Share News

Empowering Women Inmates: ఈ మహిళా కారాగారం... బతుకుల్ని మార్చే ఆశ్రమం

ABN , Publish Date - Oct 22 , 2025 | 06:07 AM

కృషితో నాస్తి దుర్భిక్షం... ఇది పెద్దలు చెప్పిన మంచి మాట. కృషితో మంచి మార్పు కూడా సాధ్యమేనని రాజమహేంద్రవరం ప్రత్యేక మహిళా కారాగారం...

Empowering Women Inmates: ఈ మహిళా కారాగారం... బతుకుల్ని మార్చే ఆశ్రమం

  • వివిధ కారణాలతో ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్న వారి జీవితాల్లో మార్పు కోసం, సాధికారత కోసం కృషి చేస్తోంది రాజమహేంద్రవరం ప్రత్యేక మహిళా కారాగారం.

  • ఈ సెమీ ఓపెన్‌ ప్రిజన్‌లో, ఆశ్రమంలాంటి వాతావరణంలో మహిళా ఖైదీలు...

  • పలు అంశాల్లో శిక్షణ పొందుతున్నారు.

  • కూరగాయల పెంపకం, పిండి వంటల తయారీ... ఇలా ఎన్నో మార్గాలతో జైలుకు ఆదాయాన్ని సమకూరుస్తూ, వేతనాలు సంపాదిస్తున్నారు.

  • జైలు నుంచి విడుదలయ్యాక సొంతకాళ్ల మీద నిలబడి, స్వయంసమృద్ధి సాధించడానికి పునాదులు వేసుకుంటున్నారు.

కృషితో నాస్తి దుర్భిక్షం... ఇది పెద్దలు చెప్పిన మంచి మాట. కృషితో మంచి మార్పు కూడా సాధ్యమేనని రాజమహేంద్రవరం ప్రత్యేక మహిళా కారాగారం అధికారులు రుజువు చేస్తున్నారు. మహిళా ఖైదీలకు చదువుతోపాటు పంటల సాగు, వంటల తయారీలో నైపుణ్యాలను అందించి, జైలు నుంచి వారు విడుదలయ్యాక... సొంత కాళ్ల మీద నిలబడేందుకు ఊతం ఇస్తున్నారు. దేశంలోని కొన్ని మహిళా కారాగారాల్లో ఓపెన్‌ ప్రిజన్‌ విధానం ప్రారంభమైనా, రకరకాల సమస్యలతో కొంత కాలానికే మూతపడ్డాయి. కానీ ఇక్కడ ఏడాదిన్నర నుంచి విజయవంతంగా అమలవుతోంది. ఆ జైలులోని మహిళా ఖైదీలు ఎన్నో రకాల పంటలు పండిస్తూ జైలుకు ఆదాయాన్ని సమకూర్చడంతోపాటు వేతనాల రూపంలో తామూ సంపాదించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కడప, రాజమహేంద్రవరంలో మాత్రమే ప్రత్యేక మహిళా కారాగారాలు ఉన్నాయి. రాజమహేంద్రవరంలోని కారాగారాన్ని ఆశ్రమం మాదిరిగా తీర్చిదిద్దారు. మహిళా ఖైదీల జీవన స్థితిగతులను మెరుగుపరచడం కోసం, శిక్ష పూర్తయ్యాక తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేసుకొని జీవనోపాధి పొంపొందడం కోసం వారికి ఆసక్తి ఉన్న పనిలో తర్ఫీదు ఇస్తున్నారు. వారి నైపుణ్యాలను పదునుపెడుతున్నారు.


పూర్తి సేంద్రియంగా...

