Highway Emergency Number: హైవేలో మీ వాహనం బ్రేక్‌డౌన్, యాక్సిడెంట్ జరిగిందా..ఈ నంబర్‌కు కాల్ చేయండి, నిమిషాల్లోనే సాయం
ABN , Publish Date - Aug 09 , 2025 | 11:59 AM
చాలా సార్లు మనం హైవేలలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. కానీ అనుకోకుండా వాహనం ప్రమాదానికి గురైనా లేదా ఇతర సమస్య వచ్చిన ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే హైవేపై ఎలాంటి సమస్య వచ్చిన సాయం చేసేందుకు ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసింది.
మనం హైవేలో ప్రయాణిస్తున్నప్పుడు, దూరం ఎంతైనా సరే, రోడ్డు ప్రయాణం సాఫీగా ఉంటుందని ఆశిస్తాం. కానీ, కొన్నిసార్లు అనుకోని సమస్యలు తలెత్తుతాయి. వాహనం బ్రేక్‌డౌన్ అయినా, యాక్సిడెంట్ జరిగినా లేదా ఇంధనం అయిపోయినా అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక (Highway Emergency Number) ఆందోళన చెందుతాం. ప్రధానంగా ఎవరు లేని ప్రదేశంలో లేదా రాత్రి సమయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే మాత్రం ఇబ్బంది తప్పదు. అయితే, ఇప్పుడు అలాంటి సమయాలలో కూడా భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
హెల్ప్‌లైన్ నంబర్
ఎందుకంటే భారత ప్రభుత్వం హైవేలో ప్రయాణించే వారి కోసం ఒక ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ హెల్ప్‌లైన్ నంబర్ 1033 జాతీయ రహదారులపై ఎదురయ్యే ఏ అత్యవసర సమస్యకైనా పనిచేస్తుంది. ఈ నంబర్ 24 గంటలూ, వారంలో 7 రోజులూ అందుబాటులో ఉంటుంది. మీ వాహనం ఆగిపోయినా, రోడ్డు ప్రమాదం జరిగినా, లేదా పెట్రోల్, డీజిల్ అయిపోయినా, ఈ నంబర్‌కు కాల్ చేస్తే వెంటనే సహాయం అందుతుంది.
ఎలాంటి సమస్యలకు సహాయం అందుతుంది?
హైవేలో ఎదురయ్యే దాదాపు అన్ని సమస్యలకు ఈ హెల్ప్‌లైన్ ద్వారా సహాయం పొందవచ్చు.
ఉదాహరణకు వాహనం బ్రేక్‌డౌన్ అయినప్పుడు
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు
ఇంధనం (పెట్రోల్/డీజిల్) అయిపోయినప్పుడు
టైర్ పంక్చర్ అయినా లేదా ఇతర సాంకేతిక సమస్యలు ఎదురైనా
వాహనాన్ని త్రో చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు
ఈ నంబర్‌కు కాల్ చేస్తే, సమస్య ఎంత చిన్నదైనా లేదా పెద్దదైనా, తక్షణ సహాయం అందించేందుకు బృందం సిద్ధంగా ఉంటుంది.
మొబైల్ సిగ్నల్ లేకపోతే ఏం చేయాలి?
కొన్నిసార్లు హైవేలో మొబైల్ సిగ్నల్ అందకపోవచ్చు లేదా మీ ఫోన్ బ్యాటరీ అయిపోవచ్చు. అలాంటి సమయంలో ఏం చేయాలి? దీనికోసం జాతీయ రహదారులపై తక్కువ దూరంలో ఫోన్ బూత్‌లు ఏర్పాటు చేశారు. మీరు దగ్గరలోని ఫోన్ బూత్‌కు వెళ్లి మీ సమస్యను తెలియజేయవచ్చు. అక్కడి సిబ్బంది మీ స్థానాన్ని గుర్తించి, వెంటనే సహాయం అందిస్తారు.
ఈ సేవ ఎందుకు ప్రత్యేకం?
ఈ హెల్ప్‌లైన్ సేవ చాలా వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తుంది. మీరు 1033కు కాల్ చేసిన వెంటనే, మీ సమస్య సంబంధిత అధికారులకు చేరుతుంది. వారు వెంటనే సహాయ బృందాన్ని మీ వద్దకు పంపిస్తారు. ఈ సేవ ప్రయాణీకుల భద్రతను పెంచుతుంది. అంతేకాదు, ఈ నంబర్ టోల్ ఫ్రీ. అంటే కాల్ చేయడానికి మీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో హైవేలో ప్రయాణం చేసేటప్పుడు ఈ నంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
ఇవి కూడా చదవండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి