CJI Gavai-Nepal Protests: సుప్రీం కోర్టులో నేపాల్ ప్రస్తావన.. భారత రాజ్యాంగంపై సీజేఐ జస్టిస్ గవాయ్ ప్రశంసలు
ABN , Publish Date - Sep 10 , 2025 | 04:32 PM
శాసనసభ బిల్లులకు గవర్నర్‌ల ఆమోదంపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేపాల్‌లో కల్లోల పరిస్థితుల గురించి ప్రస్తావించిన ఆయన తనకు భారత రాజ్యాంగం గర్వకారణమని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్ర శాసనసభల బిల్లులకు గవర్నర్ల ఆమోదం అంశంపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తాజాగా నేపాల్ ప్రస్తావన తెచ్చారు. ‘ఒక్కసారి మన చుట్టూ ఉన్న దేశాల్లో ఏం జరుగుతోందో చూడండి.. నేపాల్‌లో ఏం జరుగుతోందో చూడండి.. ఈ పరిస్థితుల్లో మన రాజ్యాంగాన్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. చీఫ్ జస్టిస్ అభిప్రాయంతో మరో న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ సేఠ్ కూడా ఏకీభవించారు. బంగ్లాదేశ్‌లో నిరుడు జరిగిన ఘటనలను గుర్తు చేశారు (CJI cites Nepal protests).
ఇక విచారణ సందర్భంగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. బిల్లులకు సంబంధించి గవర్నర్లకు ఉన్న అధికారాలను సమర్థించే ప్రయత్నం చేశారు. చాలా అరుదుగా మాత్రమే గవర్నర్లు బిల్లుల పరిశీలనకు నెల రోజులకు మించి సమయాన్ని తీసుకుంటారని అన్నారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను సుప్రీం ముందుంచే ప్రయత్నం చేశారు. 90 శాతం బిల్లులను నెలలోపే గవర్నర్‌లు క్లియర్ చేస్తారని చెప్పారు. సాలిసిటర్ జనరల్ తెలిపిన వివరాల ప్రకారం, 1970-2025 మధ్య కేవలం 20 బిల్లులనే గవర్నర్లు రిజర్వ్‌లో పెట్టారు. (pride in constitution Of India).
అయితే, చీఫ్ జస్టిస్ మాత్రం ఈ వాదనలతో పూర్తిగా ఏకీభవించలేదు. ‘ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకోలేము. రాష్ట్రాల కోణంలో ఇది సబబు కాదు. వాళ్ల గణాంకాలను కూడా మేము పరిగణనలోకి తీసుకోలేదు. మీరు కూడా గతంలో వారి గణాంకాలపై అభ్యంతరం చెప్పారు. కాబట్టి, ఇప్పుడు ఈ విషయాల్లోకి వెళ్లదలుచుకోలేదు’ అని అన్నారు.
బంగ్లాదేశ్‌లో గత ఏడాది విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన నిరసనల్లో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా నేపాల్‌లో కూడా అక్కడి యువత పాలకవర్గంపై కదం తొక్కుతోంది. ఈ పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది.
ఇవి కూడా చదవండి
కనీసం నాకు విషమైనా ఇప్పించండి.. కోర్టులో కన్నడ నటుడు దర్శన్ కామెంట్
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా 400 మందికి పైగా సైంటిస్టులు రేయింబవళ్లు శ్రమించారు: ఇస్రో చీఫ్
For More National News and Telugu News