Sonam Wangchuk: నా భర్తను విడిచిపెట్టండి.. సుప్రీంకోర్టుకు సోనం వాంగ్‌చుక్ భార్య
ABN , Publish Date - Oct 03 , 2025 | 03:11 PM
పాకిస్థాన్‌తో సంబంధాలున్నాయనే తప్పుడు ఆరోపణలతో తన భర్తను అరెస్టు చేసినట్టు గీతాంజలి ఆరోపించారు. జాతీయ భద్రతా చట్టం కింద తన భర్తను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.
లెహ్: లద్దాఖ్(Ladakh)లోని లెహ్(Lah)లో సెప్టెంబర్ 24న జరిగిన హింసాత్మక ఘటనల అనంతరం అరెస్టు చేసిన పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk)ను విడిచిపెట్టాలని కోరుతూ ఆయన భార్య గీజాంజలి జె.అంగ్మో (Gitanjali J Angmo) శుక్రవారం నాడు సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. అక్రమంగా అరెస్టు చేసిన తన భర్తను వెంటనే విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆమె కోరారు. వాంగ్‌చుక్ ప్రస్తుతం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలులో ఉన్నారు.
పాకిస్థాన్‌తో సంబంధాలున్నాయనే తప్పుడు ఆరోపణలతో తన భర్తను అరెస్టు చేసినట్టు గీతాంజలి ఆరోపించారు. జాతీయ భద్రతా చట్టం (NSA) కింద తన భర్తను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. డిటెన్షన్ ఆర్డర్ తనకు ఇంతవరకూ అందలేదని, ఇది చట్ట ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. ఇంతవరకూ తన భర్తను తాను సంప్రదించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనికి ముందు, తన భర్త విడుదలకు జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గీతాంజలి బుధవారం నాడు కోరారు. ఈ మేరకు 3 పేజీల లేఖ రాశారు. ప్రజల పక్షాన నాలుగేళ్లుగా తన భర్త నిలుస్తున్నందునే ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని, తన భర్త పరిస్థితి ఎలాగుందో కూడా తనకు తెలియకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 'దేశం కోసం పనిచేయడమే తప్ప ఏ ఒక్కరికీ ఎన్నడూ హాని చేయని వాంగ్‌చుక్‌ను బేషరతుగా విడుదల చేయాలని మేము కోరుతున్నాం. లద్దాఖ్ వీరపుత్రుల సేవకే ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. దేశం కోసం త్యాగం చేసిన భారత సైన్యానికి సంఘీభావంగా నిలిచారు' అని లెహ్ డిప్యూటీ కమిషనర్ ద్వారా పంపిన రిప్రజెంటేషన్‌లో గీతాంజలి కోరారు. హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ లెర్నింగ్ (హెచ్ఐఏఎల్) వ్యవస్థాపకురాలు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా గీతాంజలి ఉన్నారు.
లెహ్‌లో హింసాత్మక ఘటనలు చెలరేగి నలుగురు మృతిచెందిన రెండ్రోజుల తర్వాత సెప్టెంబర్ 26న వాంగ్‌చుక్‌ను అరెస్టు చేశారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించి దానిని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలనే డిమాండ్‌తో నిరసనలు ప్రారంభం కాగా, అవి ఒక్కసారిగా హింసాత్మకంగా మారడం సంచలనమైంది.
ఇవి కూడా చదవండి..
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు దుర్మరణం
పాక్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాం.. ఐఏఎఫ్ చీఫ్ గూస్‌బమ్స్ కామెంట్లు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి