బయలుదేరినా, జర్నీ ఆలస్యమైనా రైలు నిర్వాహకులు చాలా తీవ్రంగా పరిగణిస్తారు.

ఈ నేపథ్యంలో ఇటీవల ఓ బుల్లెట్ రైలు 35 సెకెన్లు ఆలస్యంగా బయలుదేరింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రైలు కండక్టర్ ప్రయాణికులందరికీ క్షమాపణ చెప్పడమే కాకుండా వారి టిక్కెట్ డబ్బులను కూడా తిరిగిచ్చేశారు. ఈ ఉదంతంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఉదయ్ కోటక్ ప్రశంసలను కూడా కురిపించారు. క్రమశిక్షణ, విధి నిర్వహణపై నిబద్ధత అంటే ఇదీ అని కామెంట్ చేశారు. ఈ ఉదంతం నుంచి అందరూ నేర్చుకోవాలని అభిలషించారు.


సెంట్రల్ జపాన్ రైల్వే కంపెనీ గణాంకాల ప్రకారం, అక్కడ బుల్లెట్ రైళ్ల రాకపోకలు సగటున 24 సెకెన్లకు మించి ఆలస్యం కావు. ఇంతకు మించి జాప్యం జరిగితే మాత్రం రైలు అధికారులు బహిరంగంగా ప్రయాణికులకు క్షమాపణలు చెబుతున్నారు. 2017లో కూడా దాదాపు ఇలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. సుకుబా ఎక్స్‌ప్రెస్ రైలు షెడ్యుల్ కంటే కొన్ని సెకెన్లు ముందుగా బయలుదేరడంతో ఆ ట్రెయిన్ ఆపరేటర్ ప్రయాణికులకు క్షమాపణలు తెలిపారు. ఇది క్షమార్హం కాదేమో అంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఇక ఈ ఉదంతంపై జనాలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ సమయపాలనను శత్రువులు కూడా మెచ్చుకోకుండా ఉండలేరని అన్నారు. ఆలస్యం అనేది సాధారణమైన మనదేశంలో ఇలాంటి సంస్కృతిని పెంపొందించుకోవడం సాధ్యమేనా అని కొందరు విచారం వ్యక్తం చేశారు. ఈ నిబద్ధత దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా కీలకమని మరికొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


ఇవీ చదవండి:

కనీస బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ పెంపు.. ఐసీఐసీఐ బ్యాంకుపై విమర్శలు

వామ్మో.. నడి రోడ్డు మీద ఈ రోబో ఏం చేస్తోందో చూస్తే..

Read Latest and Viral News

Updated Date - Aug 09 , 2025 | 09:08 PM