Supreme Court Questions: గడువు విధించినా..గవర్నర్లు పాటించకపోతే
ABN , Publish Date - Sep 03 , 2025 | 02:55 AM
బిల్లులపై ఆమోదముద్ర కోసం గవర్నర్లకు గడువు విధించే అధికారం న్యాయస్థానాలకు ఉందా ఒకవేళ గడువు విధిస్తే.. దానిని గవర్నర్లు పాటించకపోతే పరిస్థితి ఏమిటి? అంటూ సుప్రీంకోర్టు సందేహాలు వ్యక్తం చేసింది...
గడువు విధించే అధికారం కోర్టులకు ఉందా?
‘వీలైనంత త్వరగా బిల్లుల్ని ఆమోదించాలి’ అని మాత్రమే రాజ్యాంగంలో ఉంది
కొన్ని ఘటనల ఆధారంగా గవర్నర్లకు, రాష్ట్రపతికి కాలపరిమితి నిర్దేశించలేం అవసరమైతే కోర్టులు ఉన్నాయి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: బిల్లులపై ఆమోదముద్ర కోసం గవర్నర్లకు గడువు విధించే అధికారం న్యాయస్థానాలకు ఉందా? ఒకవేళ గడువు విధిస్తే.. దానిని గవర్నర్లు పాటించకపోతే పరిస్థితి ఏమిటి? అంటూ సుప్రీంకోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. ‘బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదం’ అంశంపై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. గవర్నర్లకు గడువు విధించకపోతే బిల్లులను వారు ఎంతకాలమైనా ఆమోదించకుండా ఉండే పరిస్థితి ఉంటుందని, తద్వారా సదరు బిల్లు కాలదోషం పట్టే పరిస్థితి తీసుకురావచ్చన్నారు. గవర్నర్ సూపర్ చీఫ్ మినిస్టర్‌లా మారే ప్రమాదం ఉందని, ఇది ఎంతమాత్రం సరికాదని తెలిపారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన కపిల్ సిబల్.. రాజ్యాంగ వ్యవస్థలు పని చేయకుండా అడ్డుకోవటానికి గవర్నర్లకు రాజ్యాంగం ఎటువంటి హక్కు కల్పించలేదని, రాజ్యాంగ వ్యవస్థలు పని చేసేలా కోర్టు జోక్యం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కాగా, విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. ఒక్కో అంశం ఒక్కో విధంగా ఉంటుందని, అన్ని బిల్లులకూ ఒకే గడువు ఎలా విధించగలమన్నారు. బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతికి గడువును పేర్కొనటం అంటే బలవంతంగా విధించటంలాగే ఉందన్నారు. బిల్లుల ఆమోదానికి రాజ్యాంగం ఎటువంటి గడువును పేర్కొనలేదని, వీలైనంత త్వరగా ఆమోదించాలని మాత్రమే చెప్పిందని గుర్తు చేశారు. గవర్నర్లు బిల్లుల ఆమోదంపై జాప్యం చేసిన కొన్ని ఉదంతాల ఆధారంగా మొత్తం గవర్నర్ల వ్యవస్థ మీద, రాష్ట్రపతి మీద గడువు విధించలేమని ఒకదశలో ధర్మాసనం అభిప్రాయపడటం గమనార్హం. అలా చేస్తే కోర్టే రాజ్యాంగంలో సవరణ జరిపినట్లవుతుందని జస్టిస్ విక్రమ్‌నాథ్ పేర్కొన్నారు. జాప్యం జరుగుతుందని భావించినప్పుడు న్యాయస్థానానికి రావచ్చని, ఆ అవకాశం ఎప్పుడూ రాష్ట్రాలకు ఉంటుందని ధర్మాసనం గుర్తు చేసింది.
వాదనల్లో తెలంగాణ ప్రస్తావన
పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఎమ్మెల్యేల అభ్యర్థిత్వంపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను ఇటీవల సీజేఐ గవాయ్ ఆదేశించిన విషయాన్ని సింఘ్వీ గుర్తు చేశారు. గవర్నర్లకు కూడా ఇలాగే కాలపరిమితి విధించవచ్చన్నారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. ‘దేశంలో ఉన్న అసెంబ్లీల స్పీకర్లందరికీ ఈ ఆదేశాలు ఇవ్వలేదు. అక్కడ ఉన్న కేసును బట్టి మాత్రమే ఆ ఆదేశాలిచ్చాం’ అని స్పష్టం చేశారు. కాగా, ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ కొనసాగనుంది.
శిక్ష తగ్గించాలని కోరే హక్కు జీవిత ఖైదీలకూ ఉంది
సహజ మరణం సంభవించే వరకు జైలులోనే గడపాలంటూ తీర్పు వచ్చినప్పటికీ ఆ శిక్షను తగ్గించాలని కోరే హక్కు ఖైదీలకు ఉందని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మైనర్లపై అత్యాచారం చేసి జీవితాంత శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా ఇలాంటి వినతి చేయవచ్చని తెలిపింది. పూర్వపు ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 376డీఏ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ఈ స్పష్టత ఇచ్చింది. 16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం, గ్యాంగ్‌రే్‌పలకు పాల్పడేవారికి విధించే శిక్షలను ఈ సెక్షన్ వివరిస్తుంది. నేరం రుజువయితే దోషులు సహజ మరణం సంభవించే వరకు జైలులోనే కాలం గడపాల్సి ఉంటుంది. దీనివల్ల క్షమాభిక్షను పొందే హక్కును ముద్దాయిలు కోల్పోతున్నారని, ఇది సమంజసమేనా అన్న ప్రశ్న ధర్మాసనం ముందుకు వచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!
ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ
For More National News And Telugu News