Supreme Court: రోస్టర్ అధికారం హైకోర్టు సీజేదే
ABN , Publish Date - Aug 08 , 2025 | 05:07 AM
సివిల్ కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్‌కు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఇచ్చిన తీర్పును సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్‌ను.. సుప్రీంకోర్టు మరోసారి విచారించనుంది.
ఒక జడ్జికి క్రిమినల్ కేసులు కేటాయించొద్దని ఆదేశించడం
ఆ అధికారాల్లో జోక్యం చేసుకోవడమే: సుప్రీం సీనియర్ జడ్జిలు
జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మహదేవన్ బెంచ్ తీర్పుపై అసంతృప్తి
అలహాబాద్ హైకోర్టు జడ్జిపై సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యల కేసు
సర్వోన్నత న్యాయస్థానంలో నేడు మళ్లీ విచారణకు
సుప్రీం ఆదేశాలు అమలు చేయకుండా ఉండేందుకు ఫుల్‌కోర్టును
సమావేశపరచండి: అలహాబాద్ సీజేకు 13 మంది జడ్జిల లేఖ
అలహాబాద్, న్యూఢిల్లీ, ఆగస్టు 7: సివిల్ కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్‌కు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఇచ్చిన తీర్పును సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్‌ను.. సుప్రీంకోర్టు మరోసారి విచారించనుంది. సర్వోన్నత న్యాయస్థానంలో శుక్రవారం విచారణకు వచ్చే కేసుల జాబితాలో ఈ కేసు కూడా ఉంది. గతంలో ఈ వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌తో కూడిన ధర్మాసనమే దీన్ని విచారించనుంది. ఆగస్టు 4న ఈ కేసు విచారణ సందర్భంగా.. జస్టిస్ ప్రశాంత్‌కుమార్ తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘‘హైకోర్టుల్లో ఏం జరుగుతోంది.. ఇది సుప్రీం జడ్జిలుగా మేం చూసిన అత్యంత చెత్త, తప్పుడు తీర్పుల్లో ఒకటి’’ అంటూ సుప్రీంకోర్టు తన తీర్పులో మండిపడింది. అంతేకాదు.. ఆ జడ్జికి (జస్టిస్ ప్రశాంత్‌కుమార్) రిటైరయ్యే దాకా క్రిమినల్ కేసుల విచారణ అప్పగించొద్దని, ఆయన్ను వేరే సీనియర్ జడ్జి ఉన్న ధర్మాసనంలో కూర్చోబెట్టాలని.. అలహాబాద్ హైకోర్టు సీజేకు సూచించింది. అయితే ఆ తీర్పుపై సుప్రీంకోర్టులోని ఇతర సీనియర్ న్యాయమూర్తులు అసంతృప్తి వ్యక్తం చేశారని, దీనిపై సుప్రీం సీజే జస్టిస్ బీఆర్ గవాయ్ కూడా సుప్రీం సీనియర్ జడ్జిలతో సంప్రదించారని సమాచారం. ఒక జడ్జి రిటైరయ్యే దాకా క్రిమినల్ కేసులు అప్పగించకూడదని ఆదేశించడం.. హైకోర్టు సీజేకున్న రోస్టర్ అఽధికారాల్లో జోక్యం చేసుకోవడమేనని వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసును మళ్లీ విచారించనున్నట్టు తెలిసింది.
ఫుల్‌కోర్టును సమావేశపరచండి..
మునుపెన్నడూ లేని విధంగా.. సుప్రీం తీర్పులో కొన్ని ఆదేశాలను అమలు చేయకూడదంటూ అలహాబాద్ హైకోర్టుకు చెందిన 13 మంది న్యాయమూర్తులు ఆ హైకోర్టు సీజేకు ఒక లేఖ రాశారు. జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌కు క్రిమినల్ కేసులు అప్పగించొద్దని సుప్రీం ఇచ్చిన తీర్పుపై చర్చించేందుకు ఫుల్‌కోర్టును సమావేశపరచాల్సిందిగా ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ‘‘సుప్రీంకోర్టుకు హైకోర్టులపై పాలనాపరమైన పర్యవేక్షణ అధికారం లేదు. కాబట్టి.. సర్వోన్నత న్యాయస్థానం ఆగస్టు 4న ఇచ్చిన తీర్పులోని 24, 25, 26 పారాల్లో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకూడదని మా ఫుల్‌కోర్టు తీర్మానం చేసింది. ఆ ఆదేశాలపైన, తీర్పులో వాడిన భాష, మాటల ధోరణిపై ఫుల్‌కోర్టు విచారం వ్యక్తం చేసింది’’ అనే తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా ఆ లేఖలో కోరారు. ఈ కేసు విషయంలో జస్టిస్ ప్రశాంత్ కుమార్‌కు ఎలాంటి నోటీసులూ జారీచేయకుండా, వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వకుండా.. సుప్రీంకోర్టు ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిందని పేర్కొన్నారు. అలాంటి వ్యాఖ్యలు.. అమర్‌పాల్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ, 2012 కేసులో సుప్రీంకోర్టు ప్రతిపాదించిన సూత్రాలనే ఉల్లంఘించే విధంగా ఉన్నాయని ఆవేదన వెలిబుచ్చారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ తీర్పు.. ఎలాంటి ముందస్తు ఉదాహరణా లేకుండా ఇచ్చింది, విపరీతమైనది కాదని.. సుప్రీంకోర్టు గతంలో లీకున్‌హీ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ, సయ్యద్ అస్కారీ హదీ అలీ ఆగస్టీన్ ఇమామ్ వర్సెస్ స్టేట్ (ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్) కేసుల్లో ఇచ్చిన తీర్పుల ఆధారంగా ఇచ్చిందని గుర్తుచేశారు. కాబట్టి ఆయనపై అంత తీవ్ర వ్యాఖ్య లు చేసి ఉండాల్సింది కాదన్నారు. అలహాబాద్ హైకో ర్టు జడ్జి జస్టిస్ అరిందమ్ సిన్హా పేరిట రాసిన ఈ లేఖలో మరో 12 మంది జడ్జిలులు సంతకం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు
గువ్వల రాజీనామా.. స్పందించిన బీఆర్ఎస్
For More National News and Telugu News