Share News

Rahul Gandhi: మోదీ మౌనం అనుమానాన్ని పెంచుతోంది

ABN , Publish Date - Jul 24 , 2025 | 03:46 AM

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య తానే కాల్పులు విరమింపజేశానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికి పాతిక సార్లు అన్నారని.. దీనిపై మోదీ ప్రభుత్వం ఎందుకు స్పందించదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ నిలదీశారు.

Rahul Gandhi: మోదీ మౌనం అనుమానాన్ని పెంచుతోంది

  • కాల్పులు విరమింపజేశానని ట్రంప్‌ పాతిక సార్లు అన్నారు

  • కానీ, మోదీ ఒక్కసారైనా స్పందించలేదు

  • ప్రధానిని చూస్తే ఏదో తేడా కొడుతోంది

  • ట్రంపే కాల్పులను ఆపించారు: రాహుల్‌

న్యూఢిల్లీ, జూలై 23: భారత్‌-పాకిస్థాన్‌ మధ్య తానే కాల్పులు విరమింపజేశానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికి పాతిక సార్లు అన్నారని.. దీనిపై మోదీ ప్రభుత్వం ఎందుకు స్పందించదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ నిలదీశారు. కాల్పులు విరమింపజేయడానికి ట్రంప్‌ ఎవరని ప్రశ్నించారు. దీనిపై ప్రధాని మోదీ ఒక్కసారి కూడా జవాబివ్వలేదంటే ఏదో తేడా కొడుతోందని వ్యాఖ్యానించారు. కాల్పుల విరమణ దిశగా మధ్యవర్తిత్వం నెరిపానని ట్రంప్‌ చెబుతూ ఉన్నా.. మోదీ మౌనం వహిస్తున్నారని..అమెరికా అధ్యక్షుడిగా విధేయుడిగా ఉండాలని అనుకుంటున్నారా అని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ప్రశ్నించారు. బుధవారం పార్లమెంటు ప్రాంగణంలో వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. ‘ట్రంప్‌ ఒకటికి పదిసార్లు నేనే యుద్ధాన్ని ఆపానంటూ భారత్‌ను అవమానిస్తుంటే మోదీ గట్టిగా స్పందించాలి. కానీ ఆయన మాట్లాడడం లేదు. ఇది ఆయన బలహీనతను సూచిస్తోంది’ అని ఖర్గే అన్నారు.


ప్రతిపక్షం డిమాండ్‌ చేసినట్లుగా ఈ అంశంపై పార్లమెంటులో ప్రధాని ప్రకటన చేయాలంటారా అని విలేకరులు అడుగగా.. ప్రధాని ఎలా ప్రకటన చేస్తారని రాహుల్‌ ఎదురుప్రశ్న వేశారు. ‘ఆయనేం చెబుతారు? కాల్పుల విరమణ ట్రంప్‌ చేయించారని చెబుతారా? చెప్పరు. కానీ అదే కరెక్టు. మోదీ దాక్కోలేరు. ట్రంపే కాల్పులు ఆపించారు. యావత్‌ ప్రపంచానికీ ఈ వాస్తవం తెలుసు’ అని అన్నారు. దేశంలో ఎన్నికలను దొంగిలిస్తున్నారని రాహుల్‌ మరోసారి ఆరోపించారు. బిహార్‌లో 52 లక్షల ఓట్లను తొలగించడంపై స్పందిస్తూ.. ‘ఇది 52 లక్షల ఓట్ల గురించి కాదు. బిహార్‌ ఒక్కదాని గురిం చే కాదు. మహారాష్ట్రలోనూ మోసం చేశారు. దీనిపై ఈసీని ప్రశ్నించాం. ఓటర్ల జాబితాలను చూపించాలని అడిగితే చూపించలేదు. ఎన్నికల బూత్‌లలో వీడియో ఫుటేజీ కోరితే.. రూల్స్‌ను సవరించేశారు. బిహార్లో ఎస్‌ఐఆర్‌ పేరుతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ సోదరసోదరీమణుల ఓట్లను కాజేస్తున్నారు. దీనిపై మౌనంగా కూర్చోం. ప్రజల హక్కుల కోసం ఇండియా కూటమి పార్లమెంటు నుంచి వీధుల వరకు పోరాడుతుంది’ అని రాహుల్‌ స్పష్టంచేశారు.


సిందూర్‌పై 28న లోక్‌సభలో.. 29న రాజ్యసభలో చర్చ

న్యూఢిల్లీ, జూలై 23: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న లోక్‌సభలో, 29న రాజ్యసభలో చర్చ జరగనుంది. దీనికోసం ఒక్కో సభకు 16 గంటలు చొప్పున ప్రభుత్వం సమయం కేటాయించింది. బుధవారం జరిగిన రాజ్యసభ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్చలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రసంగిస్తారని భావిస్తున్నారు. భారత్‌, పాక్‌ మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్‌ పదేపదే ప్రకటించుకోవడంపై పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చ జరగాలని కాంగ్రెస్‌ సహా విపక్షాలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో చర్చకు తేదీని నిర్ణయించారు. సిందూర్‌పై చర్చలో ప్రభుత్వం తన వాదనను దూకుడుగా వినిపించడానికి సిద్ధమవుతోంది. సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌, రక్షణ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్‌, త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్‌ భేటీలు నిర్వహించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్

రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 24 , 2025 | 03:46 AM