Shashi Tharoor-Trump Tariffs: ట్రంప్ సుంకాలతో తీవ్ర ప్రభావం.. ఉద్యోగాలు పోతున్నాయి: శశి థరూర్
ABN , Publish Date - Sep 12 , 2025 | 04:37 PM
ట్రంప్ సుంకాల ప్రభావం కారణంగా భారత్‌లో ఇప్పటికే ఉద్యోగాల కోతలు మొదలయ్యాయని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ అన్నారు. భారత్ తన ఎగుమతులను మరిన్ని దేశాలకు విస్తరించాలని సూచించారు. ఆర్థిక వ్యవస్థను మూలాల నుంచి బలోపేతం చేయాలని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో భారత్‌పై తీవ్ర ప్రభావం పడిందని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ అన్నారు. ఇప్పటికే భారతీయులు అనేక మంది తమ ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడేం చేస్తారో తెలియని వ్యక్తి అని విమర్శించారు. సంప్రదాయక దౌత్య విధానాలను ఆయన గౌరవించట్లేదని అన్నారు. క్రెడాయ్ ఏర్పాటు చేసిన ఓ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ కామెంట్స్ చేశారు (Shashi Tharoor on Trump tariffs).
భారత వస్తువులపై 25 శాతం సుంకం విధించిన అమెరికా ఆ తరువాత అదనంగా 25 శాతం పెనాల్టీనీ విధించిన విషయం తెలిసిందే. దీంతో, భారత్‌పై మొత్తం సుంకాల భారం 50 శాతానికి పెరిగింది. అయితే, సుంకాల ఎఫెక్ట్‌ను తట్టుకునేందుకు భారత్ తన ఎగుమతులను ఇతర దేశాలకు విస్తరించాలని శశి థరూర్ అభిప్రాయపడ్డారు. సూరత్‌లోని వజ్రాలు, నగల సంస్థల్లో ఇప్పటికే 1.35 లక్షల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. మత్స్యరంగం, తయారీ రంగంలో కూడా ఉద్యోగాల కోతలు ఉంటాయని పేర్కొన్నారు (Trump tariffs impact India).
‘ట్రంప్ మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. ఇంతటి అపారమైన స్వేచ్ఛను అమెరికా వ్యవస్థలు అధ్యక్షుడికి ఇస్తాయి. ట్రంప్‌కు ముందు సుమారు 45 మంది అధ్యక్షులు అమెరికాలో పాలన సాగించారు. కానీ శ్వౌత సౌధం నుంచి ఇలాంటి తీరును ఇప్పటివరకూ ఎవ్వరూ ఊహించలేదు. ఏరకంగా చూసినా ట్రంప్‌ది అసాధారణ తీరే. నోబెల్ శాంతి బహుమతిని ఆశిస్తున్నట్టు అంతర్జాతీయ నేతలు బహిరంగంగా చెప్పడం మనం ఇప్పటివరకూ ఎన్నడైనా చూశామా? మిగతా దేశాలన్నీ నేను చెప్పినట్టల్లా నడుచుకుంటాయని ఏ దేశాధినేతైనా అనడం ఎప్పుడైనా విన్నామా? భారత్, రష్యా దేశాలవి మృత ఆర్థిక వ్యవస్థలని ఏ ప్రపంచ నేత అయినా అనగా విన్నామా? కాబట్టి, ట్రంప్ కాస్త అసాధారణ వ్యక్తే’ అని అన్నారు (India job losses Trump tariffs).
‘ట్రంప్ సుంకాల కారణంగా భారతపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం పడింది. ఇప్పటికే జనాలు ఉద్యోగాలు కోల్పోతున్నారు. సూరత్‌లోని వజ్రాలు, నగల రంగంలో 1.35 లక్షల మంది జాబ్స్ కోల్పోయారు. 50 శాతం సుంకాల కారణంగా అనేక భారతీయ ఉత్పత్తుల ఎగుమతులు అసాధ్యంగా మారాయి. భారత్ పోటీదారులపై సుంకాలు తక్కువగా ఉండటంతో అమెరికా మార్కెట్‌లోకి ప్రవేశించడం అసాధ్యమైపోయింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మనం చర్చలు జరుపుతున్నాము. వాస్తవానికి భారత్‌పై అదనంగా విధించినది సుంకాం కాదు.. అవి రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఆంక్షలు. ఇది అన్యాయం. భారత్ కంటే ఎక్కువగా చైనా రష్యా నుంచి చమురు, సహజవాయువును దిగుమతి చేసుకుంటోంది’ అని అన్నారు. ఈ పరిస్థితులకు తగ్గట్టుగా భారత్ తనని తాను మలుచుకోవాలని అన్నారు. ఇతర దేశాలకు తన ఎగుమతులను విస్తరించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. కేంద్ర కమిటీ సభ్యుడు మోదెం బాలకృష్ణ మృతి
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా 400 మందికి పైగా సైంటిస్టులు రేయింబవళ్లు శ్రమించారు: ఇస్రో చీఫ్
For More National News and Telugu News