Supreme Court: ఆ జడ్జిలంతా నక్సలైట్లేనా?
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:55 AM
ఛత్తీస్‌గఢ్‌లో సల్వాజుడుం పేరిట ప్రజలే ప్రజల్ని చంపుకొనేలా చేయడం రాజ్యాంగ వ్యతిరేకమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర హోంమంత్రి అమిత్ షా చదివి ఉంటే..
‘సల్వాజుడుం’ తీర్పులో నాతో పాటు మరో జడ్జి ఉన్నారు.. రివ్యూ పిటిషన్‌ను మరో ఇద్దరు కొట్టేశారు
తీర్పును చదివి ఉంటే అమిత్‌షా అలా మాట్లాడేవారు కాదు
జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
న్యూఢిల్లీ, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌లో సల్వాజుడుం పేరిట ప్రజలే ప్రజల్ని చంపుకొనేలా చేయడం రాజ్యాంగ వ్యతిరేకమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర హోంమంత్రి అమిత్ షా చదివి ఉంటే.. తనపై నక్సల్స్ మద్దతుదారు అన్న ఆరోపణలు చేసి ఉండేవారు కాదేమోనని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆ 40 పేజీల తీర్పు వ్యక్తిగతంగా తనది కాదని, సుప్రీంకోర్టుదని, తనతో పాటు బెంచ్‌లో మరో న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎస్ నిజ్జార్ కూడా ఉన్నారని గుర్తు చేశారు. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను జస్టిస్ నాగరత్నమ్మ, జస్టిస్ సతీ్‌షచంద్రశర్మ కొట్టివేసారని.. దేశ అత్యున్నత న్యాయస్థానానికి చెందిన ఈ న్యాయమూర్తులందర్నీ నక్సలైట్లు అనే అంటారా అని సూటిగా ప్రశ్నించారు. వాస్తవానికి, సుప్రీంకోర్టు తీర్పుపై బయట చర్చించడం గౌరవం కాదని హితవు పలికారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో విపక్ష కూటమి ఇండియా తరఫున పోటీ చేస్తున్న జస్టిస్ సుదర్శన్‌రెడ్డి నక్సల్స్ మద్దతుదారు అని, అందుకనే సల్వాజుడుంను నిషేధించారని అమిత్‌షా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శనివారం జస్టిస్ సుదర్శన్‌రెడ్డి.. పీటీఐ, ఏఎన్‌ఐ, హిందుస్థాన్‌టైమ్స్, ఆజ్‌తక్ వంటి పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. గౌరవనీయ భారతదేశ హోంమంత్రిగా ఎలాంటి సైద్ధాంతిక వ్యత్యాసాలు చూపకుండా ప్రజల ప్రాణాలను, స్వేచ్ఛను, ఆస్తిని రక్షించే రాజ్యాంగ విధి, కర్తవ్యం అమిత్‌షాకు ఉందని, ఆయనతో నేరుగా వాగ్వాదానికి దిగాలని తాను అనుకోవటం లేదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి చెప్పారు. చర్చలో హుందాతనం ఉండాలని, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తున్నానన్నారు.
