Ethanol Blending: ఇథనాల్ కలిపిన పెట్రోల్ విధానాన్ని సవాలు చేస్తూ పిటిషన్.. సుప్రీం కోర్టులో చుక్కెదురు
ABN , Publish Date - Sep 01 , 2025 | 03:35 PM
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం తాజాగా కొట్టేసింది. విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ మాట్లాడుతూ భారత్‌లో ఏరకమైన పెట్రోల్ విక్రయించాలనేది బయటున్న వారు నిర్ణయిస్తారా అని ప్రశ్నించారు.
ఇంటర్నెట్ డెస్క్: పెట్రోల్‌కు 20 శాతం ఇథనాల్ (ఈ20) కలపాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తాజాగా కొట్టేసింది. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం.. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వాదనలతో ఏకీభవిస్తూ పిటిషన్‌ను కొట్టేసింది.
పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ షాదన్ ఫరాసత్ వాదనలు వినిపించారు. ఆరు శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో పాత వాహనాల మైలేజీ తగ్గుతుందని వాదించే ప్రయత్నం చేశారు. 2023కు ముందు తయారైన వాహనాల్లో ఈ సమస్య ఉందని అన్నారు. నచ్చిన ఇంధనాన్ని ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారులకు ఉండాలన్నదే తమ వాదన అని చెప్పారు. ఈ20 పెట్రోల్‌కు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. దేశంలో ఇంధన వినియోగానికి సంబంధించి ఇది సహేతుకమైన చర్యేనని కూడా అన్నారు. అయితే, ఈ10 పెట్రోల్ అందుబాటులో లేకపోవడంపైనే తమ అభ్యంతరమని తెలిపారు. 2023 తరువాత తయారైన వాహనాలు మాత్రమే ఈ20 పెట్రోల్‌కు అనువైనవని చెప్పుకొచ్చారు.
పిటిషనర్ వాదనలను వెంకటరమణి తోసిపుచ్చారు. స్వీయ ప్రయోజనాలున్న లాబీ తరుపున పిటిషనర్ రంగంలోకి దిగారని అన్నారు. భారత్‌లో ఏ పెట్రోల్ వాడాలనేది దేశం వెలుపల ఉన్న వారు నిర్దేశిస్తారా అని ప్రశ్నించారు. ఈ20 పెట్రోల్ వినియోగంతో చెరకు రైతులకు లాభం చేకూరుతుందని, విదేశీ మారక ద్రవ్యం పొదుపు అవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు పిటిషనర్ వాదనలను తోసి పుచ్చింది.
ఈ20 పెట్రోల్‌పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివాదం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ చర్యను పలువురు వాహనదారులు, ఆటోమొబైల్ రంగం ఔత్సాహికులు వ్యతిరేకిస్తున్నారు. ఇంజెన్ పనితీరు తగ్గుతుందని, మైలేజీ పడిపోతుందని చెబుతున్నారు. మెకానికల్ లోపాల కారణంగా వాహనం జీవిత కాలం, విశ్వసనీయత తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ20 పెట్రోల్ విధానాన్ని సమర్థించుకుంది. ఈ పెట్రోల్‌తో కాలుష్యం, దిగుమతుల భారం తగ్గుతుందని పేర్కొంది. ఇథనాల్‌తో కర్బన ఉద్గారాల తగ్గుదలపై నీతి అయోగ్ అధ్యయనాన్ని కూడా ప్రస్తావించింది.
సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే.. చెరకు, మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ ఉన్న పెట్రోల్ వాడకంతో కర్బన ఉద్గారాల విడుదల వరుసగా 65 శాతం, 50 శాతం మేర తగ్గుతుందన్న నీతి అయోగ్ అధ్యయనాన్ని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ విధానం ఇప్పటికే గ్రామీణ ఆర్థికవ్యవస్థను మెరుగుపరిచిందని పేర్కొంది. ఎందరో రైతులకు జీవనోపాధి లభించి ఆత్మహత్యల ఉదంతాలు తగ్గాయని వెల్లడించింది. మీడియా కథనాల ప్రకారం, 2022-23లో భారత్‌లో పెట్రోల్‌లో ఇథనాల్ శాతం సగటున 12.06గా ఉండేది. ఆ మరుసటి ఏడాది ఇథనాల్ వాటా 14.6 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 19.6 శాతానికి చేరుకుంది.
ఇవి కూడా చదవండి:
భారత యుద్ధ నౌకలన్నీ స్వదేశంలోనే తయారవుతాయి: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
సెప్టెంబర్ నెలాఖరు కల్లా ఎయిర్ ఫోర్స్ చేతికి రెండు తేజస్ ఎమ్‌కే-1ఏ ఫైటర్ జెట్స్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి