Doda Flash Floods: దోడాలో మెరుపు వరదలు, నలుగురు మృతి.. పలు ఇళ్లు నేలమట్టం
ABN , Publish Date - Aug 26 , 2025 | 03:41 PM
జమ్మూలోని కథువా, సాంబ, దోడా, జమ్మూ, రాంబాన్, కిష్ట్వార్ జిల్లాలతో సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు పలు జిల్లాలను ముంచెత్తుతున్నాయి.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్(Jammu Kashmir) అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంగలు పొంగుతున్నాయి. తావి, రావి వంటి ప్రధాన నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. దోడా (Doda) జిల్లాలో మంగళవారం నాడు మెరుపు వరదల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పదికి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి.
జమ్మూలోని కథువా, సాంబ, దోడా, జమ్మూ, రాంబాన్, కిష్ట్వార్ జిల్లాలతో సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాతావరణ ప్రతికూలత దృష్ట్యా జమ్మూ డివిజన్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రెవేటు పాఠశాలలను మూసివేశారు.
కొండచరియలు విరిగిపడుతుండటంతో ముందుజాగ్రత్త చర్యగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి రాకపోకలను నిలిపివేశారు. దోదాలోని కీలకమైన రోడ్డు కొట్టుకుపోయింది. తావి నది పొంగి పొర్లుతోంది. పలు నదులు ఇప్పటికే ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. జమ్మూ ప్రాంతంలో ఫ్లడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలు నదీ ప్రవాహలు, కొండచరియలు విరిగిపడే ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించారు.
కాగా, కథువా జిల్లాలో గత 24 గంటల్లో అత్యధికంగా 155.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దోడాలోని బదెర్వాహ్ 99.9 మి.మీ., జమ్మూలో 81.5 మి.మీ., కాత్రాలో 68.9 మి.మీ. వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఎత్తైన ప్రాంతాల్లో క్రౌడ్‌బరస్ట్‌లు, మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కశ్మీర్‌లోని సదరన్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతుండగా, జీలం నదిలో ప్రవాహం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఫ్లడ్ అలర్ట్ ప్రకటించలేదు. సెంట్రల్ కశ్మీర్‌లో చెదురుమదురు వర్షాలు పడుతుండగా, నార్త్ కశ్మీర్‌లో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లో పలు నదుల్లో నీటిమట్టం పెరుగుతుండటంతో ప్రభుత్వ యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. హెల్ప్‌లైన్ మెంబర్లను జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్ వ్యక్తిగానే జన్మించా.. కాంగ్రెస్ వ్యక్తిగానే మరణిస్తా
దంపతులపై అనుమానం.. ఆపి తనిఖీ చేయగా షాకింగ్ సీన్..
For More National News