Congress Vote Chori Rally: సత్యం, అహింస ఆయుధాలుగా మోదీ, షాలను ఓడిస్తాం.. రాహుల్ గాంధీ
ABN , Publish Date - Dec 14 , 2025 | 05:10 PM
ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కలిసి పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌కు ఇమ్యూనిటీ కల్పిస్తూ ప్రధానమంత్రి మోదీ చట్టం తెచ్చారని, భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని మార్చి, అవసరమైతే ఎన్నికల కమిషనర్లపై చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
న్యూఢిల్లీ: సత్యం, అహింస ఆయుధాలుగా మోదీని, అమిత్‌షాను ఓడిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. సత్యం గెలవడానికి సమయం పట్టవచ్చు కానీ, అంతిమ విజయం మాత్రం సత్యానిదేనని అన్నారు. సత్యాహింసలతో తాము పనిచేస్తామని చెప్పారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు నిర్వహించిన 'ఓట్ చోర్ గద్దీ ఛోడ్' మెగా ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఈసీ అనేది దేశానికే ఈసీ అని, మోదీకి పరిమితం కాదని, ఆ విషయం ఈసీ గుర్తించాలని అన్నారు.
ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కలిసి పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌కు ఇమ్యూనిటీ కల్పిస్తూ ప్రధానమంత్రి మోదీ చట్టం తెచ్చారని, భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని మార్చి, అవసరమైతే ఎన్నికల కమిషనర్లపై చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సత్యానికి-అసత్యానికి మధ్య పోరాటం జరుగుతోందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎంత చెబితే అంత అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తోందని తప్పుపట్టారు. తమకు ప్రజాస్వామిక సిద్ధాంతాలపై నమ్మకం ఉందని, తమ పోరాటానికి సమయం పట్టినా, అంతిమ విజయం సత్యానిదేనని చెప్పారు. సత్యం, అహింస ఆయుధాలుగా మోదీ, అమిత్‌షాను ఓడిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ శాంతియుత, ప్రజాస్వామ పంథాలోనే పోరాటం సాగిస్తుందన్నారు.
ప్రపంచం సత్యం వైపు చూడదని, అధికారం వైపు చూస్తుందని, అధికారం ఉన్నవాడినే గౌరవిస్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెబుతున్నారని రాహుల్ విమర్శించారు. ఇది మోహన్ భగవత్ ఆలోచన అని, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అని చెప్పారు. ఐడియాలజీ ఆఫ్ ఇండియా, ఐడియాలజీ ఆఫ్ హిందూయిజం తమ సిద్ధాంతమని అన్నారు. ప్రపంచంలోని ప్రతి మతం సత్యమే ప్రధానమని చెబుతుందన్నారు. సత్యానికే అర్థమే లేదని, అధికారమే కీలకమని మోహన్ భగవత్ అంటున్నారని విమర్శించారు. 'సత్యాన్ని ఆచరిస్తూ, సత్యానికి అంటిపెట్టుకుని ఉంటే నరేంద్ర మోదీని, అమిత్‌షాను, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని ఇండియా నుంచి తొలగించవచ్చని ఈ సభావేదిక నుంతి తెలియజేస్తున్నాను' అని రాహుల్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి కారణమిదే.. ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ 'ఓట్ చోర్, గద్దీ ఛోడ్' మహా ధర్నా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి