Kitchen Waste into Fertilizer: వంటింటి వ్యర్థాలే బలం
ABN , Publish Date - Oct 22 , 2025 | 05:58 AM
మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి ఎరువులు అత్యవసరం. రసాయన ఎరువులకు బదులు వంటింటి వ్యర్థాలను ఉపయోగిస్తే మొక్కలు మరింత ఆరోగ్యంగా...
మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి ఎరువులు అత్యవసరం. రసాయన ఎరువులకు బదులు వంటింటి వ్యర్థాలను ఉపయోగిస్తే మొక్కలు మరింత ఆరోగ్యంగా ఉంటాయి. వంటింటి వ్యర్థాలను సేంద్రీయ ఎరువులుగా ఎలా వాడాలో తెలుసుకుందాం...
కోడిగుడ్డు పెంకుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మొక్క పెరుగుదలకు తోడ్పడడమే కాకుండా పూలు, కాయలు అధికంగా ఉత్పత్తి కావడానికి దోహదం చేస్తుంది. కోడిగుడ్డు పెంకులను మెత్తగా పొడి చేయాలి. మొక్కల మొదళ్లలో కొద్దిగా తవ్వి, వేర్ల చుట్టూ ఈ పొడిని చల్లాలి. తరువాత యథావిధిగా మట్టిని పరచి కొన్ని నీళ్లు చిలకరించాలి. గుడ్డు పెంకుల పొడిని నీళ్లలో కలిపి రోజూ మొక్కల మొదళ్లలో పోసినా ప్రయోజనం కనిపిస్తుంది.
అరటి పండు తొక్కలో అధికంగా ఉండే పొటాషియం, భాస్వరం లాంటి మూలకాలు.. పూల ఉత్పత్తిని పెంచుతాయి. అరటి తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక ప్లాస్టిక్ బాటిల్‌లో వేయాలి. నిండా నీళ్లు పోసి మూతపెట్టి మూడు రోజులు అలాగే ఉంచాలి. తరువాత ఈ నీటిని మొక్కల మొదళ్లలో పోస్తే పువ్వులు గుత్తులు గుత్తులుగా వస్తాయి.
ఆకు కూరల కాడలు, కూరగాయల వ్యర్థాలు.. సహజ ఎరువులుగా పనిచేస్తాయి. వీటిని మట్టిలో కలిపి మొక్కల మొదళ్లలో చల్లవచ్చు. లేదంటే మొక్కల మొదళ్లలో, చుట్టూరా కొద్దిగా తవ్వి వీటిని వేసి పైన మట్టితో కప్పవచ్చు.
వాడేసిన టీ పొడిలో కొన్ని నీళ్లు పోసి వడకట్టాలి. ఈ పొడిని గట్టిగా పిండి కాగితం మీద వేసి బాగా ఆరబెట్టాలి. తరువాత ఈ పొడిని వారానికి ఒకసారి కొద్దికొద్దిగా తీసుకుంటూ మొక్కల మొదళ్లలో చల్లాలి. ఇలా చేయడం వల్ల పచ్చని ఆకులతో మొక్కలు ఏపుగా పెరుగుతాయి.
ఇవి కూడా చదవండి:
12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ
అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి