Custody: తహవ్వుర్ రాణాకు 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ
ABN , Publish Date - Apr 11 , 2025 | 09:00 AM
అమెరికాలోని లాస్‌ఏంజిలెస్‌లో అక్కడి అధికారుల నుంచి రాణాను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలం ఎయిర్‌వేస్‌లో విమానం ల్యాండ్ అయింది. అక్కడే రాణాను లాంఛనంగా అరెస్టు చేసిన ఎన్‌ఐఏ అధికారులు.. వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పటియాలా హౌస్ ఎన్‌ఐఏ కోర్టుకు తరలించారు.

న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడి కేసు (Mumbai Terror Attack)లో ప్రధాన సూత్రధారి తహవ్వుర్ రాణా (Tahawwur Rana)ను 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ (18 days NIA custody)కి కోర్టు (Court) అనుమతించింది. అర్ధరాత్రి ఎన్ఐఏ అధికారులు ఢిల్లీ (Delhi)లోని పటియాల హౌస్ కోర్టు (Patiala House Court) ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేంద్రమాన్ ఎన్ఐఏ తరఫున కోర్టులో వాదనలు వినిపించారు. రాణా తరఫున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయవాది సచ్ దేవ్ వాదించారు. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి చందర్‌జిత్ సింగ్ వాదనలు విన్నారు. రాణాను 20 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని ఎన్ఐఏ కోరగా 18 రోజుల కస్టడీకి అనుమతించారు. ఈ సందర్భంగా ఎన్ఐఏ కార్యాలయం పటియాలా హౌస్ ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు.
Also Read..: చాలా రోజులు ఖాళీగా ఇల్లు.. డోర్ ఓపెన్ చేయగా షాక్..
రాణా.. అరెస్టు వివరాలు..
అమెరికాలోని లాస్‌ఏంజిలెస్‌లో అక్కడి అధికారుల నుంచి రాణాను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలం ఎయిర్‌వేస్‌లో విమానం ల్యాండ్ అయింది. అక్కడే రాణాను లాంఛనంగా అరెస్టు చేసిన ఎన్‌ఐఏ అధికారులు.. వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పటియాలా హౌస్ ఎన్‌ఐఏ కోర్టుకు తరలించి న్యాయమూర్తి చందర్‌జిత్ సింగ్ ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు తీహాడ్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా రాణాను తరలించే మార్గాల్లో, కోర్టు పరిసరాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాణా వయసు 64 ఏళ్లు.
166 మందిని బలిగొన్న మారణ హోమం..
కసబ్ సహా పది మంది లష్కరే తాయిబా ఉగ్రవాదులు 2008 నవంబరు 26న పాకిస్థాన్ నుంచి సముద్ర మార్గంలో ముంబైకి చేరుకుని దారుణ మారణహోమానికి పాల్పడిన విషయం తెలిసిందే. 166 మంది ప్రాణాలను బలిగొన్న ఆ ఉగ్రదాడికి పాల్పడినవారిలో కసబ్ ఒక్కడు ప్రాణాలతో పట్టుబడ్డాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ).. అమెరికా జాతీయుడు డేవిడ్ హెడ్లీ, పాకిస్థాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడు తహవ్వుర్ రాణా కీలక సూత్రధారులుగా తేల్చింది.
పాక్‌లో పుట్టి.. కెనడా పౌరుడిగా మారి..
