తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు.

ABN, Publish Date - Feb 04 , 2025 | 07:21 PM

సూర్య జయంతిని పురస్కరించుకుని మంగళవారంనాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది.

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు. 1/4

ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు. రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు.

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు. 2/4

సూర్యప్రభ వాహనం – (ఉదయం 5.30 నుండి 8 గంటల వరకు) : అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహనసేవ సూర్యప్రభవాహనం. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.48 గంటలకు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. ఈ వాహనసేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఉదయాత్పూర్వం నుండి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న వేలాది మంది భక్తిపారవశ్యంతో పులకించారు. భక్తుల గోవిందనామస్మరణ మధ్య స్వామివారి వాహనసేవ వైభవంగా జరిగింది.

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు. 3/4

ఆయురారోగ్యప్రాప్తి : సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహ‌నంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు. 4/4

ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్ నాయుడు, ఈవో శ్రీ శ్యామలరావు, అడిషనల్ ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి , పాలక మండలి సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీ ఎమ్మెస్ రాజు, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ ఎన్. సదాశివరావు, శ్రీమతి సుచిత్ర ఎల్లా, శ్రీ నరేష్ , శ్రీ శాంతా రామ్ , శ్రీ రాజశేఖర్ గౌడ్ , శ్రీమతి రంగశ్రీ , శ్రీమతి జానకి దేవి , శ్రీ వీర బ్రహ్మం , ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు , CVSO శ్రీ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Updated at - Feb 04 , 2025 | 07:24 PM