CJI Oath Ceremony: జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణానికి విదేశీ అతిథులు
ABN , Publish Date - Nov 23 , 2025 | 04:52 AM
భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆరు దేశాల నుంచి విదేశీ ప్రతినిధుల బృందం హాజరుకానుంది.
నేపాల్, భూటాన్, శ్రీలంక, మారిషస్, కెన్యా, మలేసియా నుంచి జడ్జీలు
సీజేఐ ప్రమాణానికి విదేశీ బృందం రావడం ఇదే తొలిసారి
రేపు రాష్ట్రపతి భవన్‌లో కార్యక్రమం
న్యూఢిల్లీ, నవంబరు 22: భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆరు దేశాల నుంచి విదేశీ ప్రతినిధుల బృందం హాజరుకానుంది. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో నేపాల్, భూటాన్, శ్రీలంక, మారిషస్, కెన్యా దేశాల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొననున్నారు. అలాగే మలేసియా నుంచి ఓ బృందం రానుంది. విదేశాలకు చెందిన ఐదుగురు సీజేలు, ఆరుగురు న్యాయమూర్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 15 మంది అతిథులు హాజరుకానున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశీ బృందం రానుండటం ఇదే తొలిసారి. అలాగే వీరంతా భారత రాజ్యాంగ దినోత్సవం(నవంబరు26న) కార్యక్రమంలోనూ పాల్గొంటారు.
ఇదీ నేపథ్యం..
జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిసార్‌లో మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. హిసార్‌లోని ప్రభుత్వ పీజీ కాలేజీలో డిగ్రీ చదువుకున్నారు. రోహ్‌తక్ లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి 1984లో లా డిగ్రీ అందుకున్నారు. అదే ఏడాది హిసార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన ఆయన న్యాయవాద వృత్తిలో అనతికాలంలోనే రాణించారు. 2000లో 38 ఏళ్ల వయసులో హరియాణా అడ్వకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. 2019 మే 24న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సుప్రీం కోర్టులో పలు రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యుడిగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సమర్థించిన తీర్పుతో సహా పలు ముఖ్యమైన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. కాగా, దేశవ్యాప్తంగా వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న 5కోట్లకు పైగా కేసుల పరిష్కారానికి కృషి చేయడం, వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గంగా ‘గేమ్ చేంజర్’ మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడానికి సీజేఐగా అత్యంత ప్రాధాన్యం ఇస్తానని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. సోమవారం సీజేఐగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో శనివారం ఆయన తన నివాసంలో మీడియాతో ముచ్చటించారు. న్యాయమూర్తులు, తీర్పులపై ఆన్‌లైన్ ట్రోలింగ్ వంటి విషయాలు తనను ఎప్పుడూ కలవరపెట్టలేదన్నారు. సహేతుకమైన విమర్శలు ఎప్పుడూ ఆమోదయోగ్యమని అన్నారు.
జస్టిస్ గవాయ్ తొలి బౌద్ధ సీజేఐ
పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీజేఐ జస్టిస్ గవాయ్ న్యాయమూర్తుల నియామకంలో కీలక పాత్ర పోషించారు. సీజేఐగా దాదాపు తన 6 నెలల పదవీ కాలంలో ఎస్సీ కేటగిరికి చెందిన 10 మందిని, బీసీ కేటగిరి నుంచి 11 మందిని దేశంలోని వివిధ హైకోర్టులకు న్యాయమూర్తులుగా నియమించారు. సీజేఐగా సేవలు అందించినవారిలో జస్టిస్ గవాయ్ తొలి బౌద్ధుడు, రెండో దళితుడు కావడం విశేషం.