ఇది సైద్ధాంతిక పోరు
ఉపరాష్ట్రపతి పదవికి జరుగుతున్న పోటీ తనకు, ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు మధ్య జరుగుతున్న వ్యక్తిగత పోటీ కాదని, ఇది తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు భిన్న సిద్ధాంతాల మధ్య పోటీ అని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వివరించారు. రాధాకృష్ణన్ ఆర్‌ఎ్‌సఎస్ నుంచి వచ్చారని, ఆ సిద్ధాంతాన్ని తాను ఆమోదించకపోవటమే కాదు.. దానికి చాలా చాలా దూరంగా ఉంటానని తెలిపారు. తాను ప్రధానంగా ఉదార భావాలున్న రాజ్యాంగ ప్రజాస్వామ్య వాదినన్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నిరసనపై అడిగిన ప్రశ్నకు జస్టిస్ సుదర్శన్‌రెడ్డి సమాధానమిస్తూ.. విపక్షాలు సభను భగ్నం చేయడం కూడా నిరసనలో భాగమని, మాట్లాడటానికి అనుమతించనప్పుడు నిరసన తెలుపడమే మాట్లాడటమని అభివర్ణించారు. బీజేపీ ప్రతిపక్షంగా ఉన్న సమయంలో.. ‘సభను ఆటంకపర్చటం కూడా రాజకీయ కార్యాచరణే. అది ఒక పార్లమెంటరీ సంప్రదాయం’ అంటూ నాడు ఆ పార్టీ నేత అరుణ్‌జైట్లీ చేసిన వ్యాఖ్యను గుర్తుచేశారు. కులగణన అవసరాన్ని నొక్కిచెబుతూ.. సమాజంలో ఏయే వర్గాలకు ప్రభుత్వ చేయూత అవసరమో తెలుసుకునేందుకే అది అవసరమని పేర్కొన్నారు. ‘రాజ్యాంగం కులం గురించి మాట్లాడదు. ఏ సమూహ ప్రజానీకాన్నైనా వెనుకబాటు వర్గంగా పేర్కొనాలంటే ఆ ప్రజల కులం, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు, అధికారంలో వారి భాగస్వామ్యం, సమాజంలో వారి గుర్తింపు తదితర అంశాలు తెలుసుకోవటం అవసరం. దీనికోసమే కులగణన చేపట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం కూడా జనగణనలో దీనిని చేర్చుతామని ప్రకటించింది’ అని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు.
ప్రవేశిక సవరణకు జనసంఘ్ సమర్థన
సోషలిస్టు, సెక్యులర్ పదాలపై అలుముకున్న చర్చను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాజ్యాంగంలో తొలి నుంచీ ఇవి లేకున్నా, రాజ్యాంగంలో అవి అంతర్భాగమేనన్నారు. ఎమర్జెన్సీ సమయంలో వాటిని రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చినప్పటికీ, ఆ తర్వాత జనసంఘ్ (బీజేపీ పూర్వరూపం)తో కూడిన జనతాపార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు.. ఆ సవరణను ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యం తీరుతెన్నులపై స్పందిస్తూ.. గతంలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ‘ద్రవ్యలోటు’ అనే పదాన్ని ఉపయోగించేవారని, ఇప్పుడు ‘ప్రజాస్వామ్య లోటు’ గురించి మాట్లాడాల్సి వస్తోందని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు.దేశం నేటికీ రాజ్యాంగ ప్రజాస్వామ్యంగా కొనసాగుతున్నప్పటికీ.. ప్రజాస్వామ్యం ఒత్తిడిలో ఉం డటం మాత్రం వాస్తవమన్నారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందా అన్న చర్చ మంచిదేనని, దాంట్లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
‘‘దేశంలోని అత్యున్నత స్థాయి నాయకుల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఒకరు.. దార్శనికత కలిగిన నేత ఆయన.. దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన సరైన నిర్ణయాన్ని తీసుకుంటారని నమ్ముతున్నా.. ఇదివరకు అనేక సందర్భాల్లో ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. దేశ రాజకీయ రంగాన్ని ఎన్నో మలుపులు తిప్పారు.’’
ఏ పార్టీతో నాకు సంబంధం లేదు
తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, చంద్రబాబు, కేసీఆర్‌తోసహా అన్ని రాజకీయ పార్టీలనూ, నేతలనూ తనకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నానని తెలిపారు. తెలుగు ఆత్మగౌరవం పేరుతో ఓటు వేయమని తాను మాట్లాడలేదని, తెలుగుదేశం ఆ ప్రాతిపదికగా అధికారంలోకి వచ్చిందని చెప్పారు. తాను ఒక భారతీయ పౌరుడిగా అందర్నీ ఓట్లు అడుగుతున్నానని చెప్పారు. ఇండియా కూటమి తనను ఏకగ్రీవంగా ఎంపిక చేయటంపై స్పందిస్తూ.. దేశ ప్రజానీకంలో 63-64 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు తనకు మద్దతునివ్వటం తనకు గర్వకారణమన్నారు. కాగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆదివారం తమిళనాడు వెళ్లి డీఎంకే అఽధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలుసుకోనున్నారు. డీఎంకే ఎంపీలతో ఆయన భేటీ అవుతారు.
ఇవి కూడా చదవండి..
బిల్లు నుంచి తనను మినహాయించేందుకు ఒప్పుకోని మోదీ
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News