Tamil Nadu: బీమా డబ్బు కోసం తండ్రిని హత్య చేసిన కుమారులు..
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:37 PM
ఈ మధ్య కాలంలో చాలా మంది డబ్బు కోసం సొంత, పరాయి అనే తేడా లేకుండా ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. డబ్బుకు ఇచ్చిన విలువ మనిషి ప్రాణాలకు ఇవ్వడం లేదు. బీమా డబ్బు కోసం కంటికి రెప్పలా సాకిన తండ్రినే హతమార్చారు ఇద్దరు తనయులు.
మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ స్వర్గీయ అందెశ్రీ చెప్పినట్టు.. నేటి సమాజంలో మనిషి డబ్బుకు ఇచ్చిన విలువ బంధాలకు, అనుబంధాలకు, స్నేహానికి ఇవ్వడం లేదు. డబ్బుకోసం ఎంతటి దారుణానికైనా తెగబడుతున్నాడు. తమిళనాడులోని తిరువళ్లూర జిల్లాలో జరిగిన పాము కాటు మరణం కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అనుమానాస్పద పాము కాటు కారణంగా గవర్నమెంట్ స్కూల్ ల్యాబ్ అసిస్టెంట్ ఇ.పి. గణేషన్ (56) మరణం బీమా క్లయిమ్ కోసం జరిగిన హత్యగా పోలీసు దర్యాప్తులో తేలింది. రూ.3 కోట్ల బీమా సొమ్ము కోసం గణేషన్ కుమారులు పాము కాటుతో చంపారని పోలీసులు తెలిపారు.
అక్టోబర్‌లో గణేషన్ (Ganeshan) పాము కాటు(snake bite)తో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అంత్యక్రియలు (Funeral)పూర్తయిన వారం రోజుల్లోనే గణేషన్ పేరుమీద ఉన్న రూ.3 కోట్ల కోసం ఇద్దరు కుమారులు బీమా సంస్థను సంప్రదించారు. బీమా క్లయిమ్ (Insurance claim) కోసం వచ్చిన కుమారుల ప్రవర్తనపై అనుమానం రావడంతో బీమా సంస్థ అధికారులు పోలీసుల(Police)కు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు (police investigation)చేయగా విస్తుతపోయే నిజాలు వెలుగుచూశాయి. గణేష్ కుమారులు మోహన్ రాజ్ (26), హరిహరన్ (27) ప్రైవేట్ ఉద్యోగ చేస్తున్నారు. కొంత కాలంగా ఇద్దరు అన్నదమ్ములు జూదం, బెట్టింగ్, చిన్న చిన్న బిజినెస్ లు చేసి ఆర్థికంగా నష్టపోయారు. తమ తండ్రిపై ఉన్న రూ.3 కోట్ల బీమా సొమ్ము సొంతం చేసుకోవాలని దారుణమైన కుట్ర పన్నారు.
తండ్రిని పాము కాటుతో చంపిస్తే ఎవరికీ అనుమానం రాదని భావించారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 15న తండ్రిపైకి పామును వదిలారు. ఆ పాము కాలుకు కాటు వేసింది.. దీంతో గణేషన్ గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. ఏమీ తెలియనట్టు గణేషన్‌ని హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు కొడుకులు. అలా గణేషన్ ఒకసారి ప్రాణాలతో బయటపడ్డారు. రెండోసారి ఆయన అరవకుండా నోట్లు గుడ్డలు కుక్కి పాముతో కాటు వేయించారు. ఈసారి హాస్పిటల్‌కి ఆలస్యంగా తీసుకువెళ్లడంతో గణేషన్ మార్గమధ్యలోనే మృతి చెందాడు. తమ తండ్రిపై పాము పగబట్టిందని.. అందుకే కాటువేసి చంపిందని ప్రచారం చేశారు. బీమా అధికారులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేయగా అసలు నిజం చెప్పారు కుమారులు. ఈ కేసులో ఇద్దరు కుమారులతో పాటు వారికి సహకరించిన మరో ఆరుగురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
ప్రాణం తీసిన అపార్టుమెంట్ వివాదం..
ఇకపై అన్ని స్కూళ్లల్లో ‘ముస్తాబు’.. సర్కార్ ఉత్తర్వులు జారీ