Sabarimala: బంగారం అవకతవకల కేసు.. శబరిమల ఆలయ మాజీ అధికారి అరెస్టు
ABN , Publish Date - Oct 23 , 2025 | 05:41 PM
శబరిమల బంగారం లెక్కల అవకతవకల కేసులో సిట్ తాజాగా మరో కీలక నిందితుడిని అరెస్టు చేసింది. ఆలయ మాజీ అధికారి మురారి బాబును బుధవారం అదుపులోకి తీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: శబరిమల ఆలయంలో వెలుగు చూసిన బంగారం అవకతవకలపై దృష్టిసారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బుధవారం ఆలయ మాజీ అధికారి మురారి బాబును అదుపులోకి తీసుకుంది. గురువారం ఆయన బంధువులకు ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. అలాగే మురారి బాబును కలుసుకునేందుకు వారిని అనుమతించింది. త్వరలో మురారి బాబును మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి ఆయన్ని కస్టడీకి కోరనుంది సిట్ (Sabarimala SIT Murari Babu arrest).
శబరిమల గర్భగుడి పక్కన ఉన్న ద్వారపాలకులు, ఆలయ ద్వారాలపై ఏర్పాటు చేసిన బంగారు తాపడాల బరువు తగ్గిన విషయం ప్రస్తుతం కేరళలో కలకలం రేపుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాని నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్‌ను సిట్ అరెస్టు చేసింది. బంగారు పూతతో ఉన్న ఆ రాగి తాపడాలకు మరమ్మతుల పనులను స్పాన్సర్ చేసేందుకు ఉన్నికృష్ణన్ 2019లో ముందుకొచ్చారు. వాటిని తొలగించే సమయంలో బరువు 42.8 కిలోలుగా ఉంది. తాపడాల మరమ్మతుల తరువాత తూచి చూడగా బరువు 38.28 కేజీలుగా తేలింది. దీంతో, ఈ అంశం వివాదాస్పదంగా మారింది (Sabarimala Gold Scam).
ఈ కేసుకు సంబంధించి అప్పట్లో విచారణ జరిపిన ట్రావెన్‌కోర్ దేవశ్వమ్ బోర్డు (టీడీబీ).. అవకతవకలు జరిగాయని తేల్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయ అధికారి మురారిని సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో సిట్ అధికారులు బుధవారం మురారిని ఆయన నివాసంలోనే అరెస్టు చేసి తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ ఆఫీసుకు తరలించారు. అనంతరం అరెస్టు గురించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
బంగారం లెక్కల అవకతవకలకు సంబంధించి రెండు కేసుల్లో మురారి బాబు నిందితుడిగా ఉన్నారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. బంగారు తాపడాల మరమ్మతులకు సంబంధించి తాను ప్రాథమిక నివేదిక మాత్రమే ఇచ్చానని చెప్పారు. తుది అనుమతులు ఉన్నతాధికారులు ఇచ్చారని అన్నారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ అక్టోబర్ 30 వరకూ సిట్ కస్టడీలో ఉంటారు.
ఇవి కూడా చదవండి:
విమానాల్లో వపర్‌బ్యాంకులతో ముప్పు.. కఠిన నిబంధనలు విధించే యోచనలో డీజీసీఏ
పశ్చిమబెంగాల్‌లో మరోసారి కలకలం.. అత్యాచారం చేస్తామంటూ మహిళా డాక్టర్‌కు బెదిరింపులు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి