Bengaluru: విమానాన్ని కూల్చేస్తా.. ఎయిర్ ఇండియా సిబ్బందికి మహిళా డాక్టర్ బెదిరింపులు
ABN , Publish Date - Jun 20 , 2025 | 01:02 PM
ఎయిర్ ఇండియా విమానం కూల్చేస్తానంటూ బెదిరించిన మహిళ డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్ ఇండియా విమానాన్ని కూల్చేస్తానంటూ బెదిరింపులకు దిగిన ఓ మహిళా డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఐఎక్స్2749లో ఈ ఘటన జరిగింది.
వ్యాస్ హిరల్ అనే మహిళ ప్యాసెంజర్ విమానంలో రచ్చ రచ్చ చేశారు. తొలుత విమానమెక్కిన ఆమె తన లగేజీని ముందు వరుసలో వదిలేసి వెళ్లి తన సీటులో కూర్చున్నారు. ఇది గమనించిన క్రూ ఆమెను లగేజీని తన సీటుపై కంపార్ట్‌మెంట్‌లో పెట్టుకోవాలని సూచించారు. అక్కడి నుంచి మహిళ రచ్చ చేయడం ప్రారంభించారు. లగేజీని తన సీటు వద్దకు తీసుకురావాలంటూ సిబ్బందిని డిమాండ్ చేశారు. సిబ్బంది ఎంతగా నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా, చివరకు పైలట్ స్వయంగా రంగంలోకి దిగినా ఆమె లక్ష్య పెట్టలేదు.
తొటి ప్రయాణికులు నచ్చ చెబుతున్నా వినిపించుకోకుండా వారిపై నోరు పారేసుకున్నారు. చివరకు విమానాన్ని కూల్చేస్తానంటూ బెదిరింపులకు దిగారు. దీంతో, సిబ్బంది వెంటనే అప్రమత్తమై సీఎస్ఐఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. వారు మహిళను విమానం నుంచి కిందకు దించేశారు. ఆమెపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బెంగళూరులోని యలహంకలోని శివనహళ్లిలో మహిళా డాక్టర్ ఉంటున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఎయిర్ ఇండియా ప్రమాదం నుంచి బయటపడ్డ ఒకే ఒక ప్రయాణికుడు విశ్వాస్ అసత్యాలు చెబుతున్నాడంటూ నటి సుచిత్ర కృష్ణమూర్తి నెట్టింట తాజాాగా పోస్టు పెట్టడం కలకలం రేపింది. విమర్శలు వెల్లువెత్తడంతో తన తప్పు తెలుసుకున్న ఆమె బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. తన పోస్టును డిలీట్ చేసిన విషయం కూడా తెలిపారు. ఇక వైరల్‌గా మారిన మరో వీడియోలో కొందరు ప్రయాణికులు విమానంలో కార్డ్స్ ఆడుతున్న వైనం కలకలం సృష్టించింది. జనాలు విమర్శలు గుప్పించారు. విమాన భద్రతను ప్రశ్నార్థకం చేయడం సరికాదంటూ తిట్టిపోశారు.
ఇవి కూడా చదవండి:
ఎయిర్‌పోర్టు పరిసరాల్లో నిర్మాణాలపై కేంద్రం నజర్.. నిబంధనలు కఠినతరం
యాక్సియమ్-4 మిషన్ మరోసారి వాయిదా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి