BLO Death: ఎస్ఐఆర్ పని ఒత్తిడి.. మరో బీఎల్ఓ ఆత్మహత్య
ABN , Publish Date - Dec 01 , 2025 | 04:57 PM
ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన పనులతో తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాయని, తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలో విఫలమయ్యానని సింగ్ రికార్డు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బరేలి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతున్న రాష్ట్రల్లో పని ఒత్తిడి కారణంగా బూత్ స్థాయి అధికారులు (BLOs) ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు కలవరపెడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని బరేలీ జిల్లాలో బీఎల్ఓ బాధ్యతల్లో ఉన్న 46 ఏళ్ల ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయనను మొరాదాబాద్‌లోని భగత్‌పూర్ తాండా విలేజ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో అసిస్టెంట్ టీచర్ సర్వేశ్ సింగ్‌గా గుర్తించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన పనులతో తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాయని, తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలో విఫలమయ్యానని సింగ్ రికార్డు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆత్మహత్య చేసుకుంటున్నందుకు క్షమించాలని కుటుంబసభ్యులను ఆ వీడియోలో కోరారు. ఆయనకు భార్య బాబ్లి, నలుగురు కుమార్తెలు ఉన్నారు.
పోలీసుల కథనం ప్రకారం, బహెరి గ్రామంలోని తన నివాసంలో సింగ్ ఉరేసుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆయన భార్య ముందుగా ఈ విషయాన్ని గుర్తించారు. తనకిచ్చిన పని పూర్తి చేసేందుకు తగిన సమయం లేకపోయిందని, పని ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోయిందని పేర్కొంటూ సింగ్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపినట్టు ఠూకూర్‌ద్వారా సర్కిల్ ఆఫీసర్ ఆశిష్ ప్రతాప్ సింగ్ తెలిపారు.
ఎస్ఐఆర్, బీఎల్ఓల మరణాలపై వివాదం
ఎస్ఐఆర్ ప్రక్రియ హడావిడిగా చేపట్టడం వల్ల బీఎల్ఓలు తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం, భారత ఎన్నికల కమిషన్‌పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దీనిపై సోమవారంనాడు మొదలైన పార్లమెంటు సమావేశల్లో చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా బీఎల్ఓల ఆత్మహత్యలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఎస్ఐఆర్‌పై ఎలాంటి వదంతులు సృష్టించవద్దని, బీఎల్ఓలను బెదిరించవద్దని టీఎంసీకి సుప్రీంకోర్టు సూచించింది.
ఇవి కూడా చదవండి..
పార్లమెంటరీ మర్యాదలను 11 ఏళ్లుగా తుంగలో తొక్కారు.. మోదీ వ్యాఖ్యలపై ఖర్గే
శునకంతో పార్లమెంటుకు.. వివాదంలో రేణుకా చౌదరి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి