Share News

Higher Education: భారత ఉన్నత విద్యా కమిషన్‌

ABN , Publish Date - Nov 23 , 2025 | 04:48 AM

ఉన్నత విద్యా రంగంలో సమూల మార్పులు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సమీకృత ఉన్నత విద్య నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయనుంది.

Higher Education: భారత ఉన్నత విద్యా కమిషన్‌

  • యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈల స్థానంలో ఏర్పాటు

న్యూఢిల్లీ, నవంబరు 22: ఉన్నత విద్యా రంగంలో సమూల మార్పులు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా సమీకృత ఉన్నత విద్య నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయనుంది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న పది బిల్లుల్లో ఇందుకు సంబంధించిన బిల్లు కూడా ఉండనుంది. ఇంతవరకు ఉన్న యూజీసీ, ఏఐసీటీఈ, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ)లను రద్దు చేసి వాటి స్థానంలో భారత ఉన్నత విద్యా కమిషన్‌ (హెచ్‌ఈసీఐ)ని ఏర్పాటు చేయనుంది. ఇంతవరకు యూజీసీ నాన్‌ టెక్నికల్‌ విద్యా రంగాన్ని, ఏఐసీటీఈ సాంకేతిక విద్యా రంగాన్ని, ఎన్‌సీటీఈ ఉపాధ్యాయ విద్యారంగాన్ని చూసుకునేవి. ఇకపై ఈ మూడింటినీ హెచ్‌ఈసీఐ పర్యవేక్షించనుంది. వైద్య విద్య, న్యాయ విద్యలను మాత్రం దీని పరిధిలోకి తీసుకొని రాలేదు. హెచ్‌ఈసీఐకి మూడు ప్రధాన బాధ్యతలను ప్రభుత్వం అప్పగించనుంది. నియంత్రణ, అక్రిడిషన్‌, వృత్తి ప్రమాణాలను నెలకొల్పడం వంటి కర్తవ్యాలను నిర్వహించనుంది. నాలుగో కర్తవ్యమైన నిధులు సమకూర్చడం హెచ్‌ఈసీఐ పరిధిలో ఉండదు. దీనిని సంబంధిత మంత్రిత్వ శాఖలు చూసుకుంటాయి. సెక్యూరిటీస్‌ మార్కెట్‌కు సంబంధించిన చట్టాలను ఏకీకృతం చేసి సెక్యూరిటీస్‌ మార్కెట్‌ కోడ్‌ బిల్లు (ఎస్‌ఎంసీ)ను కూడా కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. సెబీ యాక్ట్‌-1992, డిపాజిటర్స్‌ యాక్ట్‌-1996, సెక్యూరిటీస్‌ కాంట్రాక్ట్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌-1956లను సమ్మిళితం చేసి కొత్త కోడ్‌ను రూపొందించనుంది.

Updated Date - Nov 23 , 2025 | 04:49 AM