Shashi Tharoor: కాంగ్రెస్ కీలక సమావేశాలకు శశిధరూర్ గైర్హాజర్.. వరుసగా రెండోసారి
ABN , Publish Date - Dec 01 , 2025 | 07:36 PM
థరూర్ స్వరాష్టమైన కేరళలో వచ్చే ఏడాది ప్రథమార్ధంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఆయన ఒకవేళ కాంగ్రెస్‌కు ఉద్వాసన చెప్పాలనుకుంటే ఎన్నికలకు ముందే ఆపని చేయాల్సి ఉంటుంది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధిష్ఠానం, ఆ పార్టీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor)కు మధ్యం ఎడం అంతకంతకూ పెరుగుతున్న సంకేతాలు బలపడుతున్నాయి. కొద్దికాలంగా ప్రధానమంత్రి మోదీ, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ, తదితరులపై ఆయన ప్రశంసలు కురిపిస్తుండటంపై కాంగ్రెస్ వర్గాలు గుర్రుమంటున్నాయి. అయితే ఆయన వ్యక్తిగత అభిప్రాయాలతో తమకెలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ కొట్టిపారేసింది. తాజాగా ఆయన వరుసగా రెండోసారి కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలకు గైర్హాజరు కావడం చర్చనీయాంశమవుతోంది. ఆయన బీజేపీలో చేరే అవకాశాలున్నాయనే ఊహాగానాలకు ఈ పరిణామాలు ఊతమిస్తున్నాయని అంటున్నారు.
థరూర్ స్వరాష్టమైన కేరళలో వచ్చే ఏడాది ప్రథమార్ధంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఆయన ఒకవేళ కాంగ్రెస్‌కు ఉద్వాసన చెప్పాలనుకుంటే ఎన్నికలకు ముందే ఆపని చేయాల్సి ఉంటుంది.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారంనాడు ప్రారంభం కాగా, ఈ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై సోమవారం సాయంత్రం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ తదితరులు హాజరయ్యారు. థరూర్ ఈ సమావేశానికి గైర్హాజర్ అయ్యారు. అయితే తాను కేరళలో వృద్ధురాలైన తల్లి వద్ద ఉన్నానని, సమావేశానికి హాజరుకాలేనని అధిష్ఠానానికి తెలియజేసినట్టు మీడియాకు శశిథరూర్ తెలిపారు. కాంగ్రెస్ కీలక సమావేశానికి థరూర్ గైర్హాజర్ కావడం వరుసగా ఇది రెండోసారి. దీనికి ముందు నవంబర్ 18న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్, ఖర్గే ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా శశిథరూర్ హాజరుకాలేదు. తనకు ఒంట్లో బాగోలేదని అధిష్ఠానానికి ఆయన తెలియజేసారు. అయితే దీనికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉపన్యసించిన ఒక కార్యక్రమంలో థరూర్ పాల్గొన్నారు. అనంతరం ప్రధాని ప్రసంగంపై ప్రశంసలు కురిపించడంతో పాటు ఈ కార్యక్రమంలో తాను పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
కేరళలో ప్రస్తుతం స్థానిక సంస్ధల ఎన్నికలకు వామపక్షాలు, కాంగ్రెస్, ఇతర పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. నిజానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్సి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ సైతం ఆదివారంనాడు జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరుకాలేదు. అయితే థరూర్ హాజరుకాకపోవడంపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. కీలక అంశాలపై పార్టీ వైఖరితో థరూర్ విభేదిస్తుండటమే ఇందుకు కారణం. పార్టీ పనితీరులో సమూల సంస్కరణలు జరగాలని 2023లో సోనియగాంధీకి లేఖ రాసిన రెబల్ గ్రూప్ (జీ-23)లో శిశిథరూర్ కూడా ఉన్నారు.
ఖర్గే ఘాటు వ్యాఖ్యలు
గత కొద్దినెలలుగా శశిథరూర్ చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ వైఖరికి భిన్నంగా ఉన్నాయంటూ సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోదీని ప్రశంసించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం అసంతృప్తి వ్యక్తం చేసారు. 'కంట్రీ ఫస్ట్ అనేది కాంగ్రెస్ నమ్ముతుంది. కొందరు వ్యక్తులకు మాత్రం మోదీనే ఫస్ట్' అని ఖర్గే పరోక్షంగా శిశథరూర్‌పై విసుర్లు విసిరారు.
ఇవి కూడా చదవండి..
పార్లమెంటరీ మర్యాదలను 11 ఏళ్లుగా తుంగలో తొక్కారు.. మోదీ వ్యాఖ్యలపై ఖర్గే
శునకంతో పార్లమెంటుకు.. వివాదంలో రేణుకా చౌదరి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి