Axiom-4: యాక్సియమ్-4 మిషన్ మరోసారి వాయిదా
ABN , Publish Date - Jun 20 , 2025 | 07:46 AM
జూన్ 22న చేపట్టాల్సిన యాక్సియమ్-4 మిషన్ మరోసారి వాయిదా పడింది. తదుపరి ప్రయోగం ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో వెల్లడిస్తామని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం పేర్కొంది. మిషన్ వాయిదా పడటం ఇది 7వ సారి.
ఇంటర్నెట్ డెస్క్: యాక్సియమ్-4 మిషన్ మరోసారి వాయిడా పడింది (Axiom 4 Mission Postponed). ఈ మేరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్న విషయం తెలిసిందే. జూన్ 22న ఈ మిషన్ చేపట్టాల్సి ఉన్నా వాయిదా వేయక తప్పలేదు. మిషన్ ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో వెల్లడిస్తామని ఐఎస్ఎస్ పేర్కొంది. ఇటీవల రిపేర్ల అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని కార్యకలాపాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) నిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. యాక్సియమ్-4 మిషన్ వాయిదా పడటం ఇది 7వ సారి. అయితే, మిషన్ విజయవంతం కావడమే లక్ష్యంగా పనిచేస్తున్న నాసా, స్పేస్ ఎక్స్, యాక్సియమ్ స్పేస్ సంస్థలు పొరపాట్లకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.
ఈ మిషన్ చేపట్టేందుకు జూన్ 30 వరకూ అవకాశం ఉంది. ఈ గడువు దాటితే మళ్లీ 15 రోజులకే ప్రయోగం చేపట్టే అవకాశం వస్తుంది. ఇక యాక్సియమ్-4 ఆస్ట్రొనాట్స్ మే 14 నుంచి క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. వారి క్వారంటైన్ మరికొన్ని రోజులు కొనసాగనుంది. అన్ని మెడికల్, సేఫ్టీ ప్రొటొకాల్స్ యథాతథంగా కొనసాగుతాయని ఐఎస్ఎస్ వెల్లడించింది.
ఏమిటీ మిషన్
నాసా, స్పేస్ ఎక్స్ భాగస్వామ్యంతో యాక్సియమ్ స్పేస్ అనే ప్రైవేటు సంస్థ ఈ మిషన్ చేపడుతోంది. ఇందులో భాగంగా నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొన్ని రోజులపాటు పలు ప్రయోగాలు నిర్వహించనున్నారు. వీరిలో భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా కూడా ఒకరు.
ఈ మిషన్‌కు నాసా మాజీ ఆస్ట్రొనాట్ పెగ్గీ విట్సన్ నేతృత్వం వహిస్తున్నారు. భారతీయ ఆస్ట్రొనాట్ శుభాన్షు శుక్లా మిషన్ పైలట్‌గా ఉన్నారు. పోలాండ్‌కు చెందిన ఆస్ట్రొనాట్ స్లావోజ్, హంగేరీకి చెందిన వ్యోమగామి టిబోర్ కాపూ కూడా ఈ మిషన్‌లో పాలు పంచుకుంటున్నారు.
ఇక అంతరిక్ష యాత్ర చేపడుతున్న రెండో భారతీయుడిగా శుభాన్షు గుర్తింపు పొందారు. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత ఓ భారతీయుడు చేపడుతున్న అంతరిక్ష యాత్ర ఇది. అంతరిక్ష యాత్ర చేసిన తొలి భారతీయుడిగా వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ 1984లో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఎయిర్‌పోర్టు పరిసరాల్లో నిర్మాణాలపై కేంద్రం నజర్.. నిబంధనలు కఠినతరం
రంగంలోకి కేంద్రం.. ఇరాన్ నుంచి భారత్‌కు 110 మంది విద్యార్థుల తరలింపు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి