Siddaramaiah - Azim Premji: విప్రో క్యాంపస్ మీదుగా ట్రాఫిక్ మళ్లింపునకు కర్ణాటక సీఎం అభ్యర్థన.. సాధ్యం కాదన్న ప్రేమ్‌జీ
ABN , Publish Date - Sep 25 , 2025 | 06:57 PM
విప్రో క్యాంపస్ మీదుగా ట్రాఫిక్ అనుమతించాలన్న అభ్యర్థనను సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ తిరస్కరించారు. క్యాంపస్‌లో అంతర్జాతీయ క్లైంట్స్‌కు సేవలందిస్తుంటామని తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు ఓఆర్ఆర్ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా విప్రో క్యాంపస్ మీదుగా వాహనాలను అనుమతించాలన్న కర్ణాటక సీఎం సిద్దరామయ్య అభ్యర్థించిన విషయం తెలిసిందే. అయితే, తమ క్యాంపస్ మీదుగా ట్రాఫిక్‌ను అనుమతించడం సాధ్యం కాదంటూ విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ అశక్తత వ్యక్తం చేశారు. ప్రత్యేక ఆర్థిక జోన్‌లోని ఈ క్యాంపస్‌లో అంతర్జాతీయ క్లైంట్స్‌కు సేవలందిస్తుంటామని వెల్లడించారు. క్యాంపస్‌లోకి సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించడం ఈ సమస్యకు సుస్థిర దీర్ఘకాలిక పరిష్కారం కాజాలదని కూడా పేర్కొన్నారు (Wipro campus traffic access).
అయితే, ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు విప్రో చైర్మన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. డాటా ఆధారిత పరిష్కారాల కోసం కలిసి పనిచేద్దామని ప్రతిపాదించారు. అమలుకు సాధ్యమైన పరిష్కారాలు చూపించేందుకు అర్బన్ రవాణా రంగ నిర్వహణ నిపుణులతో ఓ సమగ్ర అధ్యయనం నిర్వహించాలని కూడా సూచించారు (Wipro Chairman Declines Siddaramaiah request).
కర్ణాటక అభివృద్ధిలో విప్రో పాత్రను గుర్తించినందుకు సీఎం సిద్దరామయ్యకు ప్రేమ్‌జీ ధన్యవాదాలు తెలిపారు. ఓఆర్‌ఆర్‌పై ట్రాఫిక్ సమస్యలను తక్షణం పరిష్కరించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఇది సంక్లిష్ట సమస్య అని, ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. కాబట్టి ఒక్క పరిష్కారంతో చిక్కులను తొలగించలేమని అన్నారు. ట్రాఫిక్ సమస్యపై సమగ్ర శాస్త్రీయ అధ్యయనంతో పరిష్కారాలపై అవగాహన వస్తుందని అన్నారు. ఈ అధ్యయనానికి అయ్యే ఖర్చులో కొంత భరించేందుకు తాము సిద్ధమేనంటూ కర్ణాటక సీఎంకు అజీమ్ ప్రేమ్‌జీ లేఖ రాశారు.
ఇవి కూడా చదవండి:
కుల గణన సర్వేలో పాల్గొనడం ఐచ్ఛికమే: కర్ణాటక హైకోర్టు
బేబీ అంటూ మెసేజీలు ఆ తరువాత బెదిరింపులు.. ఢిల్లీ బాబాపై విచారణలో షాకింగ్ వాస్తవాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి