Duvvuri Subbarao: ట్రంప్ సుంకాలతో నష్టం.. రూ.7 లక్షల కోట్లు!
ABN , Publish Date - Aug 14 , 2025 | 05:08 AM
అమెరికా సుంకాలు ఓవైపు, భారత మార్కెట్లలోకి వరదలా వచ్చి పడే చైనా ఉత్పత్తులు మరోవైపు.. ఈ రెండింటి ప్రభావంతో భారత్ భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు హెచ్చరించారు.
దుస్తులు, పాదరక్షలు, ముత్యాలు, ఆభరణాల ఎగుమతులపై తీవ్ర ప్రభావం
చైనా ఉత్పత్తులు వరదలా వచ్చి పడే పరిస్థితి
కొత్త మార్కెట్ల అన్వేషణే దీనికి పరిష్కారం
ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు
న్యూఢిల్లీ, ఆగస్టు 13: అమెరికా సుంకాలు ఓవైపు, భారత మార్కెట్లలోకి వరదలా వచ్చి పడే చైనా ఉత్పత్తులు మరోవైపు.. ఈ రెండింటి ప్రభావంతో భారత్ భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు హెచ్చరించారు. భారతీయ దిగుమతులపై ట్రంప్ తాజాగా విధించిన 50% సుంకాల ప్రభావం దుస్తులు, పాదరక్షలు, ముత్యాలు, ఆభరణాలు వంటి పరిశ్రమల ఎగుమతులపై తీవ్రంగా ఉండవచ్చని, ఫలితంగా దాదాపు రూ.7 లక్షల కోట్ల మేర (జీడీపీలో 2%) నష్టం వాటిల్లవచ్చని అంచనా వేశారు. ‘లాభాలు తగ్గుతాయి. కొనుగోళ్లు మందగిస్తాయి. ఉద్యోగాలు పోతాయి. పరిశ్రమలు పూర్తిస్థాయిలో పని చేయకపోవచ్చు’ అని పేర్కొన్నారు. మరోవైపు, అమెరికా సుంకాలతో ఆ దేశంలో మార్కెట్ వాటాను కోల్పోయే చైనా.. నష్టాన్ని పూడ్చుకోవటానికి తమ ఉత్పత్తులను భారత్‌కు పెద్ద ఎత్తున తరలించే అవకాశం ఉందన్నారు. ఒక ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుబ్బారావు.. దేశ ఆర్థికవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మాట్లాడారు. ట్రంప్ సుంకాలతో జరిగే నష్టాన్ని తగ్గించుకోవటానికి.. ఇతర మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేయటం, ధరలపై కొత్తగా సంప్రదింపులు జరపటం వంటి చర్యలు చేపట్టాలని భారతీయ ఎగుమతిదారులకు ఆయన సూచించారు.
ఈ విధంగా కొత్తగా ఎదురైన సవాళ్లను అవకాశంగా మల్చుకోవాలని పిలుపునిచ్చారు. వ్యవసాయం, పాడిపరిశ్రమ రంగాల్లోకి అమెరికాతోపాటు ఏ దేశానికీ పూర్తిగా ద్వారాలు తెరవకూడదని, ఇది గ్రామీణప్రాంతాల్లో ఉపాధికి, ఆహారభద్రతకు సంబంధించిన కీలకమైన విషయమని సుబ్బారావు తెలిపారు. వాణిజ్య సంబంధాల కోసం అవసరమైతే.. ఉభయ ప్రయోజనకారిగా ఉండేలా, ఏవైనా కొన్ని ఉత్పత్తుల్లో పరిమితంగానే విదేశీ పెట్టుబడులను అనుమతించాలన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా ఎదగాలన్న భారత్ లక్ష్యం ముందు మూడు అడ్డంకులు ఉన్నాయని సుబ్బారావు పేర్కొన్నారు. అవి 1. విద్య, వైద్యరంగాల్లో తగినన్ని పెట్టుబడులు పెట్టకపోవటం 2. సంస్కరణల్లో మందగమనం, నైపుణ్యలేమి, అసమగ్ర సరఫరా చెయిన్లు 3. పెరుగుతున్న ఆర్థిక అంతరాలు, తగ్గుతున్న డిమాండ్ అని వివరించారు.
వచ్చే నెలలో ట్రంప్-మోదీ ముఖాముఖీ?
ట్రంప్ సుంకాల బాదుడుతో అమెరికాతో వాణిజ్య సంబంధాల విషయంలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రధాని మోదీ సెప్టెంబరులో న్యూయార్క్‌లో పర్యటించే అవకాశం ఉంది. న్యూయార్క్ వేదికగా సెప్టెంబరులో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్‌జీఏ) వార్షిక ఉన్నతస్థాయి సదస్సులో మోదీ పాల్గొని, ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో మోదీ ముఖాముఖీ అయ్యే అవకాశం కూడా ఉంది. మరోవైపు, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ నెల 20, 21 తేదీల్లో రష్యాలో పర్యటించనున్నారు. ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గి లావ్రోవ్‌తో జైశంకర్ చర్చలు జరుపుతారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపాలంటూ భారత వస్తువులపై అమెరికా 50ు సుంకాలు విధించిన ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉండగా, భారత్-అమెరికా సంయుక్తంగా సెప్టెంబరు 1 నుంచి 14వ తేదీ వరకు సైనిక విన్యాసాలను నిర్వహించనున్నాయి. సుమారు 400 మంది వరకు ఇండియన్ ఆర్మీ సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొననున్నారు. యుద్ధ అభ్యాస్ పేరిట అమెరికాలోని అలస్కాలో ఈ విన్యాసాలు జరుగనున్నాయి. 2004 నుంచి ఏటా ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు.
ఎఫ్-16ల గురించి పాక్‌నే అడగండి
న్యూఢిల్లీ/వాషింగ్టన్, ఆగస్టు 13: ‘‘భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో కనీసం ఆరు ఫైటర్ జెట్లు కూలిపోయినట్లు మాకు సమాచారం ఉంది’’ అని ట్రంప్ గతంలో ప్రకటించారు. ‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు చెందిన ఐదు ఫైటర్ జెట్‌లు, ఒక పెద్ద విమానాన్ని కూల్చేసాం’’ అని భారత ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. ట్రంప్ ప్రకటనపై స్పష్టత కోసం ఎన్డీటీవీ అమెరికా స్వేచ్ఛ సమాచార హక్కు చట్టం(ఎ్‌ఫవోఐఏ) కింద దరఖాస్తు చేసింది. అయితే, అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ దీనికి సమాధానం ఇవ్వడానికి విముఖత వ్యక్తం చేసింది. పాకిస్థాన్ వాయుసేన వాడే ఎఫ్-16 ఫైటర్ జెట్ల గురించి సమాధానం ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఆ వివరాలను పాకిస్థాన్‌నే అడగాలను సూచించింది. అయితే.. 2019 బాలాకోట్ ఉదంతం తర్వాత కూడా పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం ఒకటి కూలిపోయిందని వార్తలు రావడంతో అమెరికా వెంటనే స్పందించి.. ‘‘అలాంటిదేమి లేదు’’ అని సమాధానమివ్వడం తెలిసిందే..!
ఈ వార్తలు కూడా చదవండి..
బిహార్ ఓటరు సవరణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
రిమాండ్ పొడిగింపు.. కోర్టు వద్ద చెవిరెడ్డి హల్‌చల్
For More National News And Telugu News