ఈ కారాగారంలో సెమీ ఓపెన్‌ ప్రిజన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. సాధారణంగా శిక్షపడిన, రిమాండ్‌ ఖైదీలను జైలు లోపల ఉంచుతారు. వాళ్లలో సత్ప్రవర్తనతో మెలిగే జీవిత ఖైదీలను జైలు ప్రాంగణంలో వివిధ అవసరాలకు వినియోగిస్తారు. ఇక్కడి ఓపెన్‌ ప్రిజన్‌ కోసం 27 మంది ఖైదీలను ఎంపిక చేశారు. వారిలో కొందరు విడుదలకాగా... ప్రస్తుతం 15 మంది ఉన్నారు. వీళ్లను వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. ఈ జైలుకు చెందిన అయిదు ఎకరాల భూమి పూర్వం చిట్టడవి మాదిరిగా ఉండేది. దాన్ని సాగుకు అనువుగా మలిచారు. సుమారు రూ.1.50 లక్షలతో డ్రిప్‌ ఇరిగేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ భూమిలో అంజూర, షర్బత్‌ నిమ్మ, ఉసిరి, సీతాఫలం, వాటర్‌ యాపిల్‌, నారింజ, బత్తాయి, మామిడి, పనస, నిమ్మ, దానిమ్మ, కొబ్బరి, జామ తదితర పండ్ల మొక్కలను నాటారు. వంకాయ, బెండ, దోస, ఆనప, కాకర, గోరు చిక్కుడు, పందిరి చిక్కుడు, బీర, టమాట, దొండ లాంటి కూరగాయలతో పాటు ఆకు కూరలను జైలు సిబ్బంది పర్యవేక్షణలో మహిళా ఖైదీలు సాగు చేస్తున్నారు. వీరికి గతంలో ఎలాంటి వ్యవసాయ అనుభవం లేదు. ఉద్యానవన, అటవీ, వ్యవసాయ తదితర శాఖల సలహాలను పాటిస్తూ పూర్తి ప్రకృతి, సేంద్రీయ పద్ధతిలో పంటలను పండిస్తున్నారు. ట్రాక్టరు లాంటి యంత్రాలు లేకుండా సంప్రదాయ విధానాలను అనుసరిస్తూ... రోజుకు రూ.1500 వరకూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

555-navya.jpg5-navya.jpg


త్వరలో క్యాటరింగ్‌ సేవలు...

రాజమహేంద్రవరం మహిళా ప్రత్యేక కారాగారంలో కవర్ల తయారీ యూనిట్‌, బేకరీ యూనిట్‌, టైలరింగ్‌ యూనిట్‌ ఉన్నాయి. వీటిలో తయారు చేసే పదార్థాలు, వస్త్రాలు, వస్తువులను జైలు బయట విక్రయిస్తారు. అలాగే రాగి మాల్ట్‌ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. రోజూ ఉదయం 6 గంటల నుంచి జైలు బయట చేసే ఆకు కూరలు, కాయగూరల విక్రయాలు అరగంటలో పూర్తయిపోతాయి. బేకరీ యూనిట్‌లో నాణ్యమైన దినుసులు ఉపయోగించి... స్వీట్లు చాక్లెట్లు, ఉస్మానియా బిస్కట్లు, ఫ్రూట్‌కేక్‌, బ్రెడ్‌, వాము పకోడి, కారప్పూస, జంతికలు, అటుకుల మిక్చర్‌, కార్న్‌ ఫ్లాక్స్‌, బూందీ, బెల్లం గవ్వలు లాంటివి తయారు చేసి బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువకే విక్రయిస్తున్నారు. ఇవి నిల్వ ఉండడానికి, రుచి పెంచడానికి ఎలాంటి రసాయనాలు ఉపయోగించరు. పిండి వంటలు, బేకరీ ఐటమ్స్‌, టైలరింగ్‌, వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా రోజుకు రూ.5వేల వరకూ జైలుకు ఆదాయం సమకూరుతోంది. ‘‘ఇప్పటికే ఆర్డర్లపై పిండి వంటలు తయారుచేసి ఇస్తున్నాం. త్వరలో క్యాటరింగ్‌ సేవలు, స్వీట్‌ స్టాల్‌ కూడా ప్రారంభిస్తాం. ఈ ఖైదీలు జైలు నుంచి విడుదలైన తర్వాత బతుకుతెరువుకు ఇబ్బంది పడకుండా సమాజంలో గౌరవంగా జీవించాలనేదే మా ధ్యేయం. దీని వెనుక మా డీజీ, ఐజీ, డీఐజీల ప్రోత్సాహం చాలా ఉంది. మహిళా ఖైదీలతో వ్యవసాయం దిశగా అడుగులు వేయడంలో డీజీ హరీశ్‌ కుమార్‌ గుప్తా ఎంతో సహకరించారు. మా సిబ్బంది సహాయంతో మహిళా ఖైదీల జీవితాల్లో మెరుగైన మార్పులు రావడానికి కృషి చేస్తున్నాం’’ అంటున్నారు జైలు సూపరింటెండెంట్‌ వసంతకుమారి.

-పి.రమేశ్‌ నాగేంద్ర


ఇవి కూడా చదవండి:

12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ

అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 22 , 2025 | 06:07 AM