Share News

Madhya Pradesh: 3 ఏళ్ల చిన్నారికి సంతారా.. పిన్న వయసులో ప్రపంచానికి వీడ్కోలు.. అసలేంటీ ఆచారం..

ABN , Publish Date - May 03 , 2025 | 10:12 AM

Santhara Ritual Controversy MP: మధ్యప్రదేశ్‌కు చెందిన మూడేళ్ల చిన్నారి జైన మత ఆచారం ప్రకారం ప్రపంచానికి వీడ్కోలు పలికింది. ప్రపంచంలో అత్యంత పిన్న వయసులోనే ఈ ఆచారం ప్రకారం స్వచ్ఛందంగా మరణించిన వ్యక్తిగా 'గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో వియానా పేరు నమోదైంది. ఇంతకీ, వియానా మరణం కోసం ఆమె తల్లిదండ్రులు ఈ మార్గం ఎందుకు ఎంచుకున్నారు? సంతారా అంటే ఏమిటి?

Madhya Pradesh: 3 ఏళ్ల చిన్నారికి సంతారా.. పిన్న వయసులో ప్రపంచానికి వీడ్కోలు.. అసలేంటీ ఆచారం..
3 Year Child dies In Santhara Ritual MP

3 Year Child dies In Santhara Ritual: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో జైన సమాజానికి చెందిన ఒక ప్రత్యేకమైన ఆచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 3 సంవత్సరాల వయసు గల చిన్నారి మరణాన్ని కౌగిలించుకునేందుకు సంతారా ఆచారం ఎంచుకోవడమే కారణం. సాధారణంగా వృద్ధాప్యంలో ఉన్నవారే స్వచ్ఛంద మరణం కోసం ఈ ఆచారాన్ని స్వీకరిస్తారు. తీవ్ర అనారోగ్య సమస్యలు తట్టుకోలేక చావు కోరుకునే వారు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే, బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న పాపకు సంతారా ఇప్పించడంపై అంతటా విమర్శలు చెలరేగుతున్నాయి. ఇంతకీ ఈ పద్ధతిలో చిన్నారి మరణించడాన్ని అంతా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సంతారా అంటే ఏమిటి?


ఈ సంఘటన మార్చి 21న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో జరిగింది. ఐటీ దంపతులు పీయూష్ జైన్ (35), వర్ష జైన్ (32) బ్రెయిన్ ట్యూమ‌‌ర్‌తో బాధపడుతున్న కుమార్తె వియానాకు జైన మతాచారం ప్రకారం సంతారా ఇప్పించారు. జీవితపు చివరి క్షణాల్లో కొట్టుమిట్టాడుతున్న కుమార్తెకు తుది వీడ్కోలు పలికారు. వియానాకు ఏడాది కిందట మెదడులో కణితి ఉన్నట్లు నిర్ధారణ అయింది. శస్త్రచికిత్స తర్వాత కోలుకున్నా ఈ ఏడాది మార్చిలో మళ్ళీ అనారోగ్యానికి గురైంది. ఇండోర్‌లో, తరువాత ముంబైలో చికిత్స చేసినా పరిస్థితి పెద్దగా మెరుగుపడలేదు. దీంతో పాప తల్లిదండ్రులు జైన్ ముని శ్రీ సలహా మేరకు ఆమెకు సంతార ఇప్పించారు. మతపరమైన ఈ ప్రక్రియ జరిగిన కొద్ది నిమిషాలకే వియానా మరణించింది.


సత్కారాలు.. విమర్శలు..

3 సంవత్సరాల నాలుగు నెలల వయసున్న వియానా జైన్ ఈ ఆచారం స్వీకరించిన అతి పిన్నవయస్కురాలిగా నిలిచి అమెరికాకు చెందిన 'గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్' లో స్థానం సంపాదించింది. తల్లిదండ్రుల నిర్ణయాన్ని జైన సమాజం హర్షించి సత్కరించినా.. దేశవ్యాప్తంగా డాక్టర్లు, పలువురు సామాజికవేత్తలు ఈ ఆచారాన్ని నిరసిస్తున్నారు. ఇంత చిన్న వయస్సులో సంతారాను ఇప్పించడం సరికాదని విమర్శిస్తున్నారు. మధ్యప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ సభ్యుడు ఓంకార్ సింగ్ మాట్లాడుతూ, 'ఈ మతపరమైన ఆచారంపెద్దలకు మాత్రమే. ఆ తల్లిదండ్రుల పట్ల నాకు సానుభూతి ఉంది. కానీ, మరణశయ్యపై ఉన్నప్పటికీ అభం శుభం తెలియని చిన్నారికి ఇలా చేయకూడదు.' అని అన్నారు.


సంతారా అంటే ఏమిటి?

సంతారా అనేది జైన ధర్మంలో ఒక పవిత్ర ఆచారం. దీనిని సల్లేఖన అని కూడా పిలుస్తారు. సంతారా ఆచారం ప్రకారం స్వచ్ఛందంగా చనిపోవాలనే ఉద్దేశంతో ఉన్న వ్యక్తి ప్రాణం పోయేవరకూ ఆహారం, నీటిని ముట్టరు. ఆకలిని, దాహాన్ని ఆపడం ద్వారా ఆత్మ శుద్ధి చెంది చనిపోయాక శాంతి కలుగుతుందని జైనుల విశ్వాసం. సన్యాసం తీసుకున్నప్పుడు, చావుకు దగ్గరగా ఉన్నామని భావించేవారు సంతారా స్వీకరిస్తుంటారు. కఠినమైన ఈ పద్ధతి చట్టవిరుద్దమని, జైన మతానికి ఈ ఆచారం అవసరం లేదని 2015లో రాజస్థాన్ హైకోర్టు తీర్పు చెప్పింది. కానీ సుప్రీంకోర్టు ఆ తీర్పుపై స్టే విధించి దీనిని చట్టబద్ధం చేసింది.


Read Also: Goa Temple Stampede: గోవాలోని శ్రీ లరాయ్ దేవీ దేవాలయం జాతరలో తొక్కిసలాట.. 7 దుర్మరణం

Pakistan Ceasefire: కశ్మీర్‌లో మళ్లీ కాల్పులు..తొమ్మిదోసారి ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్

NIA Report: మూడు సంస్థల ముష్కర దాడే

Updated Date - May 03 , 2025 | 10:21 AM