Share News

Vande Mataram Debate: వందేమాతరం గేయాన్ని స్కూళ్లలో తప్పనిసరి చేయాలి: సుధామూర్తి

ABN , Publish Date - Dec 09 , 2025 | 10:05 PM

భారతదేశాన్ని అనేక మంది పాలించినప్పుడు ప్రజలు ఆత్మవిశ్వాసం కోల్పోయి నిరాశానిస్పృహలకు లోనయ్యారని, అలాంటి సమయంలో వందేమాతరం ఒక అగ్నిపర్వతంలా జనంలోకి దూసుకెళ్లిందని సుధామూర్తి అన్నారు.

Vande Mataram Debate: వందేమాతరం గేయాన్ని స్కూళ్లలో తప్పనిసరి చేయాలి: సుధామూర్తి
Sudha Murty

న్యూఢిల్లీ: ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో వందేమాతరం గేయాన్ని ఆలపించడం తప్పనిసరి చేయాలని రాజ్యసభ నామినేటెడ్ ఎంపీ సుధామూర్తి (Sudha Murty) ప్రభుత్వాన్ని కోరారు. వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యసభలో మంగళవారంనాడు జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు.


ఎంపీగానో, సంఘసేవకురాలుగానో, రచయిత్రి గానో తాను ఇక్కడ మాట్లాడటం లేదని, భరతమాత బిడ్డగా తాను ఈ విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఇండియా ఒక మెత్తని బొంత (quilt) అనుకుంటే అందులో రంగురంగుల వస్త్రాలు రాష్ట్రాలనీ, వాటిని కలిపి కుట్టే దారం, సూది 'వందేమాతరం' అని అభివర్ణించారు. భారతదేశాన్ని అనేక మంది పాలించినప్పుడు ప్రజలు ఆత్మవిశ్వాసం కోల్పోయి నిరాశానిస్పృహలకు లోనయ్యారని, అలాంటి సమయంలో వందేమాతరం ఒక అగ్నిపర్వతంలా జనంలోకి దూసుకెళ్లిందని అన్నారు. వందేమాతరం ఒక మ్యాజిక్ టచ్ అని, గుండెనిబ్బరం కోల్పోయిన వారిలో కూడా ధైర్యం నింపుతుందని పేర్కొన్నారు.


దేశ స్వాతంత్ర్యం కోసం మనం చేసిన పోరాటాన్ని వందేమాతరం ప్రతీక అని, స్వాతంత్ర్యం మనకు వెండిపళ్లెంలో పెట్టి అప్పగించలేదని సుధామూర్తి గుర్తుచేశారు. వందేమాతరంతో మమేకపై ప్రజలు చేసిన గొప్ప పోరాటం అనంతరమే స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు. అయితే ఇంతటి అందమైన జాతీయ గేయాన్ని స్కూళ్లలో చెప్పడం లేదని, ఇదే కొనసాగితే కొంతకాలానికి స్వాంతంత్ర్యం కోసం మనం చేసిన పోరాటాన్ని పిల్లలు అర్థం చేసుకోలేరని వివరించారు. ఆ దృష్ట్యా ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో వందేమాతర గేయాన్ని తప్పనిసరి చేయాలని విద్యాశాఖను తాను కోరుతున్నానని అన్నారు. కరుణ, త్యాగం, మాతృభూమి సంరక్షణతో ముడిపడినదే దేశభక్తి అని, వందేమాతరం వీటన్నింటిని వివరిస్తుందని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

మోదీతో సత్యనాదెళ్ల భేటీ.. భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్

ఆర్ఎస్ఎస్ ఎజెండాను ప్రభుత్వం అమలు చేస్తోంది... ఎస్ఐఆర్‌పై చర్చలో రాహుల్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 09 , 2025 | 10:10 PM