Vaishno Devi Yatra Suspended: వైష్ణోదేవి యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
ABN , Publish Date - Aug 26 , 2025 | 05:07 PM
తొలుత తీవ్రమైన వర్షపాతం కారణంగా హిమకోటి మార్గాన్ని మూసి వేశారని, వాతావరణ పరిస్థితిలో మార్పులేకపోవడంతో కొద్ది గంటల సేపు యాత్రను సస్పెండ్ చేయాలని శ్రీమాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు నిర్ణయించిందని అధికారులు తెలిపారు.
జమ్మూ: మాతా వైష్ణోదేవి (Mata Vaishno Devi) యాత్రకు భారీ వర్షాలు ఆటంకంగా నిలిచాయి. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వైష్ణోదేవి యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. తొలుత తీవ్రమైన వర్షపాతం కారణంగా హిమకోటి మార్గాన్ని మూసివేశారని, వాతావరణ పరిస్థితిలో మార్పులేకపోవడంతో కొద్ది గంటల సేపు యాత్రను సస్పెండ్ చేయాలని శ్రీమాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు (SMVDSB) నిర్ణయించిందని అధికారులు తెలిపారు.
'భక్తుల భద్రత మాకు చాలా ముఖ్యం. పరిస్థితులు మెరుగుపడగానే యూత్ర తిరిగి ప్రారంభమవుతుంది' అని మందిర బోర్డు ప్రతినిధి తెలిపారు. కాగా, వదంతులు నమ్మవద్దని, మందిర బోర్డు అధికారికంగా ఎప్పటికప్పుడు విడుదల చేసిన సమాచారాన్ని పాటించాలని భక్తులను అధికారులు కోరారు.
మరోవైపు, కథువా, సాంబ, దోడా, జమ్మూ, రాంబాన్, కిష్ట్వార్ సహా జమ్మూలోని పలు ప్రాంతాల్లో వర్ష హెచ్చరికలు చేశారు. పలు చోట్ల నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండగా, చాలా ప్రాంతాల్లో వరదముప్పు నెలకొంది. చెనాబ్ నదిలో నీటి మట్టం పెరుగుతూ కొన్ని ప్రాంతాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. ప్రజలు, మరీ ముఖ్యంగా నదీ పరిసర ప్రాంతాల వారు ఇళ్లలోంచి బయటకు వెళ్లవద్దని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.
రెండు చోట్ల క్లౌడ్‌బరస్ట్‌లతో నేషనల్ హైవే-244 కొట్టుకుపోయింది. మెరుపు వరదలతో గాంధోహ్‌కు చెందిన ఇద్దరు, థాథ్రి సబ్‌డివిజన్‌కు చెందిన ఒకరు మృతి చెందినట్లు దోడా డీసీ హర్వీందర్ సింగ్ తెలిపారు. 15 ఇళ్లు, పలు గోశాలలు, ఒక ప్రైవేటు ఆరోగ్య కేంద్రం దెబ్బతిన్నాయి. మూడు పాదచారుల వంతెనలు కొట్టుకుపోయాయి.
ఇవి కూడా చదవండి..
దోడాలో మెరుపు వరదలు, నలుగురు మృతి.. పలు ఇళ్లు నేలమట్టం
కాంగ్రెస్ వ్యక్తిగానే జన్మించా.. కాంగ్రెస్ వ్యక్తిగానే మరణిస్తా
For More National News