NRI News: అస్టిన్‌లో తానా పాఠశాల తరగతులు ప్రారంభం
ABN , Publish Date - Sep 18 , 2025 | 06:00 PM
అమెరికాలోని చిన్నారులకు తెలుగు నేర్పించాలన్న సంకల్పంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) పాఠశాల ద్వారా తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా వివిధ నగరాల్లో తరగతులను ప్రారంభించించారు.
అమెరికాలోని చిన్నారులకు తెలుగు నేర్పించాలన్న సంకల్పంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) పాఠశాల ద్వారా తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా వివిధ నగరాల్లో తరగతులను ప్రారంభించించారు. ఈ క్రమంలో ఇటీవల అస్టిన్‌లో కూడా పాఠశాల 6వ సంవత్సరం తెలుగు తరగతులను ఘనంగా ప్రారంభించారు. విద్యార్థిని ఆర్యశ్రీ ప్రార్థనలతో తరగతులు ప్రారంభమయ్యాయి.
పాఠశాలకు జాతీయ స్థాయిలో కో-చైర్‌పర్సన్‌గా ఉన్న ఉపాధ్యాయురాలు రజని మారం తరగతులను (Telugu classes) ప్రారంభించి ప్రసంగించారు. తానా పెద్దల సహకారంతో ఈ సంవత్సరం కూడా తరగతులను ఘనంగా ప్రారంభించామని చెప్పారు. రెండేళ్లుగా తెలుగు పిల్లల కోసం పాటన్ ఎలిమెంటరీ స్కూల్‌లోని ఆస్టిన్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ (ఎఐఎస్‌డి)లో తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం కూడా అస్టిన్‌తో పాటు ఈ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న తెలుగువాళ్లు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించి, మాతృభాషా అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె తానా నాయకులను, ఉపాధ్యాయులు వాసవి, శ్వేత, రాజేష్, అనుషలను అందరికీ పరిచయం చేశారు.

ఈ కార్యక్రమంలో తానా (TANA) అధ్యక్షుడు నరేన్ కొడాలి, కోశాధికారి రాజా కసుకుర్తి, పాఠశాల చైర్మన్ భాను మాగులూరి విద్యార్థులకు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. అదే రోజు, నమోదిత విద్యార్థులకు పుస్తకాలు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అలాగే తెలుగు ఉచ్ఛారణ తరగతులను ప్రారంభించి, పాటన్ ఎలిమెంటరీ స్కూల్‌లోని ఆస్టిన్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ (ఎఐఎస్‌డి)లో రెండు సంవత్సరాల తెలుగు తరగతులను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులతో పాటు వారి తల్లితండ్రులు తదితరులు హాజరయ్యారు. చివరగా ఈ కార్యక్రమానికి వచ్చినవారందరికీ రజనీమారం ధన్యవాదాలు తెలియజేసి కార్యక్రమాన్ని ముగించారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమెరికాలో ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమి ఛైర్మన్ రవి మందలపునకు ఘన సన్మానం
సౌదీ అరేబియాలో పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ సభ
For More NRI News And Telugu News