Share News

Dowry Harassment: భార్యకు నిప్పంటించి హత్య

ABN , Publish Date - Aug 25 , 2025 | 02:50 AM

అదనపు కట్నం కోసం భార్యను అతి కిరాతకంగా హింసించాడు. జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. అంతటితో ఆగకుండా.. తన తల్లిదండ్రులతో కలిసి.. థిన్నర్‌ చల్లి, నిప్పంటించి చంపేశాడు..

Dowry Harassment: భార్యకు నిప్పంటించి హత్య

  • అదనపు కట్నం కోసం భర్త దురాగతం

  • జుట్టు పట్టి ఈడ్చుకెళ్లి.. థిన్నర్‌ చల్లి నిప్పంటించిన భర్త, అత్తమామలు

  • చికిత్స పొందుతూ బాధితురాలి మృతి

  • హత్య వీడియో వైరల్‌.. భర్త విపిన్‌, అత్త అరెస్టు.. పరారీలో మామ, మరిది

  • సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌లో..ఇన్‌స్పెక్టర్‌ పిస్టల్‌ లాక్కొన్న విపిన్‌

  • నిందితుడి కాలిపై పోలీసుల కాల్పులు

  • నోయిడాలో ఘటన

నోయిడా, ఆగస్టు 24: అదనపు కట్నం కోసం భార్యను అతి కిరాతకంగా హింసించాడు. జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. అంతటితో ఆగకుండా.. తన తల్లిదండ్రులతో కలిసి.. థిన్నర్‌ చల్లి, నిప్పంటించి చంపేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ దారుణం చోటుచేసుకోగా.. పోలీసులు భర్తను అరెస్టు చేసి, సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా ఇన్‌స్పెక్టర్‌ పిస్టల్‌ లాక్కొని, పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడి కాలికి గాయమైంది. నోయిడా అదనపు డీసీపీ సుధీర్‌కుమార్‌, బాధితురాలి తండ్రి భికారీ సింగ్‌ పాయ్లా కథనం ప్రకారం.. సిర్సా చౌరాహా ప్రాంతానికి చెందిన సత్యవీర్‌, దయా దంపతుల కుమారుడు విపిన్‌ భాటీతో.. భికారీ సింగ్‌ కుమార్తె నిక్కీని ఇచ్చి ఏడేళ్లక్రితం వివాహం చేశారు. వీరికి ఆరేళ్ల కుమారుడున్నారు. పెళ్లి సమయంలో విపిన్‌ కోరినట్లు కట్నంతోపాటు ఒక స్కార్పియో వాహనాన్ని ఇచ్చామని భికారీ సింగ్‌ తెలిపారు. ఆ తర్వాత బుల్లెట్‌ బైక్‌ అడిగితే.. కొనిచ్చామని పేర్కొన్నారు. కొంత కాలం క్రితం తమ కుటుంబం కోసం మెర్సిడెస్‌ కారును కొన్నట్లు వివరించారు. అప్పటి నుంచి విపిన్‌ తనకు కూడా ఆ కారును కొనివ్వాలని పట్టుబట్టాడని, రూ.36 లక్షల అదనపు కట్నం ఇవ్వాలంటూ తమపై ఒత్తిడి తీసుకువచ్చాడని చెప్పారు. ఈ క్రమంలో గురువారం నిక్కీని ఆమె భర్త, అత్తమామలు హింసించారు. అంతటితో ఆగకుండా.. థిన్నర్‌ చల్లి నిప్పంటించి పారిపోయారని పోలీసులు తెలిపారు. ఇరుగుపొరుగు వారు బాధితురాలిని ఫోర్టిస్‌ ఆస్పత్రికి తరలించారు. 70% కాలిన గాయాలవ్వడంతో.. అక్కడి నుంచి సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే నిక్కీ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. నిక్కీపై విపన్‌, అత్తమామల దాడి దృశ్యాల వీడియో వైరల్‌ అయ్యింది. పోలీసులు విపిన్‌, అతని తల్లి దయాను అరెస్టు చేశారు. విపిన్‌ తండ్రి సత్యవీర్‌, సోదరుడు రోహిత్‌ పరారీలో ఉన్నారు.


నిందితుడిపై కాల్పులు

పోలీసులు శనివారం సాయంత్రం విపిన్‌తో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా.. హత్యకు ఉపయోగించిన థిన్నర్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకునేందుకు సిర్సా చౌరాహాకు చేరుకున్నారు. అక్కడ విపిన్‌ ఓ ఇన్‌స్పెక్టర్‌ నుంచి పిస్టల్‌ను లాక్కొని, పోలీసుల వైపు గురిపెట్టి.. పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకొని విపిన్‌ కాలిపై కాల్పులు జరిపారు. అతని కాలికి బుల్లెట్‌ గాయమైంది. కాగా, ఆస్పత్రి వద్ద విపిన్‌ను మీడియా మాట్లాడించగా.. అతనిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. ‘‘నేను తప్పు చేయలేదు. నా భార్యను చంపలేదు. ఆమె తనకుతానుగా నిప్పంటించుకుంది’’ అని చెప్పారు.

ఎన్‌కౌంటర్‌ చేయాలి

అదనపు కట్నం కోసమే విపిన్‌ తన కూతురిని పొట్టనబెట్టుకున్నాడని నిక్కీ తండ్రి భికారీ సింగ్‌ పాయ్లా అన్నారు. నిక్కీ ఆరేళ్ల కుమారుడు కూడా.. ‘‘మా అమ్మపై ఏదో చల్లారు. ఆ తర్వాత లైటర్‌తో నిప్పంటించారు’’ అని పోలీసులకు వాంగ్మూలమిచ్చాడు. భికారీసింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘యోగి సర్కారు మాకు న్యాయం చేస్తుందని భావిస్తున్నాను. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలి. వారి ఇంటిని బుల్‌డోజర్‌తో కూల్చివేయాలి. లేనిపక్షంలో మేము నిరవధిక నిరాహారదీక్షకు దిగుతాం’’ అన్నారు.


ఇవి కూడా చదవండి..

మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు

రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక

రాహుల్ యాత్రలో మళ్లీ అపశృతి

For More National News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 02:50 AM