Peddagattu Jathara : అంగరంగ వైభవంగా పెద్దగట్టు జాతర
ABN, Publish Date - Feb 03 , 2025 | 07:10 AM
పెద్దగట్టు జాతరలో స్వామి వారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి జాతరకు భక్తులు భారీగా తరలి వచ్చారు. స్వామి వారి సన్నిధిలో నిద్రించిన భక్తులు కోరిన కోర్కెలు తీర్చాలని వేడుకుంటూ, మళ్లీ రెండేళ్లకు వస్తామని బయలు దేరారు.

తెలంగాణలోనే అతి పెద్ద జాతర. పెద్దగట్టు లేదా గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర. రెండేళ్లకొకసారి మాఘ శుద్ధ పౌర్ణమికి మొదలై ఐదు రోజుల పాటు జాతర జరుగుతుంది.

తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధిగాంచిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర సందర్భంగా అర్ధరాత్రి దిష్టి పూజ జరిగింది. కేసారం నుంచి పెద్దగట్టుకు శ్రాస్తోత్తంగా పూజలందుకుని భక్తుల కోలాహలం మధ్య ఊరేగింపుగా పెద్దగట్టుకు దేవర పెట్టె చేరింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో గల హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న దురాజుపల్లి గ్రామం ప్రక్కనే ‘పాలశేర్లయ్యగట్టు’ అనబడే గొల్లగట్టుపైన ఈ జాతర జరుగుతుంది. వెయ్యేండ్లుగా ఈ జాతర జరగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. శివుడినే లింగమంతుల స్వామిగాను, చౌడమ్మను శక్తి రూపిణిగాను భక్తులు కొలుస్తారు.

ఇక్కడ ఉండే ఉండ్రుగొండపైన రెండు గుడులను కట్టి శివునికి నైవేద్యంతోను, చౌడమ్మకు జంతు బలులతోను ఈ జాతరను నిర్వహించుకుంటారు. ఇప్పటికీ పెద్దగట్టు గిరిదుర్గంపై ఈ గుడులున్నాయి. అందుకే దీనిని ‘పెద్దగట్టు జాతర అని కూడా అంటారు.

అయితే కొన్ని కారణాల వల్ల నేటి పాలశేర్లయ్య గట్టుకు ఈ జాతరను మార్చారు. సూర్యాపేట జిల్లా పెద్దగట్టు జాతరలో లింగమంతుల స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.

ఉదయం కాస్త తక్కువగా కనిపించినా, మధ్యాహ్నం ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి. గజ్జెల లాగులు ధరించిన యాదవులు కటారి విన్యాసాలు చేస్తూ గుడిచుట్టూ ప్రదక్షిణలు చేశారు. మూగజీవాల బలి కొనసాగింది. మహిళలు గంపలను దేవతలకు సమర్పించారు.
Updated at - Feb 03 , 2025 | 07:22 AM