Amit Shah at All India Speakers Conference : 'స్పీకర్ పదవి గౌరవాన్ని పెంచే దిశగా కృషి చేయాలి': అమిత్ షా
ABN , Publish Date - Aug 24 , 2025 | 03:41 PM
స్పీకర్ పదవి గౌరవాన్ని, ఆ గౌరవాన్ని కాపాడుకోవడంలోని ప్రాముఖ్యతను కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశదీకరించారు. విఠల్‌భాయ్ పటేల్ కేంద్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికై వందేళ్లు పూర్తయిన సందర్భంగా..
న్యూఢిల్లీ, ఆగస్టు 24 : స్పీకర్ పదవి గౌరవాన్ని, ఆ గౌరవాన్ని కాపాడుకోవడంలోని ప్రాముఖ్యతను కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశదీకరించారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు రెండూ సభ నియమాల ప్రకారం కచ్చితంగా సభా కార్యకలాపాలు జరిగేలా చూసుకోవాలని అమిత్ షా నొక్కి చెప్పారు. ఢిల్లీ శాసనసభలో రెండు రోజుల అఖిల భారత స్పీకర్ల సమావేశాన్ని ప్రారంభిస్తూ ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. చారిత్రాత్మకంగా, తమ గౌరవాన్ని కోల్పోయిన అసెంబ్లీలు 'భయంకరమైన పరిణామాలను' ఎదుర్కొన్నాయని కూడా ఈ సందర్భంగా అమిత్ షా హెచ్చరించారు.

స్పీకర్ పదవి గౌరవాన్నిపెంచడానికి నాయకులు కృషి చేసేలా ఈ అఖిల భారత స్పీకర్ల సమావేశం అవకాశాన్ని కల్పిస్తుందని అమిత్ షా అన్నారు. 'స్పీకర్ పదవి గౌరవాన్ని పెంచే దిశగా మనమందరం కృషి చేయడానికి ఇది ఒక అవకాశం. మన దేశ ప్రజల సమస్యలను లేవనెత్తడానికి నిష్పాక్షిక వేదికను అందించడానికి మనం పరితపించాలి. సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాలు నిష్పాక్షిక వాదన చేయాలి. సభ పనితీరు.. సంబంధిత సభ నియమాల ప్రకారం జరిగేలా చూసుకోవాలి. మన దేశ సుధీర్ఘ చరిత్రలో, అసెంబ్లీలు తమ గౌరవాన్ని కోల్పోయినప్పుడల్లా, మనం భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చింది' అని కేంద్ర మంత్రి అన్నారు.
కేంద్ర అసెంబ్లీ స్పీకర్‌గా విఠల్‌భాయ్ పటేల్ ఎన్నికై వందేళ్లు అయిన సందర్భంగా ఆమహనీయుడిని అమిత్ షా స్మరించుకున్నారు. శతాబ్ది ఉత్సవాల విశిష్టతను అమిత్ షా నొక్కి చెప్పారు. పటేల్ ఆగస్టు 24, 1925న కేంద్ర శాసనసభ అధ్యక్షుడిగా (స్పీకర్) నియమితులయ్యారు. అంతేకాదు, కేంద్ర శాసనసభ స్పీకర్ పదవిని నిర్వహించిన మొదటి భారతీయుడు విఠల్‌భాయ్ పటేల్ అని అమిత్ షా అన్నారు.
'ఈ రోజు దేశ శాసనసభ చరిత్ర ప్రారంభమైన రోజు. అది ప్రారంభమైన సభలోనే మనం కూడా ఉన్నాం. ఈ రోజున గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు విఠల్‌భాయ్ పటేల్ కేంద్ర అసెంబ్లీ స్పీకర్‌గా మారడంతో అది ప్రారంభమైంది. నేడు, దేశ శాసనసభలను నడిపే అందరు స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఇక్కడ ఉన్నారు. కావున, ఒక విధంగా, స్వర్ణ చరిత్రను సృష్టించిన, స్వర్ణ భవిష్యత్తు కోసం పనిచేస్తున్న మొత్తం శాసన వ్యవస్థ ఇవాళ ఈ చారిత్రాత్మక సభలో ఉంది.' అని అమిత్ షా అన్నారు.
విఠల్‌భాయ్ పటేల్ కేంద్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికై 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు మనమందరం సమావేశమయ్యామని.. ఇది మనందరికీ గర్వకారణమని అమిత్ షా స్పీకర్ల ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విఠల్‌భాయ్ పటేల్ గురించి మాట్లాడేటప్పుడు, గుజరాత్ ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు.. రాష్ట్రం ఇద్దరు సోదరులైన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను అందించిందని ఘనంగా చెప్పుకుంటారు.
దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీతో కలిసి పగలు, రాత్రి పనిచేసిన వల్లభాయ్, ఇంకా భారతదేశ శాసన సంప్రదాయాలకు పునాది వేసి, నేటి ప్రజాస్వామ్యం పనిచేయడానికి వీలు కల్పించిన విఠల్‌భాయ్ పటేల్‌ను గుజరాత్ రాష్ట్రం ఇచ్చిందని అమిత్ షా అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రసంగించే ముందు కేంద్ర మంత్రి షా.. భారతదేశపు మొట్టమొదటి కేంద్ర శాసనసభ స్పీకర్ అయిన విఠల్‌భాయ్ పటేల్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా స్థాపించబడిన బ్రిటిష్ ఇండియా ద్విసభ శాసనసభలోని దిగువ సభ అయిన సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్ గా విఠల్ భాయ్ పటేల్ పనిచేశారు.

ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News