Uranium Found in Breast Milk: తల్లిపాలలో యురేనియం.. అధ్యయనాల్లో వెలుగుచూసిన నిజం
ABN, Publish Date - Nov 23 , 2025 | 04:13 PM
తల్లిప్రేమ వలే తల్లిపాలూ స్వచ్ఛమైనవనీ, కల్తీలేనివని ఇన్నాళ్లూ అనుకున్నాం. కానీ ఆ తల్లిపాలూ కలుషితమవుతున్నాయ్. బిహార్‌లో నిర్వహించిన తాజా సర్వేలో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయ్. అవేంటంటే...
ఇంటర్నెట్ డెస్క్: తల్లిపాలు(Breast Milk) అంటేనే స్వచ్ఛమైనవి, కల్తీలేనివి, పుష్ఠికరమైనవి, ఆరోగ్యకరమైనవి... ఇలా రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తుంటాయ్. వైద్యులైనా సరే శిశువులకు వీటినే తొలి ప్రాధాన్యతనిస్తారు. అలాంటి తల్లిపాలలో యురేనియం(U-238) ఉన్నట్టు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. బిహార్(Bihar)లో వెలుగుచూసిన ఈ కఠోర వాస్తవం ప్రస్తుతం.. అందరినీ కలవరపెడుతోంది. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిశోధకులు చెబుతున్నారు.
యురేనియం అనేది సహజంగా లభించే ఓ రేడియో ధార్మిక రసాయన మూలకం. గ్రానైట్ వంటి రాళ్లలో ఇది కనిపిస్తూ ఉంటుంది. అక్కడా దీనిని చాలా జాగ్రత్తగానే వాడతారు. అలాంటి ఈ మూలకం తల్లిపాలలో కలవడం(Uranium Found In Breast Milk) వల్ల పిల్లలు తరచూ అనారోగ్యానికి గురికావడం సహా క్యాన్సరేతర కారక లక్షణాలు గణనీయంగా పెరుగుతాయని పరిశోధకులు వెల్లడించారు. బిహార్‌లోని అనేక జిల్లాల్లో చేపట్టిన సర్వేలో ఈ కఠిన వాస్తవం బయటపడింది. అయితే ఈ విషయమై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిశోధకుల్లో ఒకరైన ఢిల్లీ ఎయిమ్స్(AIIMS) డాక్టర్ అశోక్ వర్మ(Dr Ashok Sharma) తెలిపారు.
'రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 40 మంది తల్లుల నుంచి పాలను సేకరించి ఈ విశ్లేషణ చేయడం జరిగింది. అన్ని నమూనాల్లోనూ యురేనియం ఉన్నట్టు తేలింది. 70 శాతం మంది శిశువులు క్యాన్సరేతర ఆరోగ్య ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. వీరిలో యురేనియం స్థాయులు తక్కువగానే ఉన్నప్పటికీ తల్లులు, శిశువులిద్దరిపైనా ప్రతికూల ఆరోగ్య ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా శిశువుల్లో మూత్రపిండాలు, నాడీ వ్యవస్థ అభివృద్ధి మందగిస్తాయి. ఒకవేళ దీని ప్రభావం దీర్ఘకాలం ఉంటే తక్కువ ఐక్యూ, నరాల వృద్ధి ఆలస్యం వంటి దుష్ఫలితాలూ సంభవించవచ్చు. అయినప్పటికీ పిల్లలకు తల్లిపాలు మాత్రం మాన్పించరాదు. దీంతో పాటు వైద్యుల సూచనలూ తప్పకుండా పాటించాలి.' అని అశోక్ వర్మ చెప్పారు.
ఇతర మూలకాలు కూడా..
అయితే.. తల్లిపాల నమూనాల్లో(0-5.25 మైక్రోగ్రామ్స్/లీటర్) యురేనియం సాంద్రతలు ఉండటంతో శిశువు ఆరోగ్యంపై తక్కువ ప్రభావం ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తల్లులు గ్రహించిన యురేనియంలో అధిక భాగం మూత్రం ద్వారా విసర్జితమవుతుందని తేలింది. దీంతో తల్లిపాలల్లో తక్కువ స్థాయిలోనే ఉంటుందని వెల్లడించారు. దీనిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యురేనియంతో పాటు చాలా తక్కువ స్థాయిలో ఆర్సెనిక్, సీసం, పాదరసం వంటి వాటినీ గుర్తించినట్టు పరిశోధకులు పేర్కొన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సూచనల ప్రకారం.. మనం తాగే నీటిలో ఒక లీటరుకు 30 మైక్రోగ్రాముల యురేనియం(Uranium) ఉండవచ్చని పేర్కొంది. అయితే జర్మనీ(Germany) వంటి కొన్ని దేశాలు లీటరుకు 10 గ్రాములు వాడవచ్చని డబ్ల్యూహెచ్ఓ నిబంధనలను సడలించాయి. భారత్(India)లోని 18 రాష్ట్రాలకు చెందిన 151 జిల్లాల్లో యురేనియం కాలుష్యాలు ఉన్నట్టు తాజా నివేదికలో వెల్లడైంది. బిహార్‌లో 1.7 శాతం భూగర్భ జలాలు దీనివల్ల ప్రభావితం అవుతున్నాయని అందులో పేర్కొంది. దీంతో అక్కడి పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించి యురేనియం స్థాయులను తగ్గించడంపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక, ప్రపంచ వ్యాప్తంగా.. కెనడా, అమెరికా, ఫిన్లాండ్, స్వీడన్, స్విట్జర్లాండ్, యూకే, బంగ్లాదేశ్, చైనా, కొరియా, మంగోలియా, పాకిస్థాన్ వంటి దేశాలలో యురేనియం స్థాయులు పెరిగినట్టు ఇటీవలి అధ్యయనాల్లో వెల్లడైంది.
ఇవీ చదవండి:
జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణానికి విదేశీ అతిథులు
భారత ఉన్నత విద్యా కమిషన్
Updated at - Nov 23 , 2025 | 05:35 PM