Kandla Takeoff Incident: టేకాఫ్ సమయంలో ఊడిపోయిన స్పైస్ జెట్ విమాన చక్రం.. చివరకు..
ABN , Publish Date - Sep 12 , 2025 | 06:23 PM
కండ్లా ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ సమయంలో చక్రం ఊడిపోయినా ప్రయాణం కొనసాగించిన ఓ స్పైస్ జెట్ విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండయ్యింది. విమానంలోని 75 మంది ప్రయాణికులు భద్రంగా తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: టేకాఫ్ సమయంలో ఓ స్పైస్ జెట్ విమాన చక్రం ఊడిపోయిన ఘటన గుజరాత్‌లో తాజాగా చోటుచేసుకుంది. కండ్లా ఎయిర్‌పోర్టు నుంచి శుక్రవారం 75 మంది ప్రయాణికులతో స్పైస్ జెట్ క్యూ-400 విమానం బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది (Kandla takeoff incident). విమానానికి ఉన్న చక్రాల్లో ఒకటి ఊడిపోయింది. విమానం కుడివైపునున్న రెండు చక్రాల్లో ఒకటి ఊడి కిందపడినట్టు సమాచారం.
అయితే, విమానం యథాతథంగా ప్రయాణం కొనసాగించి ముంబైలో ల్యాండయ్యింది. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ముంబై ఎయిర్ పోర్టులో హైఅలర్ట్ ప్రకటించారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలో విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండయ్యింది. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని స్పైస్ జెట్ ప్రతినిధి తెలిపారు. ఇక ఊడిపోయిన చక్రాన్ని కండ్లా ఎయిర్‌పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, 2023లో సరిగ్గా ఇలాంటి ఘటన కొచ్చి ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. స్పైస్ జెట్‌కు చెందిన ఓ విమానం దుబాయ్ నుంచి బయలుదేరి కొచ్చిలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో టైర్ బరస్ట్ అయ్యింది. ఈ ఘటనలో విమానం సురక్షితంగా ల్యాండవడంతో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదు.
ఇవి కూడా చదవండి
ట్రంప్ సుంకాలతో తీవ్ర ప్రభావం.. ఉద్యోగాలు పోతున్నాయి: శశి థరూర్
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. కేంద్ర కమిటీ సభ్యుడు మోదెం బాలకృష్ణ మృతి
For More National News and Telugu News