Kiran Rijiju: బిల్లు నుంచి తనను మినహాయించేందుకు ఒప్పుకోని మోదీ
ABN , Publish Date - Aug 23 , 2025 | 09:02 PM
దేశంలోఎక్కువ మంది సీఎంలు బీజేపీకి చెందిన వారే ఉన్నారని, వాళ్లలో ఎవరూ తప్పుచేసినా తమ పదవులను విడిచిపెట్టాల్సి ఉంటుందని రిజిజు అన్నారు. ప్రధాని ఎవరైనా అవినీతికి పాల్పడితే జైలుకు వెళ్లాల్లి ఉంటుందని, పదవిని కూడా వీడాల్సి ఉంటుందని అన్నారు.
న్యూఢిల్లీ: తీవ్రమైన నేరాలతో జైలుకు వెళ్లిన ప్రధాని, సీఎం, మంత్రులను తొలగించేందుకు ఉద్దేశించిన బిల్లుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijiju) ఆసక్తికరమైన విషయాన్ని శనివారంనాడు వెల్లడించారు. బిల్లు నుంచి తనను (ప్రధానిని) మినహాయించేందుకు మోదీ నిరాకరించారని చెప్పారు. బిల్లు పరిధిలోకి ప్రధానిని దూరంగా ఉంచేందుకు క్యాబినెట్ చేసిన సిఫారసును మోదీ నిరాకరించారని, ఆ సిఫారసుతో తాను ఏకీభవించనని మంత్రివర్గంతో స్పష్టం చేశారని తెలిపారు. ప్రధానికి ఎలాంటి మినహాయింపు ఉండాల్సి పని లేదని, పీఎం కూడా ఒక పౌరుడేనని, ఆయనకు ప్రత్యేక రక్షణ అవసరం లేదని మోదీ చెప్పారని రిజిజు వెల్లడించారు.
ఎక్కువ మంది మా సీఎంలే
దేశంలోఎక్కువ మంది సీఎంలు బీజేపీకి చెందిన వారే ఉన్నారని, వాళ్లలో ఎవరూ తప్పుచేసినా తమ పదవులను విడిచిపెట్టాల్సి ఉంటుందని రిజిజు అన్నారు. ప్రధాని ఎవరైనా అవినీతికి పాల్పడితే జైలుకు వెళ్లాల్లి ఉంటుందని, పదవిని కూడా వీడాల్సి ఉంటుందని అన్నారు. ఇంత పారదర్శకంగా బిల్లు ఉన్నప్పుడు విపక్షాలకు అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులోని నైతికతకు కట్టుబడి ఉండాలని విపక్షాలు భావిస్తే బిల్లును స్వాగతించాలని కోరారు.
ఓటు బ్యాంకు రాజకీయాలు
ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ దాడి చేస్తోందని, జాతివ్యతిరేక ప్రవర్తనకు పాల్పడుతోందని రిజిజు ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ఓట్లు సాధించుకోలేరని అన్నారు. పతాక శీర్షికల్లో ఉండేందుకు రాహుల్ గాంధీ ఎలాపడితే అలా మాట్లాడుతుంటారని, ఇందువల్ల ఓట్ బ్యాంకు సాధ్యం కాదని పేర్కొన్నారు. బీజేపీ ఎల్లకాలం అధికారంలో ఉండకపోవచ్చని, కాంగ్రెస్ ప్రజావిశ్వాసం చూరగొనవచ్చని, అయితే సంస్థలను గౌరవించడం, నిర్మాణాత్మక రాజకీయాల వల్లే కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని చూరగలగుతుందని అన్నారు. విపక్షాలు ప్రజాసామ్యబద్ధంగా చర్చలు జరపాలని, పార్లమెంటు నిర్వహణలో విపక్షాలు తమ కీలక పాత్రను గుర్తించారని సూచించారు. సభలో చర్చకు ప్రభుత్వం స్వాగతిస్తుందని, అయితే పార్లమెంటును సక్రమంగా పనిచేయకుండా విపక్షాలు అడ్డుకుంటే సమావేశంలో ప్రశ్నించాలనుకునే వారికే నష్టం జరుగుతుందని, ప్రభుత్వానికి కాదని అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆ బిల్లు ఓ ప్రహసనం, జేపీసీకి సభ్యుడిని నామినేట్ చేయం.. మమత ఫైర్
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News