Russian Woman: గోకర్ణ అడవి గుహలో
ABN , Publish Date - Jul 13 , 2025 | 03:24 AM
ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణ అటవీ ప్రాంతంలోని రామతీర్థకొండ గుహ వద్ద రష్యాకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో ఆవాసాన్ని ఏర్పరచుకున్నారు....
ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నట్టు గుర్తింపు
బెంగళూరు, జూలై 12(ఆంధ్రజ్యోతి): ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణ అటవీ ప్రాంతంలోని రామతీర్థకొండ గుహ వద్ద రష్యాకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో ఆవాసాన్ని ఏర్పరచుకున్నారు. పర్యాటకుల రక్షణ కోసం ఏర్పాటైన పోలీసు పెట్రోలింగ్ టీం వీరిని గుర్తించింది. అటవీ ప్రాంతంలో ఒక చోట దుస్తులు కనిపించడంతో ఎవరో ఉన్నట్టు అనుమానించి, వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. గుహ సమీపంలోని ఓ కుటీరంలో రష్యాకు చెందిన నీనా కుటీనా(40), ఆమె పిల్లలు ప్రేమ(6), అమా(4) ఉన్నట్టు గుర్తించారు. దేవుడి పూజ, ధ్యానం పట్ల ఆసక్తితో తాను ఇక్కడ ఉంటున్నానని నీనా పోలీసులకు వివరించారు. ఆధ్యాత్మిక చింతన కోసం గోవా నుంచి పిల్లలతో కలిసి గోకర్ణకు వచ్చానని తెలిపారు. వారు ఉంటున్న గుహ ప్రాంతం అత్యంత ప్రమాదకరమైనది. అక్కడ పాములతోపాటు వన్యప్రాణులు ఉంటాయి. తరచూ మట్టి చరియలు విరిగి పడుతుంటాయి. దీంతో పోలీసులు ఆమెకు నచ్చజెప్పి కుమట తాలూకా బంకికొడ్లు గ్రామంలో ఉన్న శంకర ప్రసాద్ ఫౌండేషన్‌కు చెందిన సరస్వతి స్వామిజీ ఆశ్రమానికి తరలించారు. కాగా.. ఆమె పాస్‌పోర్ట్ గడువు 2017 ఏప్రిల్ 17న ముగిసినట్టు గుర్తించారు. తాత్కాలికంగా ఆశ్రమంలో ఉంచిన పోలీసులు, ఈ నెల 14న బెంగళూరు శాంతినగర్‌లోని ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ కార్యాలయంలో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.