Share News

F-35B Lightning 2: ఎయిర్ ఇండియా ఆఫర్‌ తిరస్కరణ.. ఎయిర్‌పోర్టులో ఆరుబయటే బ్రిటన్ యుద్ధ విమానం పార్కింగ్

ABN , Publish Date - Jun 21 , 2025 | 08:18 AM

తిరువనంతపురం ఎయిర్‌పోర్టులోని బ్రిటన్ యుద్ధ విమానాన్ని హ్యాంగర్‌కు తరలించాలన్న ఎయిర్ ఇండియా ఆఫర్‌ను యూకే నేవీ తిరస్కరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విమానాన్ని ఎయిర్‌పోర్టులో ఆరు బయటే నిలిపి ఉంచారు.

F-35B Lightning 2: ఎయిర్ ఇండియా ఆఫర్‌ తిరస్కరణ.. ఎయిర్‌పోర్టులో ఆరుబయటే బ్రిటన్ యుద్ధ విమానం పార్కింగ్
UK Navy F-35B India

ఇంటర్నెట్ డెస్క్: సాంకేతిక సమస్య తలెత్తడంతో కేరళలో అత్యవసరంగా ల్యాండయిన బ్రిటన్ ఎఫ్-35బీ ఫైటర్ జెట్ గత ఆరు రోజులుగా భారత్‌లోనే ఉంది. అత్యాధునిక టెక్నాలజీతో అత్యంత ఖరీదైనదిగా పేరు పొందిన ఈ జెట్‌‌ను హ్యాంగర్‌లో పార్క్ చేయలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ జెట్ ఆరుబయటే ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

విమానాన్ని తమ హ్యాంగర్‌లో (విమానం పార్కింగ్ ప్లేస్) నిలుపుకోవచ్చని బ్రిటన్ నేవీకి ఎయిర్ ఇండియా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. బ్రిటన్ నేవీ మాత్రం ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించింది. తమకు మాత్రమే ప్రత్యేకమైన అత్యాధునిక సాంకేతికత ఎవరి చేతుల్లోనూ పడొద్దన్న ప్రధాన కారణంతో బ్రిటన్ నేవీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, తుది తనిఖీల సమయంలో విమానాన్ని హ్యాంగర్‌కు తరలించేందుకు వారు అంగీకరించే అవకాశం కూడా ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నారు.


బ్రిటీష్ నేవీలోని అత్యాధునిక యుద్ధ విమానాల్లో ఎఫ్35బీ ప్రధానమైనది. అమెరికా రూపొందించిన ఈ విమానం ప్రపంచంలో అత్యంత ఖరీదైనదని చెబుతారు. మరే యుద్ధ విమానంలోనూ లేని ఆధునిక సాంకేతిక వ్యవస్థలు దీని సొంతం. బ్రిటన్‌కు చెందిన హెచ్‌ఎమ్ఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగంగా ఈ విమానాన్ని ఇండో పెసిఫిక్ ప్రాంతంలో మోహరించారు. ఇటీవల భారతీయ నేవీతో కలిసి నావికాదళ విన్యాసాల్లో కూడా ఎఫ్35బీ పాల్గొంది.

జూన్ 14న ఈ యుద్ధ విమానం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండవ్వాల్సి వచ్చింది. ఇంధనం తక్కువగా ఉన్నట్టు విమానంలో సంకేతాలు కనబడటంతో పైలట్ కేరళలో ల్యాండవ్వాల్సి వచ్చింది. ఆ మరుసటి రోజే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అవసరమైన సాయం చేస్తామని ప్రకటించింది. నాటి నుంచి దీన్ని ఆరుబయటే నిలిపి ఉంచారు.


హైడ్రాలిక్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని పరిష్కరించేందుకు బ్రిటన్ నిపుణులు, పైలట్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు, విమానానికి పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక పౌర విమానాశ్రయంలో అంతటి యుద్ధ విమానం కనిపించడం ప్రయాణికుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇవి కూడా చదవండి:

విమానాన్ని కూల్చేస్తా.. ఎయిర్ ఇండియా సిబ్బందికి మహిళా డాక్టర్ బెదిరింపులు

యాక్సియమ్-4 మిషన్ మరోసారి వాయిదా

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 21 , 2025 | 08:27 AM