Dy CM Udhayanidhi Stalin: విశ్వాసం ఉన్నవారికి దీపావళి శుభాకాంక్షలు..!
ABN , Publish Date - Oct 20 , 2025 | 05:14 PM
తమిళనాడు ఉప-ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ దీపావళి శుభాకాంక్షలు చెప్పిన తీరుపై రాజకీయ దుమారం రేగుతోంది. ఉదయనిధి ఒక పబ్లిక్ మీటింగ్‌లో శుభాకాంక్షలు చెప్పాలా.. వద్దా అనే దానిపై సందేహాలు నెలకొన్నాయంటూ మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు ఉప-ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ దీపావళి శుభాకాంక్షలు చెప్పిన తీరుపై తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఉదయనిధి స్టాలిన్ ఒక పబ్లిక్ మీటింగ్‌లో శుభాకాంక్షలు చెప్పాలా.. వద్దా అనే దానిపై మాట్లాడారు. అయితే, చివరిగా 'విశ్వాసం ఉన్నవారికి దీపావళి శుభాకాంక్షలు' అని ఉదయనిధి చెప్పారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కూడా అయిన ఉదయనిధి స్టాలిన్ సదరు సభలో మాట్లాడుతూ.. దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి ప్రజలు వెనుకాడుతున్నారని అన్నారు. 'నేను వేదికపైకి వచ్చినప్పుడు చాలామంది నాకు పుష్పగుచ్ఛాలు, పుస్తకాలు ఇచ్చారు. మరి కొందరికి నాకు ఏమి చెప్పాలో తెలియలేదు. కొందరు దీపావళికి శుభాకాంక్షలు చెప్పాలా వద్దా? అని భయపడుతూ సంకోచించారు. విశ్వాసం ఉన్నవారికి నేను దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నాను' అని సభలో చెప్పుకొచ్చారు ఉదయనిధి స్టాలిన్.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ.. ఆయన హిందువులపై వివక్ష చూపుతున్నారని మండిపడింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరాజన్ తీవ్రంగా స్పందించారు. సీఎం ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌లకు ఆమె దీపావళి శుభాకాంక్షలు చెబుతూ.. 'వాళ్లు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా ప్రాథమికంగా వాళ్లు హిందువులు.. నమ్మకం లేనివాళ్లకు కూడా మేము శుభాకాంక్షలు చెబుతాం.. ఉదయనిధి వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను' అని ఆమె అన్నారు. అంతేకాదు, ఇతర మతాల ప్రజలకు శుభాకాంక్షలు చెప్పినప్పుడు ఉదయనిధి స్టాలిన్.. విశ్వాసం ఉన్నవారికి అని అనరని.. కానీ, హిందూ మతానికి వచ్చేసరికి మాత్రం నమ్మకం ఉన్నవారికి అని అంటారని తమిళిసై మండిపడ్డారు. పండుగల సమయంలో హిందువులకు శుభాకాంక్షలు చెప్పాలనే కనీస మర్యాద కూడా డీఎంకే ప్రభుత్వానికి లేదని తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి ఏఎన్ఎస్ ప్రసాద్ విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ పేరు వింటే.. శత్రువులకు నిద్ర పట్టదు: ప్రధాని మోదీ
For More National News And Telugu News