Shashi Tahroor: రాహుల్ వ్యాఖ్యలతో విభేదించిన శశిథరూర్
ABN , Publish Date - Aug 01 , 2025 | 08:51 PM
భారత ఆర్థిక స్థితి ఎలా ఉందో అందరికీ తెలుసునని శశిథరూర్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను రాహుల్ సమర్ధించడంపై విభేదించారు.
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే పతనమైందంటూ (Dead Economy) ఆమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) తోసిపుచ్చారు. భారత ఆర్థిక స్థితి ఎలా ఉందో అందరికీ తెలుసునని అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమర్ధించడంపై విభేదించారు.
భారత్‌పై 25 శాతం దిగుమతి సుంకాలు విధించిన ట్రంప్.. రష్యా నుంచి ఆయుధాలు, చమురును కొనుగోలు చేయడంపై మండిపడ్డారు. భారత్‌తో రష్యా ఏం చేస్తోందనే విషయాన్ని తాము పట్టించుకోమని, వారిద్దరూ మునిగిపోతుంటే తమకెందుకుని ట్రంప్ ఒక పోస్టులో పేర్కొన్నారు. దీనిపై వెంటనే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, ట్రంప్ నిజమే చెప్పారని సమర్ధించారు. ఇదే విషయమై పార్లమెంట్ వెలుపల శశిథరూర్ ను మీడియా ప్రశ్నించినప్పుడు రాహుల్ మాటలతో విభేదించారు. 'ఎంతమాత్రం కాదు, భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో అందరికీ తెలుసని' సమాధానమిచ్చారు.
రాహుల్ ఏమన్నారు?
పతనమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను పేర్కొనడం ద్వారా ట్రంప్ నిజమే చెప్పారని, యావత్ ప్రపంచానికి ఆ విషయం తెలుసునని రాహుల్ అన్నారు. కాగా, ట్రంప్ టారిఫ్ సీరియస్ అంశమని గతంలో శశిథరూర్ వ్యాఖ్యానించారు. 25 శాతం టారిఫ్ పెంపు, పెనాల్టీలతో కలిసి మొత్తం సుంకం 35-45 శాతం వరకూ ఉండొచ్చన్నారు. 100 శాతం టారిఫ్ అనే మాటలు కూడా వినిపిస్తున్నాయని, అదే జరిగితే మన ఎగుమతులకు నష్టం జరుగుతుందన్నారు. ఎందుకంటే అమెరికాలో మనకు పెద్ద మార్కెట్ ఉందని విశ్లేషించారు. కాంగ్రెస్‌కు శశిథరూర్ దూరం జరుగుతున్నారంటూ ఇటీవల విస్తృతంగా ప్రచారం జరుగుతున్న క్రమంలో 'డెడ్ ఎకానమీ' విషయంలో రాహుల్ అభిప్రాయానికి భిన్నంగా శశిథరూర్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి..
పతనమైన ఆర్థిక వ్యవస్థలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందనిదే
ఆర్ఎస్ఎస్ చీఫ్‌ను అరెస్టు చేయాలని ఆదేశాలు.. మాజీ పోలీసు అధికారి వెల్లడి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి