BJP: టార్గెట్ ఎమ్మెల్సీ.. దూకుడు పెంచిన బీజేపీ
ABN, Publish Date - Feb 09 , 2025 | 07:59 AM
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ వ్యూహరచనలో నిమగ్నమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్లో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అభ్యర్థులు, కీలక నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ఎన్నికల అభ్యర్థులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహ రచన రూపొందించేలా ప్రచార కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు.

పార్టీ ప్రణాళికలు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.

అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల పక్షాన ఎండగడుతూ, కాంగ్రెస్ సర్కారు మోసాలను ప్రజలకు వివరించేలా ప్రచారాన్ని ఉధృతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించారు.

బీజేపీ పదాధికారుల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు.

అదేవిధంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నేతలు హర్షం వ్యక్తం చేశారు.
Updated at - Feb 09 , 2025 | 08:42 AM