Uttarakhand Bus Accident : ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడటంతో ఏడుగురు దుర్మరణం
ABN , Publish Date - Dec 31 , 2025 | 07:03 AM
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిద్రమత్తు, రాంగ్ రూట్, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతిచెందగా.. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. భికియాసైన్ - వినాయక్ రోడ్డులో బస్సు వెళ్తుండగా అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. UK 07 PA 4025 నంబర్ గల బస్సు 19 మంది ప్రయాణికులతో హత్ నుంచి బయలుదేరి రామ్‌నగర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం నుంచి డ్రైవర్, కండక్టర్లు సురక్షితంగా బయటపడినట్టు సమాచారం. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని.. మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని వైద్యులు తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లోయలో పడిన బస్సు పూర్తిగా ధ్వంసమైంది.
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కల్తీ నెయ్యి కేసులో వేమిరెడ్డి ప్రశాంతి విచారణ
మద్దతు ధరకు పప్పుధాన్యాల కొనుగోలు
Read Latest Telangana News and National News