Share News

TN Police: హీరో విజయ్ సభకు.. అడిగిన దానికంటే అదనపు భద్రత

ABN , Publish Date - Oct 01 , 2025 | 11:26 AM

కరూర్‌లో టీవీకే అధినేత విజయ్‌ ప్రచారం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని, విద్యుత్‌ సరఫరాను నిలిపేశారని, ఉద్దేశపూర్వకంగా ప్రచారమార్గంలో అంబులెన్సులను నడిపారంటూ వస్తున్న విమర్శలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు సమాధానం చెప్పారు.

TN Police: హీరో విజయ్ సభకు.. అడిగిన దానికంటే అదనపు భద్రత

- విద్యుత్‌ సరఫరా ఆపలేదు ఫ అనుమతికి మించి భారీగా జనం

- మీడియా సమావేశంలో ఉన్నతాధికారులు

చెన్నై: కరూర్‌లో టీవీకే అధినేత విజయ్‌(Vijay) ప్రచారం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని, విద్యుత్‌ సరఫరాను నిలిపేశారని, ఉద్దేశపూర్వకంగా ప్రచారమార్గంలో అంబులెన్సులను నడిపారంటూ వస్తున్న విమర్శలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు సమాధానం చెప్పారు. సచివాలయంలో మంగళవారం ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అముద, ఆరోగ్యశాఖ కార్యదర్శి సెంథిల్‌కుమార్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సామాజిక మాధ్యమాల్లో రేగుతున్న ప్రతి సందేహానికి వారు వీడియో ఆధారంగా సమాధానాలిచ్చారు.


అదనపు భద్రత ఏర్పాటు చేశాం

టీవీకే నిర్వాహకులు విజయ్‌ ప్రచారానికి 10 వేల మంది వస్తారని పోలీసులకు చెప్పి అనుమతి పొందారని, అయితే గతంలో ఆయన సభలకు వచ్చిన జనాన్ని బట్టి తాము 20 వేల మంది వస్తారని ఊహించి పోలీసు భద్రత కల్పించామని పేర్కొన్నారు. సాధారణంగా 50 మందికి ఒక పోలీసు చొప్పున ఏర్పాటు చేస్తామని, కానీ కరూర్‌లో 20 మందికి ఒక పోలీసు చొప్పున నియమించామన్నారు. ఆ సభకు సుమారు 27,000 మంది హాజరయ్యారన్నారు. పోలీసులు లేకపోతే తాను ఇక్కడకు రాలేనని సాక్షాత్తు విజయే ఆ రోజు సభలో ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు.


పార్టీ అధ్యక్షుడి వెంట వచ్చిన కార్యకర్తలు, అప్పటికే సభ జరిగే ప్రాంతంలో వున్న అధిక ప్రజల కారణంగా రద్దీ ఏర్పడిందని వివరించారు. విజయ్‌ వాహనానికి దారిచ్చే సమయంలో రద్దీ మరింత అధికమైందన్నారు. విజయ్‌ ప్రచార వాహనాన్ని ఆపాలని అక్కడున్న పోలీసు అధికారులు కోరారని, అందుకు అంగీకరించలేదన్నారు. ప్రచారంలో విజయ్‌ మాట్లాడుతున్న సమయంలో కరెంటు ఆపలేదన్నారు. జనరేటర్‌ రూమ్‌లోకి పెద్దసంఖ్యలో ప్రజలు చొరబడడంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ ప్రాంతంలో మాత్రమే విద్యుత్‌ సరఫరా నిలిపివేశామన్నారు. ప్రజలు ఉదయం నుంచే అక్కడ వేచి ఉన్నారని, వారికి కనీసం మంచి నీరు కూడా అందలేదని వివరించారు.


nani2.2.jpg

రాత్రి సమయంలో పోస్టుమార్టం ?

కరూర్‌ ప్రభుత్వాసుపత్రిలో 28 మృతదేహాలు ఉంచేందుకే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ కార్యదర్శి తెలిపారు. స్థలాభావం కారణంగా, త్వరత్వరగా మృతదేహాలు అప్పగించాలని భావించి రాత్రి సమయంలో పోస్టుమార్టం నిర్వహించామని, బంధువులు కోరిక మేరకే మృతదేహాలను వెంటనే అప్పగించామని వారు స్పష్టం చేశారు.


అంబులెన్స్‌లు టీవీకే ఏర్పాటు చేసినవే...

కరూర్‌ ఘటన జరిగిన కొద్ది సేపటికే అన్ని అంబులెన్స్‌లు ఎలా వచ్చాయనే అనుమానాలకు కూడా అధికారులు సమాధానం ఇచ్చారు. ‘‘కరూర్‌ సభకు టీవీకే వారే 5 అంబులెన్స్‌ లు ఏర్పాటుచేశారు. విజయ్‌ వచ్చిన తర్వాత మరో రెండు అంబులెన్స్‌లు వచ్చాయి. ప్రభుత్వానికి చెందిన ఆరు అంబులెన్స్‌లు వివిధ ప్రాంతాల్లో ఉంచాం. ప్రమాదం జరిగిందనే సమాచారం అందగానే వాటిని కూడా అక్కడకు పంపించాం. ప్రభుత్వ అంబులెన్స్‌ల కన్నా టీవీకే సిద్ధం చేసిన అంబులెన్స్‌లే ఘటనా స్థలికి ముందుగా వెళ్లా యి. తొలి పిలుపు 7.15 గంటలకు వచ్చిన నేపథ్యంలో, రెండో పిలుపుతో 7.23 గంటలకు అంబులెన్స్‌లు పంపాం. రాత్రి 7.45 నుంచి 9.45 గంటల వరకు వరుసగా అంబులెన్స్‌ల ద్వారా బాధితులను తరలిస్తూనే వున్నాం’’ అని వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధర మరింత పెరిగింది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

9 నెలల్లో 203 కేసులు.. 189 మంది అరెస్టు !

Read Latest Telangana News and National News

Updated Date - Oct 01 , 2025 | 11:26 AM