పాకిస్థాన్‌కు చెందిన రాణా.. ఆ దేశ సైన్యంలో వైద్యుడిగా పనిచేశాడు. అప్పుడే పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో లష్కరేతాయిబా ఉగ్రవాది, అమెరికన్ పౌరుడు డేవిడ్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీతో పరిచయం ఏర్పడింది. 1997లో రాణా కెనడాకు వలసవెళ్లాడు. ఇమిగ్రేషన్‌కు సంబంధించి పలు వ్యాపారాలు చేశాడు. 2001లో కెనడా పౌరసత్వం పొందాడు. ఆ తర్వాత అమెరికాలోని చికాగోకు చేరుకుని ఇమిగ్రేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేశాడు. నిజానికి లష్కరేతాయిబా సంస్థ ఉగ్రదాడులు, ఉగ్రవాదులు వివిధ దేశాలకు ప్రయాణించేందుకు ఈ సంస్థను అడ్డుపెట్టుకున్నారన్న విషయం తర్వాత బయటపడింది. మరోవైపు డేవిడ్ హెడ్లీ లష్కరేతాయిబాలో భారీ ఉగ్రదాడులపై ప్రత్యేకంగా శిక్షణ పొందాడు. ఆ సమయంలో రాణా, హెడ్లీ తరచూ సంప్రదింపుల్లో ఉండేవారు. ఈ క్రమంలోనే భారత్‌లో భారీ దాడులకు ప్లాన్ వేశారు. రాణా సాయంతో హెడ్లీ ముంబైలో ‘ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్’ పేరిట ఏజెన్సీని ఏర్పాటు చేశాడు. లష్కరేతాయిబా, ఐఏస్ఐల సూచనల మేరకు.. ముంబైలో తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, నారీమన్ పాయింట్ వద్ద రెక్కీ చేసి, మ్యాపులు రూపొందించాడు. అమెరికా మీదుగా పాక్ వెళ్లి వివరాలన్నీ లష్కరేతాయిబా, ఐఏస్ఐ బాసులకు అందజేసి.. ఉగ్రదాడులకు రూపకల్పన చేశారు. ఈ క్రమంలో రాణా, హెడ్లీ 231 సార్లు మాట్లాడుకున్నట్టు ఎన్‌ఐఏ గుర్తించింది. మరోవైపు రాణా కూడా దాడులకు ముందు సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు వైద్యురాలైన తన భార్యతో కలిసి భారత్‌లో పర్యటించాడు. తాజ్‌మహల్ వద్ద, ముంబైలో, కేరళలోని కోచిలో రెక్కీ చేసి వెళ్లాడు. తర్వాత ఐదు రోజులకే ముంబైలో ఉగ్రదాడి జరిగింది. కుంభమేళాలో ఉగ్రదాడికి కూడా రాణా ప్రణాళిక వేసినట్టు గుర్తించారు.
చట్టపరంగా... దౌత్యపరంగా..
భారత్ చట్టపరంగా, దౌత్యపరంగా చాకచక్యంగా వ్యవహరించడంతోనే రాణా అప్పగింత సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు. ముంబై పేలుళ్లతోపాటు డెన్మార్క్‌లోని ఓ వార్తాపత్రిక కార్యాలయంపై ఉగ్రదాడికి సంబంధించిన కేసులలో 2009లో రాణాను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. విచారణ జరిపిన అక్కడి కోర్టు ముంబై పేలుళ్ల వ్యవహారంలో నేరుగా సంబంధం లేదని కొట్టివేసింది. కానీ డెన్మార్క్ కేసులో 2013 జనవరిలో అతడికి 14 ఏళ్లు జైలుశిక్ష విధించింది. అప్పటి నుంచి జైల్లో ఉన్న రాణాను ముంబై ఉగ్రదాడి కేసు విచారణ కోసం అప్పగించాలని భారత్ అమెరికాపై ఒత్తిడి తెచ్చింది. దీనిపై అమెరికా కోర్టుల్లో పిటిషన్లు వేసి పోరాడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాణా అప్పగింతకు అమెరికా విదేశాంగశాఖ అనుమతి ఇచ్చింది. అప్పగింత నిర్ణయానికి వ్యతిరేకంగా రాణా అమెరికన్ కోర్టుల్లో వరుసగా పిటిషన్లు వేశాడు. పలుమార్లు గుండెపోటు వచ్చిందని, తీవ్రమైన కిడ్నీల వ్యాధి ఉందని.. తాను పాక్ ఆర్మీ మాజీ అధికారి కావడం, ముస్లిం కావడం వల్ల హింసించే అవకాశం ఉందని అతని తరఫు న్యాయవాదులు వాదించారు. భారత్‌కు అప్పగిస్తే తన ప్రాణాలకు ప్రమాదమని పేర్కొన్నారు. ముంబై పేలుళ్ల కేసులో అమెరికా కోర్టు తనను అప్పటికే విచారించిందని, అదే కేసులో భారత్‌కు అప్పగించడం ‘డబుల్ జియోపార్డీ (ఒకే కేసులో రెండు సార్లు విచారించడాన్ని నిరోధించే) చట్టం‘ను ఉల్లంఘించడమేనని వాదించారు. అయితే ముంబై మారణహోమానికి అతను సూత్రధారి అని, విచారించాల్సి ఉందని భారత న్యాయ నిపుణులు వాదించారు. ఈ కేసులో ‘డబుల్ జియోపార్డీ’ వర్తించదని అమెరికా కోర్టులకు వివరించి ఒప్పించారు. రాణా భద్రతకు, న్యాయపరమైన హక్కుల కల్పనకు హామీ ఇస్తున్నట్టు వివరించారు. మరోవైపు దౌత్యపరంగానూ అమెరికాపై ఒత్తిడి తెచ్చి రాణా అప్పగింతకు అంగీకరించేలా చేయడంలో భారత్ సఫలమైందని నిపుణులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మార్క్ శంకర్ ఆరోగ్యంపై కీలక అప్ డేట్
For More AP News and Telugu News