MLA Sanjay Gaikwad Slaps Canteen Staff: పప్పు బాలేదని చెఫ్‌ను చితగ్గొట్టిన ఎమ్మెల్యే.. ఇదే తమ స్టైల్ అంటూ..!
ABN , Publish Date - Jul 09 , 2025 | 10:23 AM
పప్పు బాగోలేదని చెఫ్‌తో పాటు క్యాంటీన్ సిబ్బందిపై దాడికి దిగారో ఎమ్మెల్యే. ఇలాగేనా వండేది అంటూ వాళ్లపై ముష్టిఘాతాలు కురిపించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
పప్పు బాగోలేదని చెఫ్‌ను ఎమ్మెల్యే చితగ్గొట్టారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటుచేసుకుంది. బుల్దానాకు చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్.. ఆకాశవాణి ఎమ్మెల్యే రెసిడెన్స్‌లో ఉంటున్నారు. అక్కడి క్యాంటీన్‌లో భోజనం చేసేందుకు ఆయన వెళ్లారు. పప్పు, చపాతీతోపాటు రైస్ కావాలని ఆర్డర్ చేశారు. అయితే పప్పు నుంచి దుర్వాసన రావడంతో ఆయన కోపం పట్టలేకపోయారు. వెంటనే క్యాంటీన్‌లోకి వెళ్లిన సంజయ్ గైక్వాడ్.. ఈ పప్పు ఎవరు వండారంటూ అక్కడి స్టాఫ్‌ను నిలదీశారు.
కోపం పట్టలేక..
చేతిలో పప్పు ప్యాకెట్ పట్టుకున్న ఎమ్మెల్యే.. దీని వాసన చూడాలంటూ క్యాంటీన్ స్టాఫ్‌పై సీరియస్ అయ్యారు. కొంత తినేసరికి పొట్ట నొప్పి మొదలైందని, వికారంగా ఉందన్నారు. దీన్ని వండింది ఎవరు? ఒక ఎమ్మెల్యేకు ఇలాగే వడ్డిస్తారా? నాకే ఇలాంటి వంట పెడితే మిగతావారి పరిస్థితి ఏంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సంజయ్ గైక్వాడ్. దీంతో అక్కడికి క్యాంటీన్ ఆపరేటర్ వచ్చాడు. అంతే కోపం పట్టలేక అతడిపై దాడికి దిగారు ఎమ్మెల్యే. మొదట చెంపదెబ్బ కొట్టిన సంజయ్ గైక్వాడ్.. ఆ తర్వాత అతని ముఖం మీద పంచులు వర్షం కురిపించాడు. దీంతో క్యాంటీన్ ఆపరేటర్ కింద పడిపోయాడు.
తప్పే కాదు..
క్యాంటీన్ ఆపరేటర్‌తోపాటు ఇతర స్టాఫ్ మీద కూడా ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ దాడికి దిగారు. అనంతరం ఈ ఘటనపై ఆయన స్పందించారు. క్యాంటీన్‌లో ఫుడ్ బాగోలేదని, వీళ్లు వేలాది మంది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. తాను చేసిన దాంట్లో తప్పేమీ లేదని.. ఇందులో విచారించాల్సిన అవసరం లేదన్నారు. ఇదే శివసేన స్టైల్ అని స్పష్టం చేశారు సంజయ్ గైక్వాడ్. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవీ చదవండి:
ముర్ము.. ముర్మా కోవింద్.. కోవిడ్
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి