Pahalgam: మతం అడిగి మరీ మారణకాండ
ABN , Publish Date - Apr 23 , 2025 | 03:59 AM
పహల్గాంలో ఉగ్రవాదుల దాడి మరోసారి ద్రోహాన్ని రేపింది. హిందువులు, ముఖ్యంగా పురుషులపై ఉగ్రవాదులు దాడి చేసి, వారి ప్రాణాలు తీసిన ఘటనా. హనీమూన్‌కు వచ్చిన జంట, తండ్రి ప్రాణాలను కోల్పోయిన కుమార్తె వంటి అనేక హృదయ విదారక సంఘటనలు చోటు చేసుకున్నాయి
పేర్లు అడిగి, ఖురాన్ సూక్తులు చెప్పించి
ముస్లింలు కాదని నిర్ధారించుకుని కాల్చివేత
హిందువులు, పురుషులే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి
హనీమూన్ జంట.. భార్య కళ్లముందే భర్త కాల్చివేత
మరో ఘటనలో కుమార్తె ఎదుటే తండ్రి హతం
రక్తంతో తడిచిన పహల్గాంలోని పచ్చిక బయళ్లు
రక్తపు మడుగులు, ఆ మడుగుల్లో అక్కడక్కడా మృతదేహాలు.. ఆ మృతదేహాల పక్కన రక్తంతో తడిచి, విషణ్ణ వదనంతో కూర్చున్నవారు కొందరు.. అయినవారిని తమ కళ్ల ముందే ఎవరో తుపాకీతో కాల్చేస్తే చూసి గుండెలవిసేలా ఏడుస్తున్నవారు మరికొందరు. భయ్యా.. నా భర్తను కాపాడండి.. దయచేసి సాయం చేయండి, మమ్మల్ని రక్షించండి.. అని చేతులు జోడించి వేడుకుంటున్న వారు ఇంకొందరు.. హనీమూన్‌కు వచ్చి భర్తను కోల్పోయి రోదిస్తున్న నవ వధువు ఓ వైపు ఉంటే.. తండ్రి చావుని చూసి రోదిస్తున్న కుమార్తె మరో వైపు.. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి అనంతరం రక్తధారలతో తడిచిన పచ్చికబయళ్లలో కనిపించిన హృదయ విదారక పరిస్థితి ఇది. ఎక్కడి నుంచో హఠాత్తుగా వచ్చిన ఉగ్రవాదులు.. హిందువులు, మరీ ముఖ్యంగా పురుషులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. పేర్లు, మతం అడిగి.. ఖురాన్‌లోని సూక్తులు పలికించి.. మతాన్ని నిర్ధారించుకుని మరీ తలపై తుపాకీలు పెట్టి కాల్చిపారేశారు. ఇదంతా ఎందుకు జరిగిందో ? వారు చేసిన తప్పేంటో? ప్రాణాలు కోల్పోయిన వారికి తెలియదు. ఇక, అయినవారిని కళ్ల ఎదుటే కోల్పోయిన వారి ఆవేదనలు హృదయాలను కలచి వేస్తుండగా.. అందాల కశ్మీరం రక్తకన్నీరు పెట్టింది.
ఖురాన్ సూక్తులు పలికించి మా నాన్నని కాల్చేశారు..
‘‘ఖురాన్‌లో ఏవో మాటలను సరిగ్గా పలకలేకపోయేసరికి మా నాన్న తలపై తుపాకీతో కాల్చేశారు. ఆ తర్వాత చెవి భాగంలో, వీపుపైనా కాల్చేశారు’’ ఉగ్రదాడిలో తండ్రి చావును కళ్లారా చూసిన పుణెకు చెందిన అస్వారి(26) అనే యువతి కన్నీటిపర్యంతమవుతూ చెప్పిన మాటలివి. అస్వారి కథనం ప్రకారం.. పుణెకు చెందిన సంతోష్ జగదలే దంపతులు, వారి కుమార్తె అస్వారి మరో ఇద్దరు కలిసి కశ్మీర్ పర్యటనకు వచ్చారు. కాల్పులు శబ్ధం వినగానే వీరంతా సమీపంలోని ఓ గుడారంలోకి వెళ్లి నేలపై పడుకున్నారు. కాసేపటికి ఆ గుడారం వద్దకు వచ్చిన ఉగ్రవాదులు.. చౌదరి గారు బయటికి రండి అంటూ బెదిరించగా వారంతా బయటికి వచ్చారు. అనంతరం ప్రధాని మోదీని దూషించిన ఉగ్రవాదులు.. ఖురాన్‌లోని కొన్ని మాటలు పలకమని అస్వారి తండ్రిని ఆదేశించారు. ఆ మాటలు చెప్పలేకపోయే సరికి ఉగ్రవాదులు ఆయన్ను కాల్చేశారు. అనంతరం వారితో ఉన్న మరో వ్యక్తిని కూడా ఉగ్రవాదులు హతమార్చారు.
ప్రాణభయంతో ఉరుకులు పరుగులు
ఉగ్రదాడి మొదలైన తర్వాత ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఘటనాస్థలిలో ఉన్న స్థానికులు, పెద్ద సంఖ్యలో పర్యాటకులు ప్రాణభయంతో ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు గాయాలపాలయ్యారు. అయితే, ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న నాగ్‌పూర్‌కు చెందిన దంపతులు తమకు ఎదురైన భయానక అనుభవాన్ని విలేకరులకు వెల్లడించారు. ఉగ్రదాడి మొదలవ్వడానికి సరిగ్గా 20 నిమిషాల ముందు తాము ఘటనాస్థలి నుంచి దూరంగా వచ్చి ప్రాణాలతో బయటపడ్డామని పేర్కొన్నారు. ఇక, పరుగెత్తే క్రమంలో కాలు విరిగి ఆస్పత్రిపాలైన అతని భార్య విలేకరులతో మాట్లాడుతూ.. కాల్పులు జరుగుతున్నాయి, పారిపోండి.. అంటూ జనం కేకలు పెడుతూ పరుగెత్తారని, చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రాణభయంతో అందరూ పరుగులు తీశారన్నారు.
ఇవి కూడా చదవండి
జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్ట్ దాడి.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటో..
Gold Rate History: 2000 నుంచి 2025 వరకు బంగారం ధరల్లో ఎంత మార్